సవాలుగా మారిన ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - May 17 , 2026 | 11:37 PM
ధాన్యం కొనుగోలు సవాల్‌గా మారింది. అన్‌లోడింగ్ ఇబ్బందులు, మిల్లుల్లో స్థల సమస్య, కేంద్రాలలో నిర్లక్ష్యంగా కొనుగోళ్లు, లారీల కొరత, కటింగ్ వంటి అనేక అంశాలు రైతులు, అధికారులకు, మిల్లర్లకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ సీజన్‌లో వరి పంటలకు ఎలాంటి తెగుళ్ళు సోకకుండా ఇబ్బడిముబ్బడిగా దిగుబడులు వచ్చాయి.
సుల్తానాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు సవాల్‌గా మారింది. అన్‌లోడింగ్ ఇబ్బందులు, మిల్లుల్లో స్థల సమస్య, కేంద్రాలలో నిర్లక్ష్యంగా కొనుగోళ్లు, లారీల కొరత, కటింగ్ వంటి అనేక అంశాలు రైతులు, అధికారులకు, మిల్లర్లకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ సీజన్‌లో వరి పంటలకు ఎలాంటి తెగుళ్ళు సోకకుండా ఇబ్బడిముబ్బడిగా దిగుబడులు వచ్చాయి. వరి కోతలు కూడా సకాలంలో ప్రారంభమయ్యాయి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకముందే రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని ఆయా కేంద్రాల వద్దకు తీసుకువచ్చి ఆరబోసుకున్నారు. ఈసారి ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా రైతులు కొందరు నెల రోజుల నుంచి కూడా కేంద్రాల వద్దనే ఉండిపోవాల్సి వచ్చింది. తేమ శాతం ఇతర నిబంధనల ప్రకారం ధాన్యాన్ని సిద్ధం చేసినా కూడా కాంటా వేయడంలో కేంద్రాల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో కొన్నిచోట్ల రైతులు ఆందోళనకు దిగారు. ఇప్పటికీ ఆయా గ్రామాల్లో ధాన్యాన్ని ఇంకా కాంటా వేయడం లేదని పేర్కొంటున్నారు.
కలెక్టర్ తనిఖీలు
ధాన్యం కొనుగోళ్ళను వేగవంతంగా నిర్వహించేందుకు, రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జిల్లాలో అక్కడక్కడా సమస్యలు రావడంతో కలెక్టర్ స్వయంగా రంగప్రవేశం చేస్తున్నారు. అనేక చోట్ల కొనుగోలు కేంద్రాలను, రైసుమిల్లులను తనిఖీలు చేస్తూ పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో అత్యధిక రైస్‌మిల్లులు సుల్తానాబాద్ పట్టణంలో ఉన్నాయి. ఇక్కడే పెద్ద ఎత్తున ధాన్యం నిలువ చేయడానికి ప్రభుత్వ, ప్రైవేట్‌సంస్థల గోదాములు అందుబాటులో ఉన్నాయి. అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వస్తున్న ధాన్యాన్ని సకాలంలో అన్‌లోడింగ్ చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్‌లోడింగ్ వేగవంతం చేయాలని ఎలాంటి కటింగ్‌లు అనుమతించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. అన్‌లోడింగ్ సకాలంలో జరిగేందుకు మిల్లుల్లో అధికారుల బృందాన్ని పర్యవేక్షణ కోసం నియమించారు.
గత సీజన్ నిలువలు మిల్లులో
గత వానాకాలం నాటి సీజన్‌కు సంబంధించిన ధాన్యం నిలువలే ఇంకా మిల్లుల్లో ఉన్నాయి. కొత్తగా వస్తున్న నిలువలను ఎక్కడ నిలువ చేయాలంటూ కొందరు మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. గత సీజన్‌లో ఒక్కొక్క రైస్‌మిల్లుకు మూడు వందల నుంచి నాలుగు వందల లారీల ధాన్యాన్ని ప్రభుత్వం కేటాయించింది. అందులో దాదాపు వంద లారీల బియ్యం మాత్రమే తాము ఎఫ్‌సీఐకి అప్పగించామని, ఇంకా తమ మిల్లుల్లో రెండు వందల నుంచి మూడు వందల లారీల ధాన్యం నిల్వ ఉందని మిల్లర్లు వాపోతున్నారు. ఈ సీజన్‌కు సంబంధించిన ధాన్యాన్ని దిగుమతి చేసుకుని నిలువ చేయడం సమస్యగా మారిందంటున్నారు. మిల్లుల్లోని గోదాముల్లో ధాన్యం నిలువలు నిండిపోయి మిల్లు ఆవరణలో ఖాళీ లేకుండా నిలువ చేస్తున్నారు.
హమాలీల సమస్య ఎండల తీవ్రత
ఎండల తీవ్రత మూలంగా మిల్లుల్లోని హమాలీలు అనుకున్న మేరకు పని చేయడం లేదు. దీంతో మిల్లులకు వస్తున్న ధాన్యం లారీలను సకాలంలో దిగుమతి చేయడం సాధ్యం కావడం లేదు. మరో వైపు అధికారులు దిగుమతి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ పరిస్థితిల్లో మిల్లర్లు రైతులు, అధికారుల మధ్యన సతమతమవుతున్నారు.
ఇటు మక్కలు..అటు ధాన్యం
జిల్లాలో ఒకేసారి ధాన్యం కొనుగోళ్లు మరో వైపు మక్కల కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలో వాహనాల కొరత ఏర్పడుతుంది. అయినా అధికారులు నాలుగైదు శాఖలతో సమన్వయ పరుస్తూ వాహనాలను సమకూరుస్తున్నారు. ఏదేమైన జిల్లాలో ఇటు మక్కల కొనుగోళ్లు అటు దాన్యం కొనుగోళ్లును పర్యవేక్షించడం అధికారులకు కత్తిమీద సాముగా పరిగణమించింది.