Share News

ఏం కొనేటట్టు లేదు

ABN , Publish Date - Jul 05 , 2026 | 01:06 AM

ఇదీ.. అదీ అని లేదు.. అన్ని వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. కూరగాయల నుంచి మొదలుకుని కోడిగుడ్డు వరకు అన్నింటికి రెక్కలు వచ్చాయి. తాజాగా కోడిగుడ్డు ధర ఎనిమిది రూపాయల వరకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనైతే తొమ్మిది రూపాయలకు అమ్ముతున్నారు. మరోవైపు ఇసుక ధర ట్రాక్టర్‌కు ఏడు వేల రూపాయలకు చేరింది. దీంతో ఇళ్లు నిర్మించుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అన్ని రకాల సామగ్రి ధరలు పెరిగి నిర్మాణ రంగం కుదేలైంది. ఇసుక ధర పెరగడంతో ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఉక్కిరిబిక్కరవుతున్నారు.

 ఏం కొనేటట్టు లేదు

హుజూరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు ఇసుక బాధలు తప్పడం లేదు. రెండేళ్ల క్రితం ట్రాక్టర్‌ ఇసుక రెండు వేల నుంచి 2,500 రూపాయల వరకు లభించేది. ప్రభుత్వం క్వారీలను ఏర్పాటు చేసి టీజీఎంఐవీ సైట్‌ ద్వారా ఇసుక బుకింగ్‌ చేసుకొని విధానం తీసుకొచ్చింది. మానేరు తీరం నుంచి దూరాన్ని బట్టి ధర నిర్ణయించారు. హుజూరాబాద్‌ పట్టణానికి 3,450 రూపాయల ట్రాక్టర్‌ ఇసుక లభించేస్తుంది. టీజీఎంఐవీ సైట్‌ ఓపెన్‌ అయిన పది నిమిషాల్లోనే బుకింగ్‌ క్లోజ్‌ అని చూపిస్తోంది. దీంతో ఇసుక అవసరం ఉన్న వారు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగి.. ఆ ప్రభావం ఇతర వస్తువుల ధరపై పడి నిర్మాణ రంగం కుదేలైంది. గృహాలు నిర్మించుకునే వారు ఇసుక లభించక ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు ఇతర ప్రాంతాల నుంచి లారీల ద్వారా తీసుకువస్తున్న ఇసుక వ్యాపారులు టన్నుకు 1,600 నుంచి 1,800 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో ఇసుక కొనుగోలు భారంగా మారింది. ఒకటి లేదా రెండు ట్రాక్టర్ల ఇసుక అవసరం ఉన్న వారు విధిలేని పరిస్థితుల్లో ఒక్కో ట్రాక్టర్‌కు ఏడు వేల వరకు చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇబ్బందుల్లో ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులు

ప్రభుత్వం సొంతింటి కల నెరవేర్చేందుకు పేద లబ్ధిదారులను గుర్తించి మొదటి విడతగా నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను కేటాయించింది. కొందరు ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు చేసుకోగా, ఇసుక లభించక ఇంకొంత మంది ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోలేకపోతున్నారు. ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు కేటాయించగా, ప్రభుత్వ ఇంజనీరింగ్‌ అధికారులు సూచించిన ప్రకారం ఇంటి నిర్మాణం పూర్తి చేయడానికి పెరిగిన ధరలతో మరో ఐదు లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. దీనికి తోడు ఇసుక ధరలు ఆకాశాన్నంటడంతో ఇంటి నిర్మాణం మరింత భారంగా మారిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండో విడత నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించనుండగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. పెరిగిన ధరలతో ఇంటి నిర్మాణం ఎలా చేపట్టాలో తెలియక దరఖాస్తుదారులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిరంతరం సైట్‌ ఓపెన్‌ చేసి ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇతర గృహ నిర్మాణదారులకు ఇసుక ప్రభుత్వ ధరలకు లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కోడి గుడ్డుకు రెక్కలు

కరీంనగర్‌ టౌన్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): కోడి గుడ్డు ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి. 15 రోజులుగా క్రమేపీ పెరుగుతూ వచ్చిన కోడిగుడ్డును రిటైల్‌గా 8 నుంచి 9 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. హోల్‌సెల్‌ ధర ఏడు రూపాయలకు చేరుకుంది. ఆరు నెలల క్రితం ఇదే తరహాలో గుడ్డు ధర 8 రూపాయలకు చేరుకోగా ఆ తర్వాత కొద్దికొద్దిగా దిగుతూ ఐదు రూపాయలకు చేరింది. కొన్నాళ్లుగా ఆరు రూపాయలకు మించని కోడిగుడ్లను జిల్లా కేంద్రంలోని దుకాణాల్లో ఎనిమిది రూపాయల వరకు, శివారు, విలీన గ్రామాల్లో తొమ్మిది రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇప్పటికే కూరగాయల ధరలు ఆకాశాన్నంటగా కోడి గుడ్డు ధరలు కూడా సామాన్య, పేద ప్రజలకు అందనంతగా పెరిగిపోయాయి. పేదవాడి పౌష్టికాహారమైన కోడిగుడ్డు కూడా సామాన్యుడికి గుదిబండగానే మారుతోంది. పేద, మధ్య తరగతి ప్రజలకు చౌకగా లభించే ప్రొటీన్‌ ఫుడ్‌ కోడిగుడ్డు. కానీ ఇప్పుడు ఆ గుడ్డు కొనాలంటే జనం భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేషనల్‌ ఎగ్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ ప్రకారం హోల్‌సేల్‌ ధర ఆరు రూపాయల ఎనభై పైసల వరకు ఉంది ఈ ధర 10 రూపాయల వరకు చేరుతుందని చెబుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులకు స్కూల్స్‌, కాలేజీలతోపాటు హాస్టళ్లలో కోడిగుడ్డును అందింస్తుండడంతో డిమాండ్‌ పెరిగి ధరకు రెక్కలొస్తున్నట్లు చెబుతున్నారు.

Updated Date - Jul 05 , 2026 | 01:06 AM