స్వయం ఉపాధి అవకాశాలతో ఆర్థికంగా ఎదగాలి
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:42 PM
స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. స్వయం ఉపాధి శిక్షణలో తొలి బ్యాచ్‌లో 1200 మంది శిక్షణ పొందడం అభినందనీయమని తెలిపారు.
పెద్దపల్లి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. స్వయం ఉపాధి శిక్షణలో తొలి బ్యాచ్‌లో 1200 మంది శిక్షణ పొందడం అభినందనీయమని తెలిపారు. తొలి బ్యాచ్ సాధించిన విజయాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలిచి స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. మహిళలు ప్రతిభను, నైపుణ్యాలను పరిమితం చేసుకోకుండా సృజనాత్మకంగా ఆలోచిస్తూ కొత్త అవకాశాలను అన్వేషించాలని సూచించారు. సంప్రదాయ కోర్సులకే పరిమితం కాకుండా మార్కెట్‌లో డిమాండ్ ఉన్న రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకుని స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని తెలిపారు. ఇద్దరు లేదా ముగ్గురు కలిసి చిన్న తరహా యూనిట్లను ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), వీ-హబ్‌తో అవసరమైన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. టామ్‌కామ్ ద్వారా విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు ఉన్నాయని, జర్మనీ, జపాన్ దేశాల్లో నర్సులకు అధిక డిమాండ్ ఉందని తెలిపారు. ఆసక్తి ఉన్న వారికి అవసరమైన శిక్షణ అందిస్తామని వెల్లడించారు. డీజీఎం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)నటరాజ్, ఎల్‌డీఎం ప్రవీణ్ కుమార్, ఏపీడీ రవీందర్, డీపీఎం రమణ, ఆర్ శెట్టి, డైరెక్టర్ వెంకటేష్, యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ప్రతినిధులు, పాల్గొన్నారు.