Share News

నామినేటెడ్‌ పదవులపై ఆశలు

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:10 AM

నామినేటెడ్‌ పదవుల కోసం నాయకులు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కోసం కష్టపడిన వారికి పదవుల రూపంలో గుర్తింపు లభిస్తుందని ఆశించిన వారు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

 నామినేటెడ్‌ పదవులపై ఆశలు

పెద్దపల్లి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): నామినేటెడ్‌ పదవుల కోసం నాయకులు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కోసం కష్టపడిన వారికి పదవుల రూపంలో గుర్తింపు లభిస్తుందని ఆశించిన వారు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫారసులతో వివిధ పదవులకు పేర్లు పంపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నా.. నియామకాలపై స్పష్టత రాకపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. పెద్దపల్లి నియోజకవర్గంలోనూ సహకార సంఘాలు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గాల ఏర్పాటుపై చర్చ సాగుతోంది

సహకార సంఘాలకు పాలకవర్గాల ఏర్పాటుపై కసరత్తు

పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని సుల్తానాబాద్‌, కాల్వ శ్రీరాంపూర్‌, అప్పన్నపేట, కూనారం తదితర సహకార సంఘాలకు నూతన పాలకవర్గాలను నియమించే అంశం తెరపైకి వచ్చింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పదవులపై కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆశలు పెట్టుకున్నారు. సహకార సంఘాల పరిధిలో రైతులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నవారు, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నవారు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. కొత్త పాలకవర్గంలో ఎవరికి ప్రాధాన్యం లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

మార్కెట్‌ కమిటీ గడువు ముగియడంతో ఉత్కంఠ

సుల్తానాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గం పదవీకాలం ఈ నెల 28తో ముగిసింది. ప్రస్తుతం చైర్మన్‌గా మినుపాల ప్రకాశ్‌రావు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావుకు ప్రకాష్‌రావు సన్నిహితుడు. ప్రస్తుత పాలకవర్గాన్నే మరో ఏడాది పాటు కొనసాగించేలా పొడిగింపు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పాత పాలకవర్గాలకు కాకుండా కొత్త వారికి అవకాశం ఇద్దామని పార్టీ పెద్దలు నిర్ణయించిన కారణంగా అవసరమైతే కొత్త కమిటీ ప్రతిపాదనలకు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం అనుకూలంగా వస్తే ప్రస్తుత పాలకవర్గమే కొనసాగనుంది. లేనిపక్షంలో కొత్త పాలకవర్గం ఏర్పాటుకు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. కొత్తవారికి అవకాశం కల్పించే యోచనలో ప్రభుత్వం ఉంటే మినుపాల ప్రకాష్‌రావు సతీమణి స్వరూప రాణికి చైర్మన్‌ పదవి కట్టబెడుతూ కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ప్రస్తుత పాలకవర్గం కొనసాగింపు, కొత్త పాలకవర్గం ఏర్పాటు ఆధారపడి ఉండనుంది. మార్కెట్‌ కమిటీ, సహకార సంఘాల పదవులతోపాటు ఇతర నామినేటెడ్‌ పోస్టులపై ఆశలు పెట్టుకున్న నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ ముఖ్య నేతలను కలిసి తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో చేసిన కృషి, పార్టీ కోసం అందించిన సేవలు, స్థానికంగా తమకున్న పరిచయాలను వివరిస్తూ పదవుల కోసం సిఫారసులు చేయించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మరికొందరు కొత్త జాబితాల్లో చోటు దక్కుతుం దనే ఆశతో ఎదురుచూస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన సీనియర్‌ కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడంతోపాటు కొత్త నాయకత్వానికి అవకాశాలు కల్పించే విషయంలో అధిష్ఠానం తీసుకునే నిర్ణయంపై ఆశావహులు దృష్టి సారించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఊసే లేకపోవడంతో వాటి పై గత రెండేళ్ళ నుంచి ఆశలు పెట్టుకున్న వారు నామినేటెడ్‌ పదవి లభిస్తే చాలని ఎదురుచూస్తున్నారు.

Updated Date - Oct 31 , 2026 | 12:10 AM