పంచాయతీలకు నిధుల పవర్
ABN , Publish Date - Nov 15 , 2026 | 12:25 AM
గ్రామాల్లో పన్నుల ద్వారా వసూలు చేసిన డబ్బులు నేరుగా వాడుకునే పరిస్థితి లేక పంచాయతీ పాలకవర్గాలు అనేక ఇబ్బందులను ఎదుర్కొనేవి. గ్రామంలో పారిశుధ్యం, నీటి సరఫరా నిర్వహణ, వీధి దీపాల వంటి అత్యవసర పనులు చేపట్టడానికి కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చేవి. దీంతో సర్పంచులు సొంతంగా డబ్బులు ఖర్చు చేసి ఎదురుచూసే పరిస్థితులు ఉండేవి. ప్రభుత్వం తాజాగా గ్రామపంచాయతీల నిధుల వినియోగంలో వెసులుబాటు కల్పించడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచ్‌ల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
(ఆంరఽధజ్యోతి సిరిసిల్ల)
గ్రామాల్లో పన్నుల ద్వారా వసూలు చేసిన డబ్బులు నేరుగా వాడుకునే పరిస్థితి లేక పంచాయతీ పాలకవర్గాలు అనేక ఇబ్బందులను ఎదుర్కొనేవి. గ్రామంలో పారిశుధ్యం, నీటి సరఫరా నిర్వహణ, వీధి దీపాల వంటి అత్యవసర పనులు చేపట్టడానికి కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చేవి. దీంతో సర్పంచులు సొంతంగా డబ్బులు ఖర్చు చేసి ఎదురుచూసే పరిస్థితులు ఉండేవి. ప్రభుత్వం తాజాగా గ్రామపంచాయతీల నిధుల వినియోగంలో వెసులుబాటు కల్పించడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచ్‌ల్లో హర్షం వ్యక్తం అవుతోంది. జిల్లాలో 260 గ్రామపంచాయతీలు ఉండగా, వాటి పరిధిలో ప్రతి సంవత్సరం 100శాతం పనులు వసూలు చేసి అభినందనలు అందుకుంటున్న పాలకవర్గాలకు జమ చేసిన డబ్బులు డ్రా చేసుకోవడం కోసం సబ్‌ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. మరోవైపు ప్రభుత్వం నిధులు వాడుకోకుండా ఆంక్షలు విధించడంతో గ్రామాల్లో అభివృద్ధికి ఆటంకంగా మారేది. ఈ క్రమంలోనే ప్రభుత్వం పంచాయతీరాజ్ యాక్ట్-2018, యాక్ట్ 27ఆఫ్ 20206 జీవో ఎంఎస్ 13 మెమో 3406 ప్రకారం బ్యాంకు ఖాతాలో పంచాయతీల సొంత ఆదాయంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు జమ అవుతాయి. ఖాతాలోకి వచ్చిన నిధులు గ్రామాభివృద్ధి పనులకు, అత్యవసరాలకు వినియోగించుకునేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
యూనియన్ బ్యాంకుల్లో ఖాతాలు
పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రంలోని జిల్లాల వారీగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలను కేటాయించింది. దాని ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాను యూనియన్ బ్యాంక్‌లో ఖాతాలు తెరిచారు. జిల్లాలో 12 మండలాల్లో 260 గ్రామ పంచాయతీలో ఉండగా, బోయినపల్లిలో 23, చందుర్తిలో 19, ఇల్లంతకుంటలో 35, గంభీరావుపేటలో 22, కొనరావుపేటలో 28, ముస్తాబాద్‌లో 22, రుద్రంగిలో 10, తంగళ్ళపల్లిలో 30, వీర్నపల్లిలో 17, వేములవాడలో 11, వేములవాడ రూరల్‌లో 17, ఎల్లారెడ్డిపేటలో 26 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామపంచాయతీలు జీరో బ్యాలెన్స్ ఖాతాలను తెరిచారు. ఇందులో గ్రామపంచాయతీ సొంత ఆదాయ వనరులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులు జమ చేస్తారు.
తక్షణ వినియోగానికి వెసులుబాటు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంతో గ్రామపంచాయతీలో సొంత ఆదాయం వాటి ఖాతాలోనే అందుబాటులో ఉండడంతో స్థానిక అవసరాలకు తక్షణ వినియోగానికి వెసులుబాటు కలుగుతుంది. సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామపంచాయతీల్లో వవిధ పన్నుల ద్వారా రూ.7.93 కోట్ల వరకు పనుల ద్వారా ఆదాయం డిమాండ్ ఉంది. అన్ని గ్రామపంచాయతీ దాదాపు 100 శాతం వరకు వసూలు చేస్తున్నారు. గతంలో ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను సబ్ ట్రెజరీ కార్యాలయంలో జమ చేసేవారు. ఆ డబ్బులను అభివృద్ధి అవసరాలకు వినియోగించుకోవాలంటే సర్పంచ్ చెక్కులు రాసి ఎస్టీవోలో ఇచ్చేవారు. ఆ చెక్కుకు టోకెన్ ఇచ్చేవారు. చెక్కును ప్రభుత్వం అనుమతి కోసం పంపేవారు. సాంకేతిక సమస్యలు, నిధుల సమస్యలు తలెత్తడం వంటి వాటితో నిధులు డ్రాకు 10 నుంచి 20 రోజులు పట్టేది. దీంతో సర్పంచులు అత్యవసరాల కోసం అప్పులు చేసే పరిస్థితులు ఉండేవి. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటులో సర్పంచ్, ఉపసర్పంచ్‌లు నేరుగా నిధులను డ్రా చేసుకునేలా వీలు కల్పించారు.
పంచాయతీలకు ప్రత్యేక వెబ్‌సైట్
గ్రామపంచాయతీ ఖాతాల్లోనే డబ్బులు జమ చేసే వీలు కల్పించడంతోపాటు ప్రతి గ్రామపంచాయతీలకుప్రత్యేక వెబ్‌సైట్‌ను త్వరలోనే ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇప్పటికే జిల్లాలోని 260 గ్రామపంచాయతీలో వెబ్‌పైట్‌లను సిద్ధం చేశారు. గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక-2026(జీపీఎస్‌ఏపీ) రూపకల్పన అమలులో రాబోయే ఐదేళ్ల కాలంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రలికలు గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. గ్రామపంచాయతీలకు వెబ్‌సైట్, డాష్‌బోర్డు ఏర్పాటు చేసినట్లే ప్రతి నియోజకవర్గానికి కూడా ప్రత్యేక వెబ్‌సైట్, డాష్ బోర్డు కూడా ఉంటుంది. ప్రతినెల పనుల పురోగతి, నిధుల వినియోగం సాధించిన లక్ష్యాలను వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ చేస్తారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. గ్రామాల్లో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రత్యేక డాష్‌బోర్డు ఉపయోగపడుతుంది. వెబ్‌సైట్‌లో సంబంధిత అధికారులు తప్పనిసరిగా సమాచారం ఇవ్వకపోయినా, తప్పుడు సమాచారం పొందుపర్చినా పంచాయతీరాజ్ చట్టం- 2018లోని సెక్షన్ 135 ప్రకారం చర్యలు తీసుకునే వీలుంది. పంచాయతీల్లో లెక్కలు కూడా పక్కాగా ఉంటాయి. పంచాయతీకి వచ్చే నిధులు వివరాలు కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆన్‌లైన్ ద్వారా సేవలు పొందే వీలు కూడా కల్పిస్తారు. దీంతో కార్యాలయం చుట్టూ తిరిగే పని ఉండదు. వెబ్‌పైట్‌లో ప్రతి గ్రామపంచాయతీ ఊరి పేరు, అనుబంధ గ్రామాలు, రెవెన్యూ గ్రామాలు, గ్రామం విస్తీర్ణం, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వారి మొబైల్ నంబర్లు, జనాభా, పురుషులు, మహిళలు ఇతరులు, కుటుంబాలు, అక్షరాస్యత, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, దివ్యాంగులు, రైతులు, వ్యవసాయ భూమి నర్సరీలు, ఎన్ని కిలోమీటర్ల వరకు బీటీ రోడ్లు, సీసీరోడ్లు, మట్టి రోడ్లు ఉన్నాయి, ఇందులో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న రోడ్లు, తాగునీటి వసతి, విద్యుత్ కనెక్షన్లు, వీధి దీపాలు, విద్యుత్ సబ్‌స్టేషన్, మురుగు కాలువల సిస్టం, మార్కెటింగ్, వ్యక్తిగత మరుగుదొడ్లు, పార్కులు, సామాజిక భవనాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, మహిళా సంఘాలు, ఉపాధిహామీ పనుల లబ్ధిదారులు ఇలా పూర్తి వివరాలను ఫొటోలు నమోదు చేస్తారు. దీంతోపాటు వచ్చే మూడేళ్లలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రణాళికలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పంచాయతీలకు వచ్చే నిధులు, చేపట్టనున్న పనుల వివరాలు కూడా పొందుపరిచారు. సమగ్ర సమాచారంతో ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల నిధులు సమన్వయం చేసుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. గ్రామాల్లో అంతర్గత రోడ్లు, మురుగు కాలువలు, తాగునీటి సదుపాయాలు, వైద్య సేవలు, పాఠశాలలు, పచ్చదనం పెంపు వంటి పనులను ప్రాధాన్య క్రమంలో అమలు చేసేందుకు ఉపయోగపడుతుంది.