Share News

గ్యాస్‌ కొరతతో మూతపడుతున్న హోటళ్లు

ABN , Publish Date - Mar 15 , 2026 | 11:51 PM

యుద్ధ ప్రభావం ఇటు వ్యాపారులు అటు వినియోగదారులపై తీవ్ర భారం మోపుతున్నది. నిత్యావసర ధరలు రోజురోజుకు ఆకాశన్నంటుతుండగా గ్యాస్‌ సిలిండర్లు దొరకకపోవడంతో హోటళ్లు మూతపడుతున్నాయి. రామగుండం పారి శ్రామిక ప్రాంతంలో టిఫిన్‌ సెంటర్లు, రెస్టారెంట్లు, భోజనశాలలు, మిర్చి బజ్జీల బండ్లు గ్యాస్‌ దొరకక మూతపడుతున్నాయి.

గ్యాస్‌ కొరతతో   మూతపడుతున్న హోటళ్లు

కళ్యాణ్‌నగర్‌, మార్చి 15(ఆంధ్రజ్యోతి): యుద్ధ ప్రభావం ఇటు వ్యాపారులు అటు వినియోగదారులపై తీవ్ర భారం మోపుతున్నది. నిత్యావసర ధరలు రోజురోజుకు ఆకాశన్నంటుతుండగా గ్యాస్‌ సిలిండర్లు దొరకకపోవడంతో హోటళ్లు మూతపడుతున్నాయి. రామగుండం పారి శ్రామిక ప్రాంతంలో టిఫిన్‌ సెంటర్లు, రెస్టారెంట్లు, భోజనశాలలు, మిర్చి బజ్జీల బండ్లు గ్యాస్‌ దొరకక మూతపడుతున్నాయి. దీంతో రోజువారీ వ్యాపారం చేసుకునే వారు ఇబ్బందులు పడుతున్నారు. పలు హోటళ్లలో ఇప్పటికే పూరి, దోశ వంటి టిఫిన్లను నిలిపివేశారు. గ్యాస్‌పై ఆధారపడే హోటళ్లు, స్ర్టీట్‌ఫుడ్‌లు మూతపడుతున్నాయి. కొందరు ప్రత్యామ్నా యంగా కట్టెల పొయ్యితో టిఫిన్లు, భోజనాలు చేస్తున్నప్పటికీ గిట్టుబాటు కావడం లేదని చెబుతున్నారు. గ్యాస్‌ సిలిండర్ల కొరతతో ఇన్ని రోజు మూడింతల రేట్లతో కొనుగోలు చేసి నెట్టుకువచ్చామని, కానీ గ్యాస్‌ దొరకక పోవడంతో హోటళ్లను మూసివేసే పరిస్థితి వస్తుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సెంటర్లలో ఇడ్లిలు చేసుకుంటూ కాస్తోకూస్తో ఉపాధి పొందుతున్నారు. హోటళ్లలో పని చేసే కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు.

పెరిగిన ఆయిల్‌, నిత్యావసర ధరలు

యుద్ధంతో ఒకేసారి ఆయిల్‌, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పోయాయి. ఇటీవలి వరకు సన్‌ ఫ్లవర్‌, గోల్డ్‌ డ్రాప్‌ ఆయిల్‌ రూ.148 ఉండగా యుద్ధంతో రూ.40అధికంగా పెరిగాయి. పప్పులు, మినపపప్పు, పిండి ధరలు కూడా ఆకాశన్నంటాయి. ధరల పెరుగుదలతో తాము వ్యాపారం చేయలేని పరిస్థితి నెలకొన్నదని హోటల్‌ యజమానులు చెబుతున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగిస్తే ఆయిల్‌, నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Updated Date - Mar 15 , 2026 | 11:51 PM