ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
ABN , Publish Date - May 08 , 2026 | 11:29 PM
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేసి రోజుకు 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లు, లిఫ్టింగ్, ట్యాబ్ ఎంట్రీలు, కొనుగోలు కేంద్రాల పనితీరుపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
పెద్దపల్లి, మే 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేసి రోజుకు 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లు, లిఫ్టింగ్, ట్యాబ్ ఎంట్రీలు, కొనుగోలు కేంద్రాల పనితీరుపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన సందర్భంగా ప్యాడీ లోడింగ్ పనుల ధాన్యం కొనుగోలు సెంటర్ ఇన్‌చార్జిలు సమర్థవంతంగా పర్యవేక్షించడం లేదని గమనించినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం వేగంగా రైస్‌మిల్లులకు చేరేలా సెంటర్ ఇన్‌చార్జిలు ప్రత్యేక బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు. జిల్లాలో ఇంకా 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని, కొనుగోళ్ల వేగాన్ని తక్షణమే పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గత సీజన్‌లో రోజుకు 14 వేల నుంచి 15 వేల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోళ్లు జరిగాయని, ప్రస్తుతం రోజుకు కేవలం 8 వేల మెట్రిక్ టన్నుల మాత్రమే కొనుగోలు జరుగుతోందన్నారు. వెంటనే కొనుగోళ్ల వేగం పెంచి రోజుకు కనీసం 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రతీ కొనుగోలు కేంద్రాలలో ఎఫ్‌ఏక్యూ నిబంధనల ప్రకారం కొనుగోళ్లు ప్రారంభించాలని సూచించారు. ప్రతి కేంద్రంలో హమాలీల సంఖ్యను పెంచాలని, రేపటి నుంచి రెట్టింపు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరగాలని తెలిపారు. ధాన్యం లోడింగ్ ప్రక్రియను తప్పనిసరిగా ధాన్యం కొనుగోలు సెంటర్ ఇన్‌చార్జ్‌లు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వచ్చే వారం భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ట్యాబ్ ఎంట్రీలు ప్రస్తుతం 80 శాతం వరకు మాత్రమే నమోదవుతున్నాయని, ఉదయం ఒక కేంద్రాన్ని సందర్శించినప్పుడు కేవలం 60 శాతం ఎంట్రీలు మాత్రమే నమోదై ఉన్నట్లు గమనించినట్లు తెలిపారు. ఈ పరిస్థితిని వెంటనే సరిచేసి 100 శాతం ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రెండో శనివారం, ఆదివారం రోజుల్లో కొనుగోలు కేంద్రాలు పని చేయాలని, ధాన్యం కొనుగోళ్లు నిరంతరంగా కొనసాగాలని తెలిపారు. కొనుగోళ్ల సమయంలో తప్పనిసరిగా ఎఫ్‌ఏక్యూ నిబంధనలు పాటించాలని సూచించారు. జిల్లాలో 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు స్థానిక రైతుల ధాన్యానికే రైస్‌మిల్లుల్లో ప్రాధాన్యత కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ఏడాది మొక్కజొన్న దిగుబడులు కూడా అధికంగా రావడంతో హమాలీల కొరత తలెత్తే అవకాశం ఉందని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా హమాలీలను సమీకరించాలని అధికారులకు సూచించారు. డీసీవో శ్రీమాల, డీసీఎస్‌ఓ శ్రీనాథ్, అడిషనల్ డీఆర్‌డీవో రవీందర్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, రైస్ మిల్ నిర్వాహకులు, లారీ అసోసియేషన్ అధ్యక్షులు పాల్గొన్నారు.