ధాన్యం కొనుగోళ్లకు కసరత్తు
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:52 AM
ఖరీఫ్ సీజన్‌లో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. అక్టోబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. గత వానాకాలం సీజన్‌లో జిల్లాలో 325 కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఈసారి కూడా పంట దిగుబడికి అనుగుణంగా అంతే స్థాయిలో కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావా లని ఏర్పాట్లు చేస్తున్నారు.
పెద్దపల్లి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) ఖరీఫ్ సీజన్‌లో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. అక్టోబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. గత వానాకాలం సీజన్‌లో జిల్లాలో 325 కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఈసారి కూడా పంట దిగుబడికి అనుగుణంగా అంతే స్థాయిలో కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావా లని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా వారం రోజులుగా కలెక్టర్, అదనపు కలెక్టర్లు సమావేశాలను నిర్వహిస్తున్నారు. గతేడాది ఐకేపీ ఆధ్వర్యంలో 161, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 184, డీసీఎంఎస్ ద్వారా 36, హాకా ఆధ్వర్యంలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఏఐతో పకడ్బందీ పర్యవేక్షణ
ఈసారి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తు న్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ, అక్కడ కల్పించిన మౌలిక వస తులు, సాక్ష్యాలను పరిశీలించేందుకు ప్రొక్యూర్‌మెంట్ సెంటర్ స్మార్ట్ అసెస్‌మెంట్ పోర్టల్‌ను వినియోగించనున్నారు. పూర్తిగా కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే విధానంలో కేంద్రాల నిర్వాహకులు నిర్దేశించిన ప్రశ్నలకు సమాధానాలతోపాటు తాజా ఫొటోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్‌లోడ్ చేసిన ఫొటోలను ఏఐ సాంకేతికత సంబంధిత కేంద్రంలోనివా కాదా అనే అంశాలను పరిశీలించనుంది. ఈ ప్రక్రియలో ఎల్ జీరో నుంచి ఎల్ 5 వరకు గ్రేడింగ్ ఇవ్వనున్నారు. తాత్కాలిక కేంద్రా లకు కనీసం ఎల్ 3, శాశ్వత కేంద్రాలకు ఎల్ 4 గ్రేడింగ్ ఉండేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
తాజా ఫొటోలకే ప్రాధాన్యం
కేంద్రాల్లో టార్ఫాలిన్లు, తూకం యంత్రాలు, తేమశాతం కొలిచే పరిక రాలు, ప్యాడీ క్లీనర్లు, గన్నీ బ్యాగులు తదితర మౌలిక వసతులు సిద్ధంగా ఉండాలి. వీటికి సంబంధించిన ఫొటోలను స్పష్టంగా, మంచి వెలుతురులో తీసి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇతర ఫొటోలను తిరిగి ఫొటో తీయడం, ఎడిట్ చేయడం, ఒకే ఫొటోను పలుమార్లు ఉపయోగిం చడం వంటి వాటికి అవకాశం లేకుండా చర్యలు చేపడుతున్నారు.
వాహనాలకు జీపీఎస్
కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు ధాన్యం తరలింపుపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ధాన్యం రవాణా చేసే ప్రతీ వాహనానికి జీపీఎస్ ట్రాకర్ తప్పనిసరి చేయనున్నారు. దీంతో వాహనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది, ఎంతసేపు ప్రయాణిస్తోంది వంటి వివరాలను నిరంతరం పర్యవేక్షించే అవకాశం జిల్లా యంత్రాంగానికి ఉంటుంది. ఓవర్‌లోడ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోనున్నారు.
హమాలీల కొరత లేకుండా..
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన తర్వాత హమాలీల కొరతతో రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలతోపాటు రైస్‌మిల్లుల వద్ద అవసరమైన సంఖ్యలో హమాలీలను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నారు. స్థానికంగా హమాలీలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను సమకూర్చుకునే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏడు రకాల సన్న ధాన్యమే..
ఈసారి ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల సన్న ధాన్యాన్నే సేకరిం చనున్నారు. ఆయా ప్రాంతాల్లో రైతులు ఏ రకం ధాన్యం సాగు చేశారనే అంశంపై ముందుగానే గ్రామాల వారీగా సర్వే నిర్వహించి, అందుబాటులో ఉన్న రకాల ఆధారంగా కొనుగోలు కేంద్రాల్లో సేకరణ చేపట్టనున్నారు. దీంతో రైతులు తమ వద్ద ఉన్న ధాన్యం రకానికి అనుగుణంగా సమీప కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.
వచ్చేనెల మొదటి వారంలో ప్రారంభం
కేంద్రాల ఏర్పాటు, మిల్లుల మ్యాపింగ్, రవాణా వాహనాల సమీకరణ, గోదాముల గుర్తింపు, హమాలీల ఏర్పాటు తదితర పనులను కొనుగోళ్లు ప్రారంభమయ్యే నాటికి పూర్తి చేయాలని కార్యాచరణ రూపొందించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, తేమశాతం కొలిచే మీటర్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచనున్నారు. రైతులు పంటను విక్రయించేందుకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామాలకు చేరువలోనే కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.