రైతుల పేరిట చెరువుల మట్టి అక్రమ రవాణా
ABN , Publish Date - Jun 01 , 2026 | 11:35 PM
చెరువుల్లో పూడికతీత, ఆధునికీకరణ పనుల పేరిట తీసిన మట్టిని రైతుల పొలాల పేరు చొప్పుకొని కొందరు భారీ ఎత్తున అక్రమ రవాణా చేస్తున్నారు. చెరువుల్లో ఎక్స్‌కవేటర్లు ఏర్పాటు చేసి ఉదయం నుంచి అర్థరాత్రి వరకు వందలాది ట్రాక్టర్లతో మట్టిని ఇటుక బట్టిలు, వెంచర్లు, ప్రైవేట్ ఇంటి నిర్మాణస్థలాలు, ఇతర కమర్షియల్ పనులకు తరలించి భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు.
మంథని, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): చెరువుల్లో పూడికతీత, ఆధునికీకరణ పనుల పేరిట తీసిన మట్టిని రైతుల పొలాల పేరు చొప్పుకొని కొందరు భారీ ఎత్తున అక్రమ రవాణా చేస్తున్నారు. చెరువుల్లో ఎక్స్‌కవేటర్లు ఏర్పాటు చేసి ఉదయం నుంచి అర్థరాత్రి వరకు వందలాది ట్రాక్టర్లతో మట్టిని ఇటుక బట్టిలు, వెంచర్లు, ప్రైవేట్ ఇంటి నిర్మాణస్థలాలు, ఇతర కమర్షియల్ పనులకు తరలించి భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. పది రోజులుగా పగలు రాత్రి తేడా లేకుండా మంథని పట్టణంలోనే యథేచ్ఛగా కొనసాగుతున్న మట్టి దందా పై ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. మంథని పట్టణ శివారులోని అయ్యాగారి చెరువు, రావుల చెరువులో కొనసాగుతున్న పూడిక తీత పనుల్లో తీసిన మట్టిని కొందరు రైతుల పేరిట వారి పొలాలకు తరలించగా అత్యధికంగా కమర్షియల్, ప్రైవేట్ స్థలాలకు, ఇట్టుక బట్టిలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తమకు కావాల్సిన మట్టి కోసం లోతుగా భారీ గుంతలు తీసుకుండటంతో చెరువులో గుంతలు ఏర్పడాయి. వర్షాలు పడితే ఇందులో నీరు చేరి చెరువులోకి వెళ్ళే రైతులు, మత్స్యకారులు, ప్రజలు ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఉంది. మరో వైపు చెరువు పూడికతీత, రింగ్ బండ్ నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూడికతీత మట్టి ఇతర కమర్షియల్ ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటన్న దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.