అబద్ధాలు ఆడడంలో పట్టా పొందిన హరీష్‌రావు
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:47 PM
మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అబద్దాలు ఆడడంలో పట్టా పుచ్చుకున్నాడని రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు విమర్శించారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పెద్దపల్లిటౌన్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అబద్దాలు ఆడడంలో పట్టా పుచ్చుకున్నాడని రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు విమర్శించారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, అధికారం కోల్పోయి మతిభ్రమించి హరీష్‌రావు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, రైతు డిస్కంలతో సోలార్ పంపు సెట్లను ప్రోత్సహించి విద్యుత్ ఆదా చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వకుంటే రానున్న ఎన్నికల్లో ప్రజలను ఓట్లడగమని సవాల్ చేస్తే హరీష్, కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదన్నారు. 2లక్షల50 వేల మంది రైతులకు రుణమాఫీ చేశామని, రుణమాఫీ చేస్తామని బీఆర్‌ఎస్ రైతులను మోసం చేసిందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ఎకరాకు 6 వేల చొప్పున 4 సార్లు రైతు భరోసా ఇచ్చామని, కేసీఆర్ హయాంలో సన్నవడ్లకు బోనస్ ఎగ్గొట్టిన చరిత్ర బీఆర్‌ఎస్ దేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో క్వింటాల్‌కు 5 వందల రూపాయలు సన్న వడ్లకు బోనస్ ఇచ్చామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ హయాంలోనేనని, కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా రాష్ట్రంలోని రైతుల నుండి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. బీఆర్‌ఎస్ పాలనలో 5 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ కొన్నారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకున్న మామా అల్లుళ్ళకు కాంగ్రెస్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కాళేశ్వరం నీళ్ళు పెద్దపల్లి జిల్లాకు ఒక్క గుంటకైన ఇచ్చారా చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన సాగునీటి ప్రాజెక్టుల మనుగడ, కాళేశ్వరం మనుగడపై చర్చకు రావాలని సవాల్ చేశారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా మక్కలు కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని చెప్పారు. బీఆర్‌ఎస్ బిల్లుల బకాయి పేరుతో దళిత కాలనీలలో కరెంట్ కట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. హరీష్‌రావు ప్రభుత్వంపై అబద్ధాలు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్లు ప్రకాష్ రావు, కూర మల్లారెడ్డి, నాయకులు సురేష్ గౌడ్, మస్రత్, ఈర్ల స్వరూప, శ్రీగిరి శ్రీనివాస్, సందనవెన రాజేందర్, అవినాష్, బూతగడ్డ సంపత్, సుధాకర్ రెడ్డి, ముత్యాల నరేష్, గుర్రాల రాజు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.