పట్టాల కోసం ఎదురుచూపులు
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:00 AM
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సింగరేణి స్థలాల్లో నివాసాల క్రమబద్ధీకరణ కోసం ఆరేళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు 2019 జూలైలో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి స్థలాల్లోని భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి జీవో నెం.76 జారీ చేసింది.
కోల్‌సిటీ, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సింగరేణి స్థలాల్లో నివాసాల క్రమబద్ధీకరణ కోసం ఆరేళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు 2019 జూలైలో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి స్థలాల్లోని భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి జీవో నెం.76 జారీ చేసింది. ఇందులో రామగుండం రీజియన్‌లో జనగామ, మల్కాపూర్, అల్లూరు శివారుల్లోని కేకేనగర్, ఇందిరానగర్, లక్ష్మీనగర్, హనుమాన్‌గర్, సంతోష్‌నగర్ ప్రాంతాల్లో భూములను క్రమబద్ధీకరించేందుకు వెసలు బాటు కల్పించారు. జనగామ శివారులో 29.17 ఎకరాలు, మల్కాపూర్ శివారులో 11.35ఎకరాలు 40.42 ఎకరాల భూమిని రెవెన్యూకు సింగరేణి అప్పగించింది. వాస్తవానికి ఈ కాలనీల్లో క్రమబద్దీకరణ పట్టాలు ఇచ్చేందుకు 200ఎకరాల భూములను అప్పగించాల్సి ఉంది. 50ఏళ్లుగా ఉన్న కాలనీల భూములను పెండింగ్‌లో పెట్టి నామామాత్రంగా భూములను అప్పగించింది. సర్వే నెం.723లో రెండు ఎకరాలకుపైగా భూముల్లో కాలనీలు ఉండగా ఒక ఎకరం ఏడు గుంటలు మాత్రమే అప్పగించడంతో 58 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సర్వే నం.724లో ఎకరం 14గుంటలు, సర్వే నెం. 482లో 200నివాసాలు ఉంటే ఐదు గుంటల భూమి అప్పగించారు. ఈ నెంబర్‌లో 49 దరఖాస్తులు భూమి లేక పెండింగ్‌లో ఉన్నాయి. సర్వే నెం. 614లో ఇదే పరిస్థితి నెలకొన్నది. సీతానగర్, రాంనగర్, విఠల్‌నగర్, తిలక్‌నగర్, రమేష్‌నగర్, ఎల్‌బీనగర్, గోదావరిఖని సప్తగిరికాలనీ, తదితర ప్రాంతాల్లో జీవో76 లో సర్వే నెంబర్లనే పొందుపర్చలేదు. రెండు విడుతలుగా 6645 దరఖాస్తులు వస్తే కేవలం 1298 దరఖాస్తులనే రెవెన్యూశాఖ సిఫార్సు చేసింది. మొదటి విడుతలో 3763 దరఖాస్తులను పక్కన పెట్టగా, రెండో విడుతలో 1583 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. చాలా కాలనీలకు సంబంధించి భూమి లేదనే కారణంగా తిరస్కరించడం, పెండింగ్‌లో పెట్టారు. 2023లో నామమాత్రంగా రిజిస్ర్టేషన్ చేసి చేతులు దులుపుకున్నారు. మొదటి, రెండో విడుతలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు మరికొన్ని స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వానికి రెవెన్యూశాఖ కోరినా సింగరేణి నుంచి స్పందన రాలేదు.
మొదటి విడుత 12వేల పట్టాలు...
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని జనగామ, మల్కాపురం, అల్లూరు శివారుల్లో సుమారు 800ఎకరాల్లో సింగరేణి కాలనీలు ఉన్నాయి. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకు సర్వే చేపట్టి ఆర్‌జీ-1, 2, 3 పరిధిలో 559ఎకరాల భూమిని రెవెన్యూకు అప్పగించింది. ఆర్‌జీ-1 పరిధిలో 527ఎకరాలు, ఆర్‌జీ-2 పరిధిలోని అల్లూరు శివారు 29.23 ఎకరాలు, ఆర్‌జీ-3 పరిధిలోని పన్నూరు, రత్నాపూర్ శివారుల్లో 2.32ఎకరాల భూమిని రెవెన్యూకు అప్పగించింది. కేబినెట్ ఆమోదంతో 12వేల నివాసాలకు రెవెన్యూ శాఖ క్రమబద్ధీకరణ పట్టాలు ఇచ్చింది. మరో 8 వేలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి.
ఇందిరమ్మ నివాసాలకు అడ్డంకులు
రామగుండంలో 2009లో సింగరేణి రెవెన్యూకు అప్పగించిన భూముల్లో ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. ఆ భూముల్లో సైతం ఇందిరమ్మ నివాసాలు ఏర్పాటు చేసుకుంటే యాజమాన్యం అడ్డుకుంటుంది. అలాగే అభివృద్ధి పనులకు కూడా అడ్డుపడడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది.
క్షేత్రస్థాయి సర్వేతోనే పరిష్కారం
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జీవో నెం. 76లో మరో మారు దరఖాస్తులకు అవకాశం ఇవ్వడమే కాకుండా క్షేత్రస్థాయిలో కాలనీల్లో భూమి సర్వే చేసి రెవెన్యూకు అప్పగిస్తేనే పరిష్కారం లభిస్తుంది. క్షేత్రస్థాయిలో 50ఏళ్ల క్రితం నాటి నివాసాలు ఉన్నా సింగరేణి కావాలని పెండింగ్‌లో పెడుతుంది. మొదటి విడుతలో అప్పగించిన 559ఎకరాలతోపాటు రెండో విడుతలో అప్పగించిన 40ఎకరాలతో కాలనీలు విస్తరించి ఉన్న భూములను రెవెన్యూకు అప్పగిస్తే సమస్య పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుంది.