ధాన్యం సేకరణే ప్రధాన టార్గెట్
ABN , Publish Date - May 24 , 2026 | 12:19 AM
యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం కలెక్టర్ నుంచి మొదలుకొని ఇతర అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. జిల్లా యంత్రాంగానికి ధాన్యం సేకరణ ప్రధాన టార్గెట్‌గా మారింది. నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులకు చేరాయని, ఈనెల 26న కేరళలోకి ప్రవేశించి పది రోజుల్లో తెలంగాణలో విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న క్రమంలో రైతులు ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన చెందుతున్నారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం కలెక్టర్ నుంచి మొదలుకొని ఇతర అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. జిల్లా యంత్రాంగానికి ధాన్యం సేకరణ ప్రధాన టార్గెట్‌గా మారింది. నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులకు చేరాయని, ఈనెల 26న కేరళలోకి ప్రవేశించి పది రోజుల్లో తెలంగాణలో విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న క్రమంలో రైతులు ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన చెందుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అనుకున్న స్థాయిలో సేకరణ జరగకపోవడం, మిల్లులకు రవాణా జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు రైతులు, రాజకీయ పక్షాలు ధాన్యం వేగంగా సేకరించాలని, రవాణాకు వాహనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ గరీమ అగ్రవాల్ ప్రతిరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ధాన్యం తూకం, మిల్లులకు ధాన్యం పంపించడం రైతులకు ఇబ్బందులు కలగకుండా దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నారు. మిల్లుల వద్ద ధాన్యం దిగుమతులకు జాప్యం లేకుండా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎస్పీ మహేష్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో పాటు ఇతర జిల్లా అధికారులు సైతం కొనుగోలు వేగవంతంగా పూర్తి చేసే దిశగానే పనిచేస్తున్నారు. జిల్లాలోని మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దారులు, ఇతర సిబ్బంది తమ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తూ కొనుగోలు, ధాన్యం తరలింపు కోసం ప్రత్యేక అధికారులుగా నియమించారు.
ఇప్పటివరకు 1.85 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం 236 కేంద్రాలు ప్రారంభించారు. ఇందులో ఐకేపీ ద్వారా 132 కేంద్రాలు, వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా 96 కేంద్రాలు, మెప్మా ద్వారా 7 కేంద్రాలు, డీసీఎంఎస్ ద్వారా ఒక కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో మూడు ఐకేపీ కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి చేశారు. జిల్లాలో యాసంగిలో 1.83 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 179650 ఎకరాల్లో దొడ్డు రకం, 7539 ఎకరాల్లో సన్న రకం వరి సాగు చేశారు. దీని ద్వారా 4 లక్షల 56 వేల 664 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో దొడ్డు రకం 4 లక్షల 49 వేల 125 మెట్రిక్ టన్నులు, సన్న రకం 7539మెట్రిక్ టన్నులు వస్తుందని, ఇందులో పౌరసరఫరాల శాఖ 3 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే విధంగా లక్ష్యంగా పెట్టుకొంది. ఇందులో 2.97 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం దాన్యం, 7539 మెట్రిక్ టన్నులు సన్న రకం ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ఉంది. పౌరసరఫరాల శాఖ ఇప్పటివరకు 185677 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. ఇందులో ఐకేపీ ద్వారా 98981 మెట్రిక్ టన్నులు, వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా 79351 మెట్రిక్ టన్నులు, మెప్మా ద్వారా 5675 మెట్రిక్ టన్నులు, డీసీఎంఎస్ ద్వారా 1669 మెట్రిక్ టన్నులు కొనుగొలు చేశారు. అందులో మిల్లులకు 174845 మెట్రిక్ టన్నులు పంపించింది. పౌరసరఫరాల శాఖ లక్ష్యం ప్రకారం మే మాసం వరకు 2.75 లక్షల మెట్రిక్ టన్నులు, జూన్ మాసంలో 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది.
రైతులకు రూ 309.71 కోట్లు చెల్లింపు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగిలో ఇప్పటివరకు రూ 443.57 కోట్ల విలువైన ఽ185677 మెట్రిక్ టన్నల ధాన్యాన్ని 234841 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇందులో ఇప్పటివరకు19336 మంది రైతులకు రూ 309.71కోట్లు చెల్లించారు. ఐకేపీ ద్వారా కొనుగోలు చేసిన 10369 మంది రైతులకు రూ.162.89కోట్లు చెల్లించగా, సింగిల్ విండోల ద్వారా 8293 మంది రైతులకు రూ 135.33 కోట్లు, డీసీఎంఎస్ ద్వారా 129మంది రైతులకు రూ 2.65 కోట్లు, మెప్మా ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన 545 మంది రైతులకు రూ 8.85 కోట్లు ధాన్యం డబ్బులను చెల్లించారు.