అంత్యక్రియలకు అవస్థలు..
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:47 AM
నగరంలోని మానేరు నదీ తీరంలోని హిందూ శ్మశానవాటిక నిర్వహణను నగరపాలక సంస్థ పూర్తిగా గాలికి వదిలేసింది. 2017 సంవత్సరంలో ఆనాటి పాలకవర్గం నగరంలోని మూడు ప్రధాన శ్మశానవాటికలను వైకుంఠధామాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం హామీ నిధులను కేటాయించింది.
కరీంనగర్ టౌన్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): నగరంలోని మానేరు నదీ తీరంలోని హిందూ శ్మశానవాటిక నిర్వహణను నగరపాలక సంస్థ పూర్తిగా గాలికి వదిలేసింది. 2017 సంవత్సరంలో ఆనాటి పాలకవర్గం నగరంలోని మూడు ప్రధాన శ్మశానవాటికలను వైకుంఠధామాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం హామీ నిధులను కేటాయించింది. నగరంలోనే మానేరు నది ఒడ్డున ఉన్న శ్మశానవాటికను తొలగించి విశాలమైన స్థలంలో సీఎం హామీ నిధులు కోటి రూపాయలతో వైకుంఠఽధామం పనులను ప్రారంభించారు. ఆ నిధులు సరిపోవడం లేదని ఆ తర్వాత మరో 70 లక్షల రూపాయల స్మార్ట్‌సిటీ నిధులను కూడా ఖర్చుచేశారు. దాదాపు 2 కోట్ల రూపాయలతో దహనవాటికలు, విశాలమైన రోడ్లు, ఆహ్లాదకరంగా గ్రీనరీతో కూడిన పార్కులు, పురుషులు, మహిళలకు వేర్వేరుగా స్నానపు గదులు, మరుగుదొడ్లను నిర్మించారు. అంత్యక్రియలకు వచ్చే వారు కూర్చునేందుకు హట్స్, బెంచీలు ఏర్పాటు చేశారు. స్నానం చేసేందుకు వీలుగా అక్కడక్కడ నల్లాలను ఏర్పాటు చేశారు. స్మశానవాటికకు వెళ్లే మార్గంతోపాటు దహనవాటిక, వాటి చుట్టుపక్కల హైమాస్టులైట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడికి వస్తే శ్మశానవైరాగ్యాన్ని పూర్తిగా మరిచిపోతారని గొప్పగా చెప్పారు. ఈ వైకుంఠధామం నిర్మాణం, నిర్వహణ బాధ్యతను ఏఈ స్థాయి అధికారికి అప్పగించి అక్కడ ముగ్గురు సిబ్బందిని కూడా నియమించారు. త్వరలో ఎలక్ర్టిక్ దహనవాటికలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
వెలగని లైట్లు.. కీకల్లో ఇబ్బందులు
అభివృద్ధి పేరుతో నీళ్లలాగా ప్రజాధనాన్ని వెచ్చించిన నగరపాలక సంస్థ ఆ తర్వాత నిర్వహణను పూర్తిగా గాలికి వదిలివేయడంతో ఇప్పుడు వైకుంఠధామం సమస్యలకు నిలయంగా మారింది. అప్పుడు రోడ్డుకు దగ్గరలో ఉండేదని, ఇప్పుడు అంత్యక్రియలు జరిపేందుకు లోనివెళ్లడం కష్టంగా మారింది. రాత్రి వేళల్లో వీధిదీపాలు వెలగకపోవడంతో చీకట్లు కమ్ముకుంటున్నాయి. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. వర్షం పడితే ఇక లోపలికి రావడం మరింత కష్టంగా మారుతుంది. మట్టి రోడ్లపై నీరు నిలువడంతో పెద్దపెద్ద గుంతలు పడ్డాయి. ప్రజలు వైకుంఠధామంలోకి వెళ్లలేని విధంగా రోడ్లు దెబ్బతిన్నాయు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లేడంతో అధికారులతో మాట్లాడి సీసీ పైపులను వేసి నీరు నిలువకుండా తాత్కాలిక చర్యలు చేపట్టారు. బల్దియా అధికారులు, పాలకవర్గం స్పందించి వైకుంఠధామానికి ప్రహరీ, రోడ్లు, డ్రైనేజీలతోపాటు నీటి సరఫరా, ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరుతున్నారు.