Share News

వ్యాపారాలు సాగేదెలా...?

ABN , Publish Date - May 10 , 2026 | 12:06 AM

ఇరాన్‌, ఇజ్రాయిల్‌ దేశాల మధ్య జరిగిన యుద్ధం కారణంగా వివిధ వ్యాపారాలపై తీరని భారం పడుతున్నది. కమర్షియల్‌ వంట గ్యాస్‌ ధర ఐదు నెలల్లో ఐదుసార్లు పెరగడంతో వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు.

వ్యాపారాలు సాగేదెలా...?

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఇరాన్‌, ఇజ్రాయిల్‌ దేశాల మధ్య జరిగిన యుద్ధం కారణంగా వివిధ వ్యాపారాలపై తీరని భారం పడుతున్నది. కమర్షియల్‌ వంట గ్యాస్‌ ధర ఐదు నెలల్లో ఐదుసార్లు పెరగడంతో వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. వీటి పర్యవసానంగా టీ, టిఫిన్లు, భోజనాలు, బిర్యానీలు, స్వీట్లు, ఇతర తినుబండరాల ధరలు అమాంతం పెరగడంతో వినియోగదారులు సైతం నెలవారీ లెక్కలు మారుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. గ్యాస్‌ ధరలు పెరగినప్పుడు చిరు వ్యాపారులు, హోటల్‌ యజమానులు పోటా పోటీగా ధరలు తగ్గించుకుంటూ ఇన్నాళ్లు వ్యాపారాలు చేయగా, ప్రస్తుతం ధరలు పెంచకుండా వ్యాపారాలు చేసే పరిస్థితి లేదని అంటున్నారు. టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకులు ఇడ్లీ, వడ, బొండా, పూరి, దోశ, ఏ టిఫిన్‌ అయినా 40 రూపాయలు, హోటళ్లలో రూ.50 నుంచి 60 రూపాయలకు పెంచారు. ధరలు పెరగడం వల్ల కొన్ని టిఫిన్‌ సెంటర్లు పెద్దగా నడవడం లేదు. టిఫిన్లు చేయాల్సిన వాళ్లు సైతం ధరలను తట్టుకోలేక ఇళ్లలో టిఫిన్లు చేసుకుంటున్నారు. దీంతో టీ, టిఫిన్‌ సెంటర్లపై ఆధారపడి జీవిస్తున్న కొందరు చిరు వ్యాపారులు కుదేలవుతున్నారు.

ఐదు నెలల్లో రూ.1491 పెరిగిన సిలిండర్‌ ధర

ఈ ఏడాది కమర్షియల్‌ సిలిండర్‌ గ్యాస్‌ ధరలు ఐదుసార్లు పెరిగాయి. ప్రతిసారి సాధారణంగా 50 నుంచి 100 రూపాయలలోపే ధరలు పెరుగుతుండగా యుద్ధం కారణంగా సిలిండర్‌ ధరలను ప్రభుత్వం అమాంతం పెంచేసింది. ఐదు నెలల్లో ఏకంగా 1491 రూపాయలు ధర పెరగడం సిలిండర్లను వినియోగిస్తున్న వ్యాపారులను బెంబేలెత్తిస్తున్నది. జనవరికి ముందు కమర్షియల్‌ సిలిండర్‌ గ్యాస్‌ ధర 1852 రూపాయలు ఉండగా, ప్రస్తుతం 3343 రూపాయలకు పెరిగింది. జనవరిలో 111 రూపాయలు, ఫిబ్రవరిలో 49 రూపాయలు, మార్చిలో 144 రూపాయలు, ఏప్రిల్‌ 194 రూపాయలు, ఈ నెలలో 993 రూపాయలు పెరిగింది. గతంలో ఎన్నడు లేని విధంగా ఇంత పెద్ద మొత్తంలో ధరల పెరగడంతో ఆయా వ్యాపారాలపై తీరని భారం పడుతున్నది. ధర పెరిగినా కూడా కమర్షియల్‌ సిలిండర్లు సరఫరా కావడం లేదు. దీంతో కట్టెల పొయ్యిలను ఉపయోగిస్తున్నారు. ఇదే అదనుగా కట్టెలు విక్రయించే వ్యాపారులు సైతం ధరలను పెంచారు. మరి కొందరు టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకులు, ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసే వారు దొంగచాటున గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను వాడుతున్నారు.

ధరలు పెంచినా లాభం లేదు

ధరలు పెంచినా గిట్టుబాటు కావడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. కమర్షియల్‌ సిలిండర్‌ ధర పెరగడంతో టీ, టిఫిన్లు, మెస్‌ ఛార్జీలు, స్వీట్లు, ఇతరత్రా తినుబండారాల ధరలు పెంచినా కూడా లాభాలు లేకుండా పోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ధరలు పెరగడంతో గిరాకీ ఉండడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం ప్రభావం ఒక్క హోటల్లు టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకుల మీదనే గాకుండా గ్యాస్‌ ఆధారితంగా నడిచే పరిశ్రమలపై కూడా పడింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కమర్షియల్‌ వంటగ్యాస్‌ ధరలను తగ్గించాలని వ్యాపారులు, ప్రజలు కోరుతున్నారు.

Updated Date - May 10 , 2026 | 12:06 AM