ఆలయ పునర్నిర్మాణంపై ఆశలు
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:11 AM
సిరిసిల్ల శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంపై ఆశలు రేకెత్తుతున్నారు. గతంలో దేవస్థానం పునర్నిర్మా ణానికి టీటీడీ మంజూరు చేసిన నిధులతో పనులు చేపట్టడానికి భూమి పూజ చేశారు. మూడేళ్లుగా నిర్మాణ పనుల్లో కదలిక లేకపోవడంతో శ్రీస్వామివారి భక్తుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న వేళ తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు పాలకవర్గం దేవస్థానం నిర్మాణానికి నిధులు మంజూరు చేయడానికి నిర్ణయించింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
సుదీర్ఘమైన చరిత్ర కలిగిన సిరిసిల్ల శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంపై ఆశలు రేకెత్తుతున్నారు. గతంలో దేవస్థానం పునర్నిర్మా ణానికి టీటీడీ మంజూరు చేసిన నిధులతో పనులు చేపట్టడానికి భూమి పూజ చేశారు. మూడేళ్లుగా నిర్మాణ పనుల్లో కదలిక లేకపోవడంతో శ్రీస్వామివారి భక్తుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న వేళ తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు పాలకవర్గం దేవస్థానం నిర్మాణానికి నిధులు మంజూరు చేయడానికి నిర్ణయించింది. దీంతో దేవాలయ నిర్మాణానికి మోక్షం కలుగుతుందని భావిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే విధంగా ప్రతి సంవత్సరం సిరిసిల్ల శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
వేల సంవత్సరాల క్రితం సిరిసిల్లలో నిర్మించిన శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కోసం భక్తులు ఎదురుచూస్తున్న క్రమంలో ప్రస్తుతం ఉన్న స్థలంలోనే సుందరంగా దేవాలయంలోని అనుబంధంగా అమ్మవారి దేవాలయాలు నిర్మించడానికి భక్తుల కోరిక మేరకు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి కే తారకరామారావు కృషి మేరకు 2023లో అప్పటి టీటీడీ పాలకవర్గం దేవస్థానం నిర్మాణానికి రూ.1.96 కోట్ల నిధులను మంజూరు చేసింది. అదే సంవత్సరం 14 జూన్ మాసంలో అప్పటి టీటీడీ చైర్మ న్ వైవి సుబ్బారెడ్డి స్వ యంగా సిరి సిల్లకు వచ్చి దేవ స్థానం నిర్మాణా నికి భూమి పూజ చేశారు. ఆ తర్వాత నిర్మాణానికి నిధులు సరిపోయే పరిస్థితి లేదని పనులు మొదలు కాలేదు. ఆ తర్వాత మళ్లీ అప్పటి టీటీడీ పాలకవర్గానికి రూ.4.50 కోట్లతో ప్రతిపాదనలు పంపినా పెండింగ్‌లోనే ఉండిపోయాయి. తెలంగాణ, ఆంధ్రాలో ప్రభుత్వాలు మారిపోవడంతో దేవస్థానం నిర్మాణంలో కదలిక లేకుండాపోయింది.
తాజాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో నిర్మాణాలకు నిధులు మంజూరుచేసి పనులు మొదలు కాని దానిపై సమీక్షించారు. టీటీడీ పాలకవర్గం దేవ స్థానాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడానికి తీర్మానించారు. అందులో భాగంగా తిరిగి ప్రతిపాదనలు కోరడంతో గత నెలలో దేవదాయశాఖ సిరిసిల్ల శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణానికి రూ.7.20 కోట్లతో టీటీడీ పాలకవర్గానికి ప్రతిపాదన పంపించారు. దీంతో ఎన్నో ఏళ్లుగా దేవస్థానం అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న భక్తుల్లో ఈసారైనా దేవస్థానం నిర్మాణానికి మోక్షం కలుగుతుందని భావిస్తున్నారు.
గోవిందా... హరి గోవిందా...
అతి పురాతనమైన సిరిసిల్ల శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాశస్త్యాన్ని పరిశీలిస్తే మానేరు నదీ ప్రవాహంతో ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే మానేరు ఒడ్డున మాండవ్య మహాముని ఆశ్రమం ఉండేది. మహావిష్ణు యాగం జరపడానికి నిర్ణయించారు. మహావిష్ణు ఆజ్ఞ కోసం మాండవ్య ముని తపస్సు చేయగా ప్రత్యక్షమై అనుమతి చ్చాడు. యాగం తరువాత గ్రామ జమిందార్లు ఆలయాన్ని నిర్మించారు. ఆ తరువాత 200 సంవత్సరాల శాలివాహన శకం 1826 ప్రాంతంలో మొగలాయిల, కాకతీయుల రాజ్యంపై దండెత్తి హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ శ్రీశాల కేశవనాథ స్వామి విగ్రహాన్ని కూడా పగులగొట్టారు. ఇప్పటికీ ఈ దేవాలయం లో విగ్రహం భద్రపరిచి ఉంది. తిరుమల తిరుపతి క్షేత్రం తరువాత అదే స్థాయిలో సిరిసిల్ల శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల నిర్వహిస్తారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అదే స్థాయిలో బ్రహ్మోత్సవాల్లో స్వామివారు 12 వివిధ వాహనాలను స్వామి సేవకు ఉపయోగిస్తారు. శేషవాహనం, హంసవాహనం, సింహవాహనం, అశ్వవాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, సూర్యప్రభ వాహనం, శ్రీరంగనాయక తిరొప్పలం, చంద్రప్రభ వాహనం, గజవాహనం, పొన్నవాహనం, కాళీయ మర్ధనం వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. అంగరంగ వైభవంగా 30 అడుగుల ఎత్తుతో 160సంవత్సరాల చరిత్ర ఉన్న మహారథంపై స్వామి వారిని ఊరేగిస్తారు.