Share News

ఉచితం మాటున అక్రమ దందా

ABN , Publish Date - Jan 24 , 2026 | 11:52 PM

జిల్లాలో మళ్లీ ఇసుక అక్రమ దందా మొదలయ్యింది. జిల్లా అధికార యంత్రాంగం స్థానిక అవసరాలకు ఉచితంగా అందజేస్తున్న ఇసుకను గుట్టుచప్పుడుగా ఇసుక మాఫియా కమర్షియల్‌ అవసరాలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటోంది.

ఉచితం మాటున  అక్రమ దందా

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో మళ్లీ ఇసుక అక్రమ దందా మొదలయ్యింది. జిల్లా అధికార యంత్రాంగం స్థానిక అవసరాలకు ఉచితంగా అందజేస్తున్న ఇసుకను గుట్టుచప్పుడుగా ఇసుక మాఫియా కమర్షియల్‌ అవసరాలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటోంది. దీంతో ప్రభుత్వాదాయానికి గండి పడుతున్నది. రెండు రోజులుగా కొందరు ట్రాక్టర్ల యజమానులు రామగుండం ఎన్టీపీసీ లోపలికి ఇసుకను గుట్టుచప్పుడుగా తరలించి డంపులు ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీ రెండో గేటు లోపల అక్రమంగా ఇసుక నిల్వ చేశారనే సమాచారం అందుకున్న గనులు, భూగర్భ శాఖ ఏడీ శ్రీనివాస్‌, ఆర్‌ఐ వెంకటగిరి, టీఎస్‌ఎండీసీ ఏరియా ప్రాజెక్టు అధికారి రాజు ఇసుక కుప్పలను గుర్తించి సీజ్‌ చేసి తహసీల్దార్‌ ఈశ్వర్‌కు పంచనామా కోసం అప్పగించారు. అక్కడ నిల్వ చేసిన 153 క్యూబిక్‌ మీటర్లు (229 టన్నులు) ఇసుక నిల్వ ఉన్నట్లు గుర్తించారు. నాలుగు మాసాల క్రితం గోదావరి నది నుంచి ట్రాక్టర్ల యజమానులు రామగుండం ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుక నిల్వ చేసి హైదరాబాద్‌ తరలిస్తుండగా అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి కొద్ది రోజులపాటు ఇసుక తరలింపును నిలిపి వేశారు. రెండు, మూడు రోజుల నుంచి ఇసుక సరఫరా మొదలయ్యింది. అక్రమార్కులు మేడిపల్లి, లింగాపూర్‌ సమీపంలో గల గోదావరి నది నుంచి ఇసుకను తీసుకవచ్చి ఎన్టీపీసీలో నిల్వ చేసినట్లు సమాచారం. సుల్తానాబాద్‌ మండలంలో అక్కడి పోలీసులు సైతం అక్రమ ఇసుక నిల్వ లను గుర్తించి సీజ్‌ చేసిన విషయం తెలిసిందే.

నిలిచిపోయిన స్యాండ్‌ ట్యాక్సీ

జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు 2017లో తీసుక వచ్చిన స్యాండ్‌ ట్యాక్సీ విధానానికి ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తాత్కాలి కంగా నిలిపివేశారు. ఇది అమల్లో ఉన్నప్పుడు ఇసుక రవాణా సాఫీగా జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. మానేరు, గోదావరి నదుల్లో గుర్తించిన ఇసుక క్వారీల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఇసుక కోసం బుకింగ్‌ చేసుకున్న 24 గంటల్లోపు ఇంటి వద్దకే ఇసుక సరపరా చేశారు. స్యాండ్‌ ట్యాక్సీ విధానాన్ని అమలు చేసేందుకు ప్రత్యేకించి సిబ్బందిని నియమించారు. రిజిస్ట్రేషన్‌ కోసం 25 వేల రూపాయల చొప్పున డిపాజిట్‌ చేసి ట్రాక్టర్లకు జీపీఎస్‌ పరికరాలను అమర్చిన యజమానులకు ఇసుక సరఫరా చేసే అవకాశం కల్పించారు. పర్యావరణ సమతుల్యం దెబ్బతిన కుండా నిర్ణీత లోతులోనే కూలీల ద్వారా ఇసుక తోడి లోడింగ్‌ చేయిం చారు. దీంతో స్థానికంగా ఉండే కూలీలకు నిత్యం పని దొరకడంతోపాటు, ట్రాక్టర్ల యజమానులకు గిరాకీ లభించినట్లయ్యింది. ప్రభుత్వ ఖజానాకు కూడా సుమారు 7 నుంచి 8 కోట్ల రూపాయల వరకు జమయ్యాయి. ప్రజ లకు కూడా రెవెన్యూ, పోలీస్‌ అధికారుల వేధింపులు లేకుండా పోయాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఇసుక రవాణా చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గాయి. ఈ విధానం జిల్లాలో పదేళ్లపాటు నిర్విరామంగా అమలు కాగా, స్యాండ్‌ ట్యాక్సీని స్ఫూర్తిగా తీసుకుని ఆయా జిల్లాల్లో కూడా అమలు చేశారు. పస్తుతం ఈ విఽధానం ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల వల్ల జిల్లాలో అమలు చేయడం లేదు. ఫ్రీగా ఇసుక తీసుకవెళ్లే వెసులుబాటు కల్పించారు. దీనిని ఆసరా జేసుకుని కొందరు అక్రమంగా డంపులు పోసి రాత్రి వేళల్లో హైదరాబాద్‌కు లారీల్లో తరలిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలకు కూడా ఇసుక సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికులకు తక్కువ ధరకే ఇసుక సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించిన ధరకు ఇవ్వడం లేదని ప్రజలు చెబుతున్నారు. స్థానికులకు ఉచితంగానే ఇసుక సరఫరా చేయాలని భావించిన ప్రజాప్రతినిధులు స్యాండ్‌ ట్యాక్సీ విధానానికి విరామం ఇప్పిం చినప్పటికీ, దానిని ట్రాక్టర్ల యజమానులు దుర్వినియోగం చేస్తుండడం వారికి కూడా తలనొప్పిగా మారింది.

ఇసుక ఎన్టీపీసీకా, హైదరాబాద్‌కా..

రామగుండం ఎన్టీపీసీ రెండో గేట్‌ లోపల నిల్వ చేసిన ఇసుక డంపులు ఎన్టీపీసీ అవసరాల కోసమా, హైదరాబాద్‌కు అక్రమంగా తరలించేందుకు నిల్వ చేశారా అనేది తెలియాల్సి ఉంది. ఎన్టీపీసీలో టీఎస్‌టీపీపీ రెండో దశ 800 మెగావాట్ల చొప్పున మూడు యూనిట్ల పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులకు సుమారు 30 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక అవసరం ఉంటుందని అంచనా వేశారు. దీనికి కావాల్సిన ఇసుకను గోదావరి నదిలో పెద్దంపేట్‌ వద్ద ఒక ఇసుక క్వారీని గుర్తించారు. అక్కడ 1,01,200 క్యూబిక్‌ మీటర్లు అంటే 1,51,800 మెట్రిక్‌ టన్నుల ఇసుక లభ్యత ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడి ఇసుకను స్యాండ్‌ ట్యాక్సీ ద్వారా ఎన్టీపీసీకి సరఫరా చేయాలని నిర్ణయించారని తెలిసింది. అక్కడ క్వారీ తెరిచే విధంగా సంబంధిత అధికారులపై రాజకీయ నాయకుల ద్వారా ఇసుక మాఫియా ఒత్తిళ్లు కూడా తీసుకవచ్చారని ప్రచారం. కమర్షియల్‌ అవసరాలకు టీఎస్‌ ఎండీసీ ద్వారానే ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం స్ట్రిక్ట్‌గా నిబంధన విధించింది. టీఎస్‌ఎండీసీ ద్వారా టన్నుకు 375 రూపాయలు, స్యాండ్‌ ట్యాక్సీ ద్వారా టన్నుకు 45 రూపాయల ఆదాయం మాత్రమే వస్తుంది. అయితే ప్రస్తుతం ఎన్టీపీసీ గేటు లోపల ఇసుక డంపులు గుర్తించడంతో ఆ ఇసుకను టీఎస్‌టీపీపీ పనుల కోసం అక్కడ నిల్వ చేశారా, హైదరాబాద్‌కు రాత్రి వేళల్లో తరలించేందుకు ఇసుక నిల్వ చేశారా తెలియడం లేదు. ఉచితం మాటున ఇసుకాసురులు మాత్రం అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. కమర్షియల్‌ అవసరాలకు ఇసుక విక్రయాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అధికారులు గుర్తించాలి.

Updated Date - Jan 24 , 2026 | 11:53 PM