సర్కార్ బకాయిలు రూ.871 కోట్లు
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:31 AM
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) వెలుగులను పంచుతూ దేశంలోనే సహకార రంగంలో అగ్రగామిగా నిలిచింది. మరోవైపు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా సెస్ సంస్థకు బకాయిలు గుదిబండగా మారాయి. విద్యుత్ బిల్లుల చెల్లింపులో కాస్త ఆలస్యమైతేనే వినియోగదారులపై అపరాధ రుసుం విధిస్తారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) వెలుగులను పంచుతూ దేశంలోనే సహకార రంగంలో అగ్రగామిగా నిలిచింది. మరోవైపు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా సెస్ సంస్థకు బకాయిలు గుదిబండగా మారాయి. విద్యుత్ బిల్లుల చెల్లింపులో కాస్త ఆలస్యమైతేనే వినియోగదారులపై అపరాధ రుసుం విధిస్తారు. గడువు దాటిపోతే కనెక్షన్ తొలగిస్తారు. కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకుంటే మాత్రం ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో సెస్ సంస్థ ఉండిపోయింది. ప్రభుత్వం, ఇతర విభాగాల నుంచి సిరిసిల్ల సెస్‌కు రావాల్సిన బకాయిలు అక్షరాలు రూ.871.05 కోట్లు ఉంది. ప్రభుత్వం ఆయా శాఖలకు నిధులు రాక, విద్యుత్ బిల్లుల చెల్లింపులు భారంగానే మారాయని తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చీకట్లను పారదోలి వెలుగులు నింపడానికి 1970లో 420 సర్వీసులతో ప్రారంభమైన సహకార విద్యుత్ సరఫరా సంఘంలో ప్రస్తుతం 3 లక్షల 46వేల 167 మంది సభ్యులు ఉన్నారు. గృహ కనెక్షన్లు 1,71,510, వాణిజ్య కనెక్షన్లు 21,486 కనెక్షన్లు, పరిశ్రమల కనెక్షన్లు 1,528, పవర్‌లూం కనెక్షన్లు 5,635, వ్యవసాయ కనెక్షన్లు 78,611, గ్రామపంచాయతీ వాటర్ కనెక్షన్లు, విద్యుత్ దీపాల 3,118, దేవాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వం కార్యాలయాల కనెక్షన్లు ఉన్నాయి. విద్యుత్ రంగంలోనే ప్రత్యేకతను సాధించిన సెస్‌కు ప్రభుత్వం, వినియోగదారులు, వివిధ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు గుదిబండగా మారాయి. ప్రస్తుతం సెస్‌కు రూ.871.05 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఇందులో ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థల నుంచి దాదాపు రూ.700 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఇందులో సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు 50 శాతం సబ్సిడీ బకాయిలు రూ.57.46 కోట్లు, దీనికి సర్‌ఛార్జ్‌గా రూ.1.33 కోట్లతో కలిపి రూ.58.79 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. జిల్లాలో 260 గ్రామ పంచాయతీలు ఉండగా వీటికి సంబంధించిన నీటిసరఫరా, వీధి దీపాలకు సంబంధించి 31 జూన్ 2020 నాటికి రూ.319.52 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి సంబంధించి రూ.220.11కోట్ల బకాయిలు ఉన్నాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి బిల్లులు రూ.20.27 బకాయిలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దేవాలయాలు, 1,049 ఉండగా వీటికి సంబంధించి రూ 3.53కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నాయి. జిల్లాలో సెస్ వినియోగదారుల నుంచి వివిధ కనెక్షన్లకు సంబంధించి రూ.199.15 కోట్ల బకాయిలు రావల్సి ఉంది. ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నా వ్యవసాయదారుల నుంచి సర్వీస్ రుసుము నుంచి రావాల్సిన బకాయిలు రూ.16.13 కోట్లు రావాల్సి ఉంది. గృహాలకు సంబంధించి రూ.40.40కోట్లు, కమర్షియల్‌కు సంబంధించి రూ.25.43 కోట్లు, పరిశ్రమలకు సంబంధించి రూ.47.86 కోట్లు, మరమగ్గాల పరిశ్రమ నుంచి రూ4.29కోట్లు బకాయిలు రావాల్సి ఉంది.
సెస్‌ను వీడని వీలినం కుట్ర
సెస్‌ను వీలినం కుట్ర మాత్రం వీడటం లేదు. గత ప్రభుత్వ హయాం నుంచి సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరాల సంఘం (సెస్)కు రావాల్సిన బకాయిలు, సెస్ చెల్లించాల్సిన బకాయిలపై చర్చ జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో విద్యుత్ బకాయిల కంటే సెస్‌ను ఎన్పీడీసీఎల్‌లో వీలినం చేయాలనే కుట్రలే ఎక్కువ జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఇటీవల విద్యుత్ టారిఫ్ సవరణల విచారణ సందర్భంగా కొంతమంది సెస్‌ను ఎన్పీడీసీఎల్‌లో కలపాలి అనే అంశాన్ని లేవనెత్తారు. సిరిసిల్ల సెస్ వినియోగదారులు ఎన్పీడీసీఎల్‌లో విలీనీనాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దేశంలోనే సహకార రంగంలో విద్యుత్ వెలుగులు పంచుతున్న గ్రామీణ సహకార విద్యుత్ సరఫరా సంస్థలకు 28 ఏళ్ల క్రితం పట్టిన ప్రెవేటీకరణ గ్రహణం వీడడం లేదు. విద్యుత్ సంస్కరణల పేరుతో అప్పటి ప్రభుత్వం రాష్ట్ర విద్యుత్ బోర్డును రెండు ముక్కలుగా చీల్చి జెన్‌కో, ట్రాన్స్‌కోగా విభజించింది. ఇదే క్రమంలో 1998లో ఏర్పాటుచేసిన సుబ్రహ్మణ్యం అధ్యయన కమిటీ గ్రామీణ విద్యుత్ సంస్థలను రద్దు చేయడం లేదా ప్రైవేటీకరణకు సిఫార్సు చేసింది. దీనికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, ఆందోళనల ఫలితంగా అప్పుటి ప్రభుత్వం వెనకంజ వేసింది. 23జూలై 2002లో జీవో 331 ద్వారా రాష్ట్రంలో 20 సంస్థలను ప్రైవేటీకరించే జాబితాలో తొమ్మిది గ్రామీణ సహకార విద్యుత్ సరఫరా సంస్థలను కూడా చేర్చింది. ఆనాటి నుంచి నేటివరకు తరచూ విలీనం వివాదం ముందుకు వస్తూనే ఉంది. సహకార ప్రాతిపదికన విద్యుత్ సరఫరా సంస్థలను ఏర్పాటు చేయాలని 1969లో కార్యకలాపాలు కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థ దేశంలో మొట్టమొదటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో పైలట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టారు. ఇందులో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటుచేసిన విద్యుత్ సొసైటీల్లో 1970లో ఏర్పాటు చేసిన సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం మొదటిది. దీని తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 1982లో తొమ్మిది గ్రామీణ సహకార విద్యుత్ సరఫరా సంఘాలను నెలకొల్పారు. ప్రస్తుతం ఆంధ్రాలో చిత్తూరు జిల్లా కుప్పం, విజయనగరం జిల్లా చీపురుపల్లి, తెలంగాణలో సిరిసిల్ల సొసైటీలు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన సొసైటీలను విద్యుత్ సంస్థల్లో విలీనం చేశారు. ఎన్పీడీసీఎల్ సెస్‌ను విలీనం చేసే ప్రయత్నాల వల్ల సిరిసిల్ల వెలుగుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా నిలబెడుతుందని చర్చించుకుంటున్నారు.
అన్ని కేటగిరీల ద్వారా రావాల్సిన రెగ్యులర్ బకాయిలు(లక్షల్లో)..
మండలం బకాయిలు
సిరిసిల్ల 6,184.10
వేములవాడ టౌన్ 1,438.39
వేములవాడ రూరల్ 411.62
వేములవాడ అర్భన్ 763.19
చందుర్తి 476.24
కోనరావుపేట 1,059.74
బోయినపల్లి 1,192.75
రుద్రంగి 137.18
ఎల్లారెడ్డిపేట 1,813.45
గంభీరావుపేట 1,447.67
ముస్తాబాద్ 1,388.16
ఇల్లంతకుంట 1,697.21
తంగళ్లపల్లి 1,783.89
------------------------------------------
మొత్తం 19,915.63
---------------------------------------------