Share News

వైద్యానికి నిధుల గ్రహణం

ABN , Publish Date - May 17 , 2026 | 01:00 AM

గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రతీ యేటా ఆసుపత్రుల నిర్వహణ, చిన్న మరమ్మతులు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్‌ బిల్లులు, ఫర్నీచర్‌, వైద్య పరికరాలు, అత్యవసర ఔషధాల కొనుగోలు వంటి అవసరాలకు ఇవ్వాల్సిన హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (హెచ్‌డీఎఫ్‌) సమయానికి విడుదల కాకపోవడంతో పీహెచ్‌సీల పరిస్థితి దయనీయంగా మారుతోంది.

వైద్యానికి నిధుల గ్రహణం

జగిత్యాల, మే 16 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రతీ యేటా ఆసుపత్రుల నిర్వహణ, చిన్న మరమ్మతులు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్‌ బిల్లులు, ఫర్నీచర్‌, వైద్య పరికరాలు, అత్యవసర ఔషధాల కొనుగోలు వంటి అవసరాలకు ఇవ్వాల్సిన హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (హెచ్‌డీఎఫ్‌) సమయానికి విడుదల కాకపోవడంతో పీహెచ్‌సీల పరిస్థితి దయనీయంగా మారుతోంది. నేషనల్‌ హెల్త్‌మిషన్‌ ఆధ్వర్యంలో ప్రతీ యేటా హెచ్‌డీఎఫ్‌ విడుదల చేయడంలో నిర్లక్ష్యం నెలకొంటుండడంతో పేదల వైద్య సేవలపై ప్రభావం చూపుతోంది. మూడేళ్లుగా ప్రతిపాదనలు పంపించినా నిధులు విడుదల కాలేదు. దీంతో ప్రతీ చిన్న పనికి కూడా నిధుల కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వైద్య పరికరాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. రోగులు సమస్యలతో సహవాసం చేయాల్సి వస్తోంది. మందుల కొరత, ల్యాబ్‌ పరీక్షలపై ప్రభావం, విద్యుత్‌, తాగునీటి బిల్లులు, పారిశుధ్యంపై ప్రభావం పడుతోంది. ఫలితంగా మందులు, పరీక్షలు, సౌకర్యాలు లేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యంపై నమ్మకం సన్నగిల్లి రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

మూడేళ్లుగా రావాల్సిన నిధులు రూ.99 లక్షలు

ప్రాథమిక కేంద్రాల ఆరోగ్య నిర్వహణకు కేంద్రం ఆర్థిక చేయూతను అందిస్తుంది. ఒక్కో పీహెచ్‌సీకి రూ.1.50 లక్షల మంజూరు చేస్తోంది. జిల్లాలో 17 పీహెచ్‌సీలు, 5 యూపీహెచ్‌సీలు ఉన్నాయి. ఈ లెక్కన 22 కేంద్రాలను తీసుకుంటే ఏడాదికి రూ.33 లక్షల చొప్పున మూడు సంవత్సరాలను రూ.99 లక్షల నిధులు విడుదల కావాల్సి ఉంది. అయితే ఆరోగ్య కేంద్రాల పరిశీలనకు వచ్చిన ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా మోక్షం లభించడం లేదు.

కనీస వసతులు లేక ఇబ్బందులు

జిల్లాలో చాలా చోట్ల పీహెచ్‌సీలకు ప్రహరీలు లేకపోవడంతో అపరిశుభ్రత నెలకొంటున్నట్లు రోగులు అంటున్నారు. మూత్రశాలలు అంతంతమాత్రంగా ఉండడం, భవనం పైకప్పు, గోడలకు పగుళ్లు ఏర్పడడం వంటి ఇబ్బందులున్నాయి. రోగుల తాకిడికి అనుకూలంగా వసతులు కల్పించడం లేదు. కనీసం కొన్ని ఆసుపత్రులలో కూర్చునేందుకు బెంచీలు, కుర్చీలు లేక నిలబడే పరిస్థితి నెలకొంది. చెడిపోయిన వైద్య పరికరాలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఏ వస్తువు చెడిపోయినా మరమ్మతు చేయించేందుకు నిదులు లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం

-సుజాత, డీఎంహెచ్‌వో

పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలకు రావాల్సిన నిధుల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్తాం. అత్యవసర వైద్య పరికరాలు, రిఫ్రిజిరేటర్లు మరమ్మతులయ్యేలా చూస్తున్నాము. రోగులకు తమ పరిధిలో వైద్య సేవలు అందేచేలా చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - May 17 , 2026 | 01:00 AM