Share News

జిల్లాలో ఉచిత ఇసుకకు చెల్లు

ABN , Publish Date - Mar 28 , 2026 | 11:30 PM

జిల్లాలో రెండేళ్లుగా స్థానిక నదులు, వాగుల ద్వారా ఉచితంగా తీసుక వెళుతున్న ఇసుక రవాణాకు చెక్‌ పడింది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుక వచ్చిన ఇసుక పాలసీని రాష్ట్ర మంతటా ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ఇక నుంచి జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణాను అరికట్టి ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకున్న వారికే సరఫరా చేస్తారు. ఇసుక కోసం బుకింగ్‌ చేసుకున్న వాళ్లకే ఆయా వాగులు, నదుల నుంచి అనుమతించాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లాలో ఉచిత ఇసుకకు చెల్లు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో రెండేళ్లుగా స్థానిక నదులు, వాగుల ద్వారా ఉచితంగా తీసుక వెళుతున్న ఇసుక రవాణాకు చెక్‌ పడింది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుక వచ్చిన ఇసుక పాలసీని రాష్ట్ర మంతటా ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ఇక నుంచి జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణాను అరికట్టి ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకున్న వారికే సరఫరా చేస్తారు. ఇసుక కోసం బుకింగ్‌ చేసుకున్న వాళ్లకే ఆయా వాగులు, నదుల నుంచి అనుమతించాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించిన వారికే ఇసుక సరఫరా చేయనున్నారు. ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలించినట్లయితే వారి వాహనాలకు జరిమానాలు విధించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి లోడింగ్‌, విలేజ్‌ ఫండ్‌ కింద మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులు వ్యక్తిగతంగా నిర్మించుకునే ఇళ్లు, భవనాల కోసం, ప్రభుత్వ పరంగా చేపడుతున్న అభివృద్ధి పనులకు వివిధ రకాల పన్నులతో పాటు లోడింగ్‌ చార్జీలు, విలేజ్‌ ఫండ్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఒక ట్రాక్టర్‌ ఇసుక లోడ్‌కు ప్రభుత్వమే ధరలను నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు లోడింగ్‌ చార్జీలు 400 రూపాయలు, విలేజ్‌ ఫండ్‌ కింద 200, సాఫ్ట్‌వేర్‌ చార్జీ, జీఎస్‌టీ 12, మొత్తం 612 రూపాయలు ఇసుక బుకింగ్‌ చేసుకున్నప్పుడే చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా ఇళ్లు, భవనాలు, ప్రభుత్వ పనులకు కావాల్సిన ఇసుక కోసం జిల్లా పరిపాలన చార్జీల కింద 100, సీనరేజీ పన్ను 120, డీఎంఎఫ్‌టీ (30 శాతం) 36, ఎస్‌ఎంఈటీ 2 శాతం 2.4, ఐటీ 2 శాతం 2.4, సాఫ్ట్‌వేర్‌ చార్జీ, జీఎస్టీ 12, మొత్తం 1173 రూపాయలు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించి బుకింగ్‌ చేసుకుంటే ఆయా క్వారీల నుంచి ఇసుక తీసుక వెళ్లేందుకు అనుమతిస్తారు. అయితే కేవలం ట్రాక్టర్ల ద్వారా మాత్రమే ఇసుక తీసుక వెళ్లేందుకు అనుమతిస్తారు. జిల్లాలో గతంలో స్యాండ్‌ ట్యాక్సీ విధానంలో ఉన్న ట్రాక్టర్లతో పాటు ఏ ట్రాక్టర్లలో నైనా ఇసుకను తీసుక పోవచ్చని అధికారులు తెలుపుతున్నారు.

రెండేళ్లుగా జిల్లాలో ఉచితంగా ఇసుక సరఫరా..

కాంగ్రెస్‌ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలో గల మానేరు, గోదావరి నదుల నుంచే కాకుండా హుస్సేనిమియా వాగు, తదితర వాగుల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉచితంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తీసుక వెళ్లేందుకు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల మేరకు అధికారులు అనుమతించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అనుమతించారు. నిర్ణీత దూరాన్ని బట్టి ధరలు నిర్ణయించినప్పటికీ, ట్రాక్టర్ల యజమానులు అంతకంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేసి దండుకున్నారు. కొందరు ఇదే అదునుగా భావించి అక్రమంగా డంపులు ఏర్పాటు చేసి ప్రైవేట్‌గా విక్రయించుకున్నారు. అంతకుముందు జిల్లాలో అమల్లో ఉన్న స్యాండ్‌ ట్యాక్సీ విధానం ద్వారా ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌ చేసుకున్న వాళ్లకు స్యాండ్‌ ట్యాక్సీ ట్రాక్టర్ల ద్వారా ఇంటి వద్దకే ఇసుక సరఫరా చేసే వాళ్లు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులు దానిని నిలిపి వేయించి ఉచితం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నీటి వనరుల ద్వారా ఉత్పన్నమయ్యే ఇసుకను ఎడాపెడా తవ్వుకుని తీసుక పోవడం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతినడంతో పాటు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకుండా పోతున్నదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని తీసుక వచ్చింది. గతంలో అమల్లో ఉన్న ‘మన ఇసుక.. మన వాహనం’ విధానం ద్వారా ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకున్న వాళ్లకు ఇసుక సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇది ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రానున్నది. ఇందుకోసం జిల్లాలో మానేరు నదిపై సుల్తానాబాద్‌ మండలం నీరుకుల్ల, గట్టెపల్లి, గర్రెపల్లి, ముత్తారం మండలం ఖమ్మంపల్లి, మంథని మండలం విలోచవరం, గోదావరి నదిపై అంతర్గాం మండలం గోలివాడ వద్ద ఇసుక క్వారీలను గుర్తించినట్లు గనులు, భూగర్భ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పి శ్రీనివాస్‌ ఆంధ్రజ్యోతికి తెలిపారు.

Updated Date - Mar 28 , 2026 | 11:30 PM