మెరిట్ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత విద్య
ABN , Publish Date - May 29 , 2026 | 12:31 AM
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ మెరిట్ విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ విద్యా పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి అత్యధిక మార్కులు సాధించిన పేద విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యనందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కరీంనగర్ టౌన, మే 28 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ మెరిట్ విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ విద్యా పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి అత్యధిక మార్కులు సాధించిన పేద విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యనందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. పదో తరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకొని విద్యార్థులను ఎంపిక చేస్తారు. కార్పొరేట్ విద్యా పథకానికి ఎంపిక అయిన విద్యార్థుల కళాశాలల ఫీజులను ప్రభుత్వమే భరిస్తుంది. ప్రతిభ ఉన్న పేద విద్యార్థులను ఉన్నత స్థాయికి ఎదిగేలా ఈ పథకం తోడ్పడుతోందని భావిస్తున్నారు. ప్రవేశం పొందిన విద్యార్థులకు ఫీజు కోసం ఏడాదికి 35 వేల రూపాయలు, ప్యాకెట్ మనీ కింద మూడు వేల రూపాయలను ప్రభుత్వం అందిస్తుంది. హైదరాబాద్‌లోని కళాశాలల్లో కార్పొరేట్ విద్యా పథకం ద్వారా 120 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తారు. 10వ తరగతిలో 400కుపైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు. ప్రభుత్వ, జిల్లా పరిషత, ఎయిడెడ్, కస్తూర్భా, నవోదయ, గురుకులాలలు, ఆదర్శపాఠశాలల్లో చదివిన వారికి మాత్రమే ప్రవేశాలు కల్పిస్తారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారి వార్షిక ఆదాయం రెండు లక్షలకు, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు లక్ష రూపాయలకు వార్షిక ఆదాయం మించి ఉండరాదు. 4 నుంచి 10వ తరగతి వరకు విద్యార్హతల బోనఫైడ్, సామాజికవర్గం, స్థానిక ధ్రువపత్రం దరఖాస్తుతోపాటు జత చేయాల్సి ఉంటుంది. దివ్యాంగుల, వైకల్యానికి సంబంధించిన ధ్రువపత్రం, ఆధారుకార్డు, పదోతరగతి మార్కుల జాబితా (మెమో), బ్యాంకు పాస్‌బుక్‌ను జత చేయాలి.
దరఖాస్తు విధానం :
కార్పొరేట్ విద్యా పథకానికి అర్హత ఉన్న విద్యార్థులు మీసేవా కేంద్రాల ద్వారా టీఎస్ ఈపాస్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారుల వివరాలు, ధ్రువ పత్రాలు, ఫోన నంబరు, ఈ-మెయిల్ ఐడీ, పాసుపోర్టు సైజు ఫొటోను స్కాన చేసి జత చేయాలి. జూన 5 వరకు దరఖాస్తు చేసుకునే గడువు ఉంది. ఎంపికైన వారికి కళాశాలల వివరాలను అధికారులు పంపిస్తారు. వారు అన్ని ధ్రువీకరణ పత్రాలను ఆయా కళాశాలల్లో సమర్పించి చేరాల్సి ఉంటుంది.