ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
ABN , Publish Date - May 16 , 2026 | 11:45 PM
వరి, మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని, వడుకాపూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం కలెక్టర్ పరిశీలించారు.
జూలపల్లి, మే 16 (ఆంధ్రజ్యోతి): వరి, మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని, వడుకాపూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం కలెక్టర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు, వాహనాల కొరత లేకుండా అధికారులు ఏర్పాట్లుచేయాలని, తూకం వేసిన ధాన్యం వెంటనే తరలించేందుకు రవాణాకు ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉన్నా ట్రాక్టర్లతో పాటు ఇతర వాహనాలను ఉపయోగించుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత సెంటర్ ఇన్‌చార్జీలు బాధ్యత తీసుకోవాలన్నారు. తహసీల్దార్ దత్తుప్రసాద్, మార్కెట్‌చైర్మెన్ కొమ్మ పోచాలు పలువురు రైతులు ఉన్నారు.
ధర్మారం, (ఆంధ్రజ్యోతి): ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాల్లో జాప్యం చేయకుండా ఎప్పటికప్పుడు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద మక్కల లోడింగ్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. వాహనాల కొరత సమస్య తలెత్తకుండా చూడాలని, లారీల లభ్యత తక్కువగా ఉంటే స్థానికంగా అందుబాటులో ఉన్న ట్రాక్టర్లను ఉపయోగించుకొని మక్కల రవాణా వేగవంతం చేయాలని సూచించారు.