Share News

నిధుల పంచాయితీ

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:13 AM

రెండేళ్ల పాటు ప్రత్యేక అధికారుల పాలనలో నిధులు లేక గ్రామాలు అనేక సమ స్యలతో కొట్టుమిట్టాడాయి. చాలా గ్రామాల్లో పారిశుధ్యం లోపించడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. కొత్త పాలకవర్గాలు కొలువుతీరడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర విడుదల చేసింది. ఈ క్రమంలో మాజీ సర్పంచ్‌లు పాత బకాయిలు ముందుకు తీసుకువచ్చారు. ప్రస్తుత, మాజీ సర్పంచుల మధ్య బిల్లుల గొడవకు దారి తీసింది.

నిధుల పంచాయితీ

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

రెండేళ్ల పాటు ప్రత్యేక అధికారుల పాలనలో నిధులు లేక గ్రామాలు అనేక సమ స్యలతో కొట్టుమిట్టాడాయి. చాలా గ్రామాల్లో పారిశుధ్యం లోపించడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. కొత్త పాలకవర్గాలు కొలువుతీరడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర విడుదల చేసింది. ఈ క్రమంలో మాజీ సర్పంచ్‌లు పాత బకాయిలు ముందుకు తీసుకువచ్చారు. ప్రస్తుత, మాజీ సర్పంచుల మధ్య బిల్లుల గొడవకు దారి తీసింది. గ్రామపంచాయతీల్లో రెండేళ్ల పాటు పాలకవర్గం లేకపోవడంతో పెండింగ్‌లో పెట్టిన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని వాటిని తమకు చెల్లించాలంటూ మాజీ సర్పంచులు పట్టు పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత సర్పంచులతోపాటు ప్రత్యేక పాలనలో కార్యదర్శులు చేసిన ఖర్చులు దాదాపు రూ. 5 కోట్ల వరకు ఉన్నట్లుగా చెపుతున్నారు. ఇప్పటికే ఇతర జిల్లాల్లో పాత బకాయిలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అలాంటి ఆదేశాలు లేకపోవడంతో సోమవారం మాజీ సర్పంచ్‌లు జిల్లా కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్‌కు గోడును వెల్లబోసుకున్నారు. తమ హయాంలో జరిగిన పనులకు బిల్లులు వచ్చాయని వాటిని చెల్లించాలని అందుకు చొరవ చూపాలని కలెక్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. మరోవైపు ప్రత్యేక పాలనలో అప్పులు చేసి పనులు చేయించామని తమ బిల్లులు చెల్లించాలని పంచాయతీ కార్యదర్శులు పేచీ పెడుతున్నారు. కొత్త సర్పంచులు గెలవడంతోనే పనులు చేసామని, ఎన్నికల్లోను గెలుపు కోసం ఖర్చు చేయాల్సి వచ్చిందని ఈసారి మొదటగా నిధులు పనులకు ఖర్చు చేసుకుంటామని వాదిస్తున్నారు. రాజకీయ ఒత్తిడిల కారణంగా కొన్ని గ్రామపంచాయతీలో సగం సగం బిల్లులు చెల్లించేలా చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. బిల్లు చెల్లింపుల్లో అధికారులకు తలనొప్పిగా మారింది.

పల్లెలకు నిధుల పండుగ

గ్రామపంచాయతీలకు ఆర్థిక సంఘం నిధుల విడుదలతో వివిధ పనులు చేపట్ట డానికి ఉపశమనం లభిస్తుందని కొత్త పాలకవర్గాలు భావిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 12 మండలాలు 260 గ్రామపంచాయతీలు ఉన్నాయి. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు జనాభా ప్రాతిపదికన ఒక్కో వ్యక్తికి సంవత్సరానికి రూ.150 చొప్పున నిధులు కేటాయిస్తుంది. ఎస్సీ, ఎస్టీ జనాభాకు 10 నుంచి 20 శాతం అదనంగా నిధులు కేటాయిస్తుంది. రెండేళ్లుగా నిధులు లేక ఇబ్బంది పడుతున్న గ్రామాలకు ఊరట ఇస్తూ జిల్లాకు 15 ఆర్థిక సంఘం నిధుల్లో 2023-24, 2024-25 సంవత్సరానికి సంబంధించి రూ.19.83 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సిరిసిల్ల జిల్లాకు 2023-24 సంవత్సరం సంబంధించి 5.88 కోట్లు పంచాయతీల ఖాతాల్లో జమ చేశారు. 2024- 25 ఆర్థిక సంవత్సరానికి చెందిన నిధులు రూ.13.95 కోట్లు త్వరలో జమకావాల్సి ఉంది. ఆర్థిక సంఘం నిధులు తాగునీరు, పారిశుధ్య పనులకు ప్రాధాన్యం కల్పించాల్సి ఉంటుంది. ట్యాంకుల నిర్మాణం, పైప్‌లైన్‌ ఏర్పాటు, డ్రైనేజీ వ్యవస్థ, చెత్త తరలింపు వంటి పనులకు 60శాతం నిధులు, సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాట్లు, పంచా యతీ భవనాల మరమ్మతులు, స్మశాన వాటికలకు 40 శాతం నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. వచ్చిన నిధుల్లో పాత బిల్లు చెల్లింపులు చేయాలని మాజీ సర్పంచులు ఆందోళనబాట పట్టారు. మరోవైపు ఈ - పంచాయతీల నిర్వహణకు 10 శాతం నిధులు జమ చేయాలని ఎంపీవోలు కార్యదర్శులను ఆదేశిస్తున్నట్లు తెలిసింది. గ్రామ పంచా యతీలకు నిధులు వచ్చిన సంబరాన్ని కొత్త సర్పంచులకు మిగిల్చకుండానే మాజీ సర్పంచ్‌లతో గ్రామాల్లో కొత్త పంచాయితీ మొదలైంది.

Updated Date - Mar 03 , 2026 | 12:13 AM