చివరితడిపైనే ఆశలు
ABN , Publish Date - Oct 18 , 2026 | 12:11 AM
ఆరుగాలం శ్రమించి సాగు చేసిన రైతుకు పంట చేతికందే సమయంలోనూ కష్టాలు తప్పడం లేదు. పంట పొట్ట దశ దాటి గింజ గట్టిపడి కోతకు సిద్ధమవుతున్న తరుణంలో చివరి తడి అందక వరి సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఎస్సారెస్పీ నీటి విడుదలతో దిగుబడిపై ఆశలు చిగురిస్తున్నాయి.
పెద్దపల్లి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం శ్రమించి సాగు చేసిన రైతుకు పంట చేతికందే సమయంలోనూ కష్టాలు తప్పడం లేదు. పంట పొట్ట దశ దాటి గింజ గట్టిపడి కోతకు సిద్ధమవుతున్న తరుణంలో చివరి తడి అందక వరి సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఎస్సారెస్పీ నీటి విడుదలతో దిగుబడిపై ఆశలు చిగురిస్తున్నాయి. అయితే సాగునీటి విడుదల ఆలస్యం కావడం, భూగర్భ జలాలు అడుగంటడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల వరి పంటలకు ఊరటనిచ్చే అవకాశమున్నా.. కాలువల చివరి ఆయకట్టుకు సకాలంలో నీరు చేరుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో ఖరీఫ్ సాగు ఇలా..
పెద్దపల్లి జిల్లాలో డి83, డి 86 కాలువల ద్వారా 2లక్షల ఆరువేల ఎకరాలు సాగు అవుతోంది. డి 83 కాలువ కింద మంథని, రామగుండం, గోదావరిఖని, మంథని, కమాన్పూర్ మండలాలలో 1,20,000 ఎకరాల్లో వరి సాగైంది. డి86 కాలువ ద్వారా పెద్దపల్లి ప్రాంతానికి ఎలిగేడు, సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి మండలాలలో 86 వేల ఎకరాలలో వరి సాగైంది. డి 86 కాలువ ద్వారా జలాలు మంగళవారం జిల్లాకు చేరుకోగా, డి-83 కాలువ జలాలు శుక్రవారం జిల్లాకు వచ్చాయి. నీటి విడుదల ద్వారా సుమారు 2,06,000 ఎకరాలలో దిగుబడులు చేతికి అందే అవకాశం ఉంది.
కాలువల ద్వారా నీరు ఇలా..
జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పంటలు కోతకు సిద్ధమవుతుండగా, మరికొన్ని చోట్ల గింజ నిండే దశలో ఉన్నాయి. ఈ సమయంలో నీరు అందకపోతే గింజ నాణ్యత, బరువు, దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయకట్టుకు డి 86, డి 83 ప్రధాన కాలువల ద్వారా ఎస్సారెస్పీ సాగునీరు సరఫరా అవుతోంది. ప్రస్తుత పంటలకు చివరి తడులు అందించాల్సిన అవసరం ఉండటంతో కాలువల నీటి సరఫరాపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. అయితే నీటి లభ్యత పరిమితంగా ఉండటం, సరఫరా వేగం, కాలువల చివరి ప్రాంతాలకు నీరు చేరే సమయం కీలకంగా మారాయి.
వరి సాగుపై రైతుల్లో సందిగ్ధం
వానాకాలంలో వరి సాగు చేసిన రైతులు యాసంగిలోనూ అదే పంట వేయాలా లేక ఆరుతడి పంటల వైపు మళ్లాలా అనే విషయంపై తర్జనభర్జన పడుతున్నారు. వరికి మార్కెట్ ఉండటం, ధాన్యం కొనుగోళ్లపై ఉన్న అంచనాలతో చాలామంది రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు నీటి కొరత ఏర్పడితే పెట్టుబడి నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు మారాలంటే విత్తనాల లభ్యత, మార్కెట్ ధరలు, కొనుగోలు హామీ, పంటల సాగు విధానంపై అవగాహన అవసరం. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో నీరు, విద్యుత్ను పొదుపుగా వినియోగించాలని ప్రభుత్వం సూచిస్తోంది. అయితే ప్రస్తుత పంట చేతికందే వరకు వ్యవసాయ విద్యుత్ సరఫరా సజావుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.