Share News

జోరుగా మట్టి అక్రమ రవాణా

ABN , Publish Date - Apr 10 , 2026 | 11:49 PM

జిల్లాలో మట్టి మాఫియా కొండలు, గుట్టలను కొల్లగొడుతూ అక్రమంగా మట్టిని జోరుగా తరలిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. తమ కళ్లెదుట నుంచి మట్టి లారీలు వెళుతున్నా కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

జోరుగా మట్టి  అక్రమ రవాణా

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో మట్టి మాఫియా కొండలు, గుట్టలను కొల్లగొడుతూ అక్రమంగా మట్టిని జోరుగా తరలిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. తమ కళ్లెదుట నుంచి మట్టి లారీలు వెళుతున్నా కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎక్కడికక్కడ ఆయా విభాగాల అధికారులను మేనేజ్‌ చేసుకుని మట్టి మాఫియా రాత్రనకా, పగలనకా మట్టి దందాను కొనసా గిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నట్లుగా కనబడు తున్నది. కొందరు ఇదే పనిగా రాజకీయ పార్టీల నాయకుల అండదండలతో దందాను కొనసాగిస్తున్నారు. గ్రామస్తులు అడ్డుకుంటున్నారని నామమాత్రంగా పర్మిట్లు తీసుకువచ్చి మట్టిని తరలిస్తున్నారు. వందల టన్నుల్లో అనుమతులు తీసుకుని వేల టన్నుల్లో మట్టిని తరలిస్తున్నారు. మట్టి మాఫియాకు జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న కారణంగానే వారి దందా యథేచ్ఛగా సాగుతున్నది. పెద్దపల్లి మండలం పాలితం గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే 700లో ఐదు హెక్టార్ల విస్తీర్ణంలో 500 టన్నుల మట్టిని తీసుక వెళ్లేం దుకుగాను పి.సత్తయ్య అనే వ్యక్తి జిల్లా గనులు, భూగర్భ శాఖాధికారి దరఖాస్తు చేసుకున్నారు. వారు అనుమతించడంతో 13 వేల రూపాయల సీనరేజీ ఫీజు చెల్లించడంతో, ఆయనకు పర్మిట్‌నంబర్‌ టి13పీఈడీ0047 ద్వారా గత నెల 13న అనుమతులు ఇచ్చారు. అదే రోజు నుంచి మార్చి 31వ తేదీ వరకు మట్టిని తరలించుకునేందుకు గడువు ఇచ్చారు. అయితే పర్మిట్‌ పేరిట 25 నుంచి 30 టన్నుల సామర్థ్యం గల లారీలు, టిప్పర్లలో రోజుకు వెయ్యి టన్నుల చొప్పున మట్టిని తరలించారు. వాస్తవానికి ప్రభుత్వ భూముల్లో తీసే మట్టిని ప్రభుత్వ అవసరాల కోసం మాత్రమే తరలించేందుకు అనుమతి ఇవ్వాలి. కానీ మట్టి దందా చేసే నాయకులు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, ఇతర భవ నాల నిర్మాణాల కోసం, ఇతరత్రా ప్రైవేట్‌ అవసరాలకు మట్టిని విక్రయించుకుంటున్నారు. ఒక్కో లారీకి దూరా న్ని బట్టి 3 వేల నుంచి 5 వేల రూపాయల వరకు విక్రయిస్తున్నారని సమాచారం. గనులు, భూగర్భ శాఖాధికారులు, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు ఎవరు కూడా మట్టితో తరలుతున్న లారీలు, టిప్పర్లను పట్టుకో కుండా తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తు న్నట్లు తెలుస్తున్నది. పాలితంలో గుట్ట మట్టి కోసం తీసుకున్న 500 టన్నుల అనుమతులు ఒక్క రోజులోనే పూర్తి కాగా, రోజుకు 1000 టన్నులకు తక్కువ గాకుండా అక్రమంగా మట్టిని తరలించినట్లు కనబడు తున్నది. పర్మిట్‌ కాలపరిమితి 31వ తేదీ వరకే పూర్త యినా కూడా ఈ నెలలో కూడా ఇంకా మట్టిని తరలి స్తూనే ఉన్నారు. ఒక టన్నుకు ప్రభుత్వానికి 26 రూపా యల చొప్పున సీనరేజీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు పాలితం గుట్ట నుంచి 25 వేల టన్నులకు పైగా మట్టిని అక్రమంగా తరలించి ప్రభుత్వాదాయానికి 6 లక్షల 50 వేల రూపాయల వరకు గండి కొట్టినట్లుగా తెలుస్తున్నది. ప్రభుత్వానికి చెల్లించేది స్పల్పమే అయినా దానిని కూడా మట్టి మాఫియా ఎగ్గొట్టి లక్షలాది రూపాయలు అనతి కాలంలోనే ఆర్జిస్తున్నారు. పాలితం నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న విషయాన్ని గమనించిన మహిళలు శుక్రవారం మట్టి టిప్పర్లను అడ్డుకున్నారు. మట్టి తరలింపునకు సంబంధించి అను మతులు చూపలేదని తెలిసింది. అంతేగాకుండా వారం తా తహసీల్దార్‌ కార్యాలయం చేరుకొని అక్రమ మట్టి దందాను నిలవరింపజేయాలని, ఇప్పటి వరకు నిర్ణీత ప్రదేశం నుంచి ఎంత మొత్తంలో మట్టిని తరలించుకు పోయారో ఎలకా్ట్రనిక్‌ టోటల్‌ స్టేషన్‌ (ఈటీఎస్‌) యంత్రం ద్వారా లెక్కించి సీనరేజీ సొమ్మును వసూలు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఒక్క పాలితంలోనే గాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా అక్రమంగా మట్టి దందా కొనసాగుతున్నది. ఈ విషయమై కలెక్టర్‌ స్పందించి అక్రమ మట్టి దందాను నిలువరించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Apr 10 , 2026 | 11:49 PM