గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం
ABN , Publish Date - Nov 27 , 2026 | 11:40 PM
కృష్ణ, గోదావరి జలాలను గురుదక్షిణ కింద రేవంత్‌రెడ్డి ఏపీ ముఖ్యమంత్రికి ధారదత్తం చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. శుక్రవారం మండలంలోని నంది రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, ఫ్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డిలతో కలిసి పాల్గొన్నారు.
ధర్మారం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): కృష్ణ, గోదావరి జలాలను గురుదక్షిణ కింద రేవంత్‌రెడ్డి ఏపీ ముఖ్యమంత్రికి ధారదత్తం చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. శుక్రవారం మండలంలోని నంది రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, ఫ్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ జలాలను ఏపీ తరలించుకు పోతుంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులుగా హరీష్ ప్రశ్నిస్తే మంత్రి అడ్లూరి లక్ష్మన్కుమార్కు ఉలుకెందుకని ప్రశ్నించారు. నీటి వనరుల విషయంలో అన్యాయం జరిగిన ప్రతీసారి కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు నిలదీస్తున్నారని, అది ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత అని అన్నారు. తెలంగాణ జలాలను కాపాడకుండా చేతగానితనంతో ఆంధ్రా పాలకుల ముందు మోకరిల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు నిధులు లేక వెనుకబడిన తెలంగాణను ఎన్నో ఒడుదుడుకులకు ఓర్చి సాధించుకున్నామని, తిరిగి తెలంగాణను నాశనం చేసేందుకే కాంగ్రెస్ అఽధికా రంలోకి వచ్చిందంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు.
అడ్లూరివి అవగాహన లేని మాటలు
తెలంగాణ నీటి వనరులపై మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్ అవగాహన లేదని, అనవసరంగా మాట్లాడి పరువు తీసుకోవద్దని మాజీ మంత్రి కొప్పుల ఎద్దేవా చేశారు. పదేళ్ళలో ధర్మపురి నియోజకవర్గంలో ఏ ఒక్క ఎకరాన్ని ఎండనిచ్చానా అంటూ ప్రశ్నించారు. ప్రాజెక్ట్ నిర్మాణం రాష్ట్ర ప్రజలందరికి న్యాయం జరిగేలా నిర్మిస్తారని, మా ప్రాంత నీళ్ళను సిరిసిల్లకు, గజ్వెల్‌కు, సిద్దిపేటకు తరలిస్తున్నారని మంత్రి మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. నంది రిజర్వాయర్ సాగు తాగు నీరందించేందుకు లెప్ట్, రైట్ కెనాల్‌ను నిర్మించామని అవి పెండింగ్ ఉంటే మంత్రి ఎన్నడైనా రివ్యూ చేశారా అన్నారు. రైతులు దిక్కులేని పక్షుల్లాగా తమ ధాన్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటుంటే మంత్రి ఎందుకు కేంద్రాలు ప్రారంభించడం లేదని అన్నారు. తెలంగాణలో రైతులు వరి పంటకు అలవాటు పడ్డారని, నీళ్లు లేని పంటలను పండించమని ప్రభుత్వం ఉచిత సలహాలు ఇస్తుందని మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మార్మం, ఎండపల్లి, వెల్గటూర్, గొల్లపల్లి, మండలాల బీఆర్ఎస్ నాయకలు, కార్యకర్తలు పాల్గొన్నారు.