కొత్త పింఛన్లపై ఆశలు..
ABN , Publish Date - Aug 02 , 2026 | 12:10 AM
కొత్త పింఛన్లు ఈనెల 15వ తేదీ నుంచి మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నాలుగేళ్లుగా కొత్త పింఛన్ల మంజూరు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. చివరి సారిగా 2022 అక్టోబర్‌లో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం లో కొత్త పింఛన్లు మంజూరు చేశారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
కొత్త పింఛన్లు ఈనెల 15వ తేదీ నుంచి మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నాలుగేళ్లుగా కొత్త పింఛన్ల మంజూరు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. చివరి సారిగా 2022 అక్టోబర్‌లో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం లో కొత్త పింఛన్లు మంజూరు చేశారు. ఆ తర్వాత పిం ఛన్లు మంజూరు కాలేదు. వ్యధ్యాప్య పింఛన్ల మం జూరుకు అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించినప్పటికీ, ఆ మేరకు గత ప్రభుత్వం మంజూరు చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం సైతం రెండేళ్లుగా ఊరిస్తూ వస్తున్నది, 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా చేయూత పథకం కింద అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని, ప్రస్తుతం దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్‌ను 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలకు, ఇతరత్రా పింఛన్లను 2,016 నుంచి 4,016 రూపాయలకు పెంచు తామని హామీ ఇచ్చారు.
జిల్లాలో 90,990 మందికి చేయూత పథకం ద్వారా ప్రతీ నెలా 21 కోట్ల 8 లక్షల రూపాయలను పింఛన్ దారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్నది. లబ్ధి పొందుతున్న వారిలో వృద్ధులు 38,292 మంది, వితం తువులు 31,901 మంది, దివ్యాంగులు 12,557 మంది, చేనేత కార్మికులు 770 మంది, గీత కార్మికులు 2,74 మంది, బీడీ కార్మికులు 693 మంది, ఒంటరి మహిళలు 2,561 మంది, బీడీ టేకేదార్లు ఐదుగురు, ఏఆర్‌టీ బాధి తులు 1,614 మంది, ఫైలేరియా బాధితులు 338 మంది, డయాలసిస్ బాధితులు 185 మంది ఉన్నారు. వీరంతా జీవించే ఉన్నారా, లేదా అనే విషయమై గత నెలలో లైవ్ అథెంటిఫికేషన్ నిర్వహించారు. కొందరు స్థానికం గా లేకపోగా, మరికొందరు మృతి చెందినట్లు గుర్తిం చారు. ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లను పెంచక పోగా, కొత్త పింఛన్ల మంజూరు ఇన్నాళ్లు ఊసెత్తలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, పట్టణాల్లో నిర్వహించిన ప్రజాపాలన సభల ద్వారా పింఛన్ల కోసం మొత్తం 56,531 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో దివ్యాంగుల పింఛన్ల కోసం 6,979 మంది, వృద్ధాప్య, వితంతు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, తదితర పింఛన్ల కోసం 49,552 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని ఆన్‌లైన్ చేసిన ప్పటికీ, ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా మంజూరు చేయలేదు. ఇవేగాకుండా ప్రతీ సోమవారం జిల్లా కేం ద్రంలో నిర్వహించే ప్రజావాణిలో, నేరుగా మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాలకు సైతం అనేక దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి మంజూరు చేయాల్సి ఉంటుంది. అయితే వీటి గురించి ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకున్న సందర్భాలు లేవు. రెండున్నరేళ్ల తర్వాత స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీ నుంచి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించ డంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వీటికి సంబంధించి మార్గదర్శకాలు జారీ కావాల్సి ఉంది.