జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Nov 22 , 2026 | 12:37 AM
జిల్లాలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలును మరింత సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వై. పవిత్ర అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, పురోగతిపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి టౌన్, నవంబరు21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలును మరింత సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వై. పవిత్ర అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, పురోగతిపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్సీడీ, క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం, జాతీయ ఆరోగ్య మిషన్, అంటువ్యాధుల పర్యవేక్షణ కార్యక్రమం, మాతా శిశు ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, టీకాల కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమానికి నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో సాధించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కార్యక్రమాల అమలులో నాణ్యతా ప్రమాణాలు పాటించడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ఎన్సీడీ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు రక్తపోటు, మధుమేహ పరీక్షలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. క్షయ వ్యాధి నిర్మూలన లక్ష్యంగా అనుమానితులకు పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ అయిన వారికి నిరంతర చికిత్స అందించాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో జిల్లాను మెరుగైన స్థాయికి తీసుకెళ్లేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీఎంహెచ్వో సూచించారు.