యాగాలు చేస్తే నీళ్లురావు
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:48 PM
మంత్రులు యాగాలు చేయడం ద్వారా వారికి పుణ్యమస్తది గాని రైతులకు నీళ్లు రావు... రోజుకు లక్ష క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నా, రోజుకు 3 టీఎంసీల నీరు తోడే అవకాశం ఉన్నా నీరు ఎత్తిపోయడం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం మేడారం నంది రిజర్వాయర్‌ను బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు.
ధర్మారం, జూలై 20 (ఆంధ్రజ్యోతి) మంత్రులు యాగాలు చేయడం ద్వారా వారికి పుణ్యమస్తది గాని రైతులకు నీళ్లు రావు... రోజుకు లక్ష క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నా, రోజుకు 3 టీఎంసీల నీరు తోడే అవకాశం ఉన్నా నీరు ఎత్తిపోయడం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం మేడారం నంది రిజర్వాయర్‌ను బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. నీరు లేక వెలవెలబోతున్న రిజర్వాయర్‌లో నాయకులు, కార్యకర్తలతో కలిసి క్రికెట్, కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద 94 మీటర్ల ఎత్తుతో నీళ్లు పోతున్నా ఉద్దేశపూర్వకంగా నీటిని ఎత్తిపోయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ద్వారా నీళ్లు ఎత్తి పోస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందనే మూర్ఖపు ఆలోచనతోనే పంపులు రన్ చేయడం లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపులను ఆన్ చేస్తే రాష్ట్రంలోని చెరువులు, కుంటలు నిండుతాయని, గ్రౌండ్ వాటర్ లెవల్ పెరుగుతుందని ప్రజలు, రైతులు, మేధావులు చెప్పినప్పటికి ముఖ్యమంత్రి మూర్ఖపు ఆలోచనతో వ్యవహరిస్తున్నాడన్నారు. వర్షాలు లేక తెలంగాణలో రైతులు పంటలు వేయాలా వద్దా అని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే, ప్రభుత్వం ఇప్పటికీ అంటి ముంటనట్టు వ్యవహరిస్తుందన్నారు. కన్నెపల్లి పంపు వద్ద నిండుకుండలా నీళ్ళు ఉండగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హోమాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ముందు చూపుతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని, తెలంగాణలోని 7 జిల్లాల్లో 40 లక్షల ఎకరాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా సస్యశ్యామం అవుతాయని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి కాళేశ్వరం గేట్లు ఎత్తి, తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించాలని కోరారు. బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ముత్యాల బలరాంరెడ్డి, పూస్కూరి రామారావు, గుర్రం మోహన్‌రెడ్డి, ఖిలావనపర్తి సర్పంచ్ శ్రీనివాస్, రాచూరి శ్రీధర్, పాకల రాజయ్య, తుమ్మల రాంబాబు, మిట్ట తిరుపతి, మిట్ల భరత్ రెడపాక శ్రీనివాస్, ఆకారి సత్యం, ఆవుల శ్రీనివాస్, దాడి సదయ్య, చొప్పరి చంద్రయ్య, కాంపెల్లి ఆపర్ణ, ఆవుల లత తదితరులు పాల్గొన్నారు.