Share News

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి హెచ్‌టీఆర్‌ తరలింపు

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:50 PM

రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో డెన్మార్క్‌కు చెందిన హల్దర్‌ టాప్స్‌ కంపెనీ సమకూర్చిన టెక్నాలజీ విఫలమైంది. కీలకమైన రూ.200కోట్ల విలువైన హై టెంపరేచర్‌ రిఫార్మర్‌(హెచ్‌టీఆర్‌) యంత్రం ఫెయిల్‌ అయ్యింది. దీని ప్రభావంతో గత ఖరీఫ్‌ సీజన్‌లో పరిశ్రమ షట్‌డౌన్‌ అయ్యింది.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి హెచ్‌టీఆర్‌ తరలింపు

కోల్‌సిటీ, మార్చి 26(ఆంధ్రజ్యోతి): రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో డెన్మార్క్‌కు చెందిన హల్దర్‌ టాప్స్‌ కంపెనీ సమకూర్చిన టెక్నాలజీ విఫలమైంది. కీలకమైన రూ.200కోట్ల విలువైన హై టెంపరేచర్‌ రిఫార్మర్‌(హెచ్‌టీఆర్‌) యంత్రం ఫెయిల్‌ అయ్యింది. దీని ప్రభావంతో గత ఖరీఫ్‌ సీజన్‌లో పరిశ్రమ షట్‌డౌన్‌ అయ్యింది. యూరియా పరిశ్రమకు ఈ హెచ్‌టీఆర్‌ గుండెకాయ. అమ్మోనియా తయారీలో అత్యంత కీలకమైన యూనిట్‌. సహజ వాయువును అత్యధిక ఉష్ణోగ్రతలో మండించి సింథటిక్‌ గ్యాస్‌ ఉత్పత్తి చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సుమారు 1000డిగ్రీల సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రతను తట్టుకునేలా డిజైన్‌ చేశారు. దేశంలో పునరుద్ధరించిన ఎరువుల కర్మాగారాల్లో హెచ్‌టీఆర్‌ టెక్నాలజీని రామగుండంలో పెట్టారు. దీంతో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని సంబంధిత కంపెనీ పేర్కొన్నది. కానీ ఆచరణలో సాంకేతిక వైఫల్యాలు ఎదురు కావడంతో ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే సుమారు 115రోజులు ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తెలంగాణ రైతాంగానికి ఖరీఫ్‌లో యూరియా ఇబ్బందులు ఎదురయ్యాయి. హెచ్‌టీఆర్‌ వైఫల్యాలపై సీబీఐ విచారణ చేయాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. దీనిపై ఎరువుల మంత్రిత్వశాఖ దేశంలోని వివిధ ఎరువుల కర్మాగారాల యాజమాన్యాలతో కమిటీ వేసి విచారణ జరిపించింది. కమిటీ నివేదికను అనుసరించి హెచ్‌టీఆర్‌ను మరమ్మతు చేసే బాధ్యత హల్దర్‌ టాప్స్‌దేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీంతో హల్దర్‌ టాప్స్‌ హెచ్‌టీఆర్‌ మరమ్మతులకు అంగీకరించింది. ఇందుకు అయ్యే వ్యయం సుమారు రూ.50కోట్లు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ చెల్లించేలా నవంబర్‌లో ఒప్పందం చేసుకున్నారు. హెచ్‌టీఆర్‌ నుంచి ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి తొలగించి నిపుణులు హెచ్‌టీఆర్‌తో సంబంధం లేకుండానే పరిశ్రమ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి ఉత్పత్తి చేస్తున్నారు. బుధవారం రాత్రి ప్రత్యేక ట్రక్కులో హెచ్‌టీఆర్‌ను ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పరిశ్రమ నుంచి హల్దర్‌ టాప్స్‌ సంస్థ తీసుకెళ్లింది. దీనిని డెన్మార్క్‌కు తీసుకెళతారా లేదా ముంబైకి తీసుకెళ్లి అక్కడ ఏదైన పరిశ్రమలో డెన్మార్క్‌ ఇంజనీర్లతో మరమ్మతు చేయిస్తారా అనే విషయం ఇంకా సందిగ్దంగానే ఉన్నది. ఈ ఏడాది నవంబర్‌ కల్లా హెచ్‌టీఆర్‌ను ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో తిరిగి బిగించాల్సి ఉంటుంది.

Updated Date - Mar 26 , 2026 | 11:50 PM