Share News

వేలిముద్ర పడాల్సిందే..

ABN , Publish Date - Jul 26 , 2026 | 12:42 AM

పేద, మధ్య తరగతి కుటుంబాలకు అందిస్తున్న రేషన్‌ సరుకులు నిజమైన లబ్ధిదారులకు అందే విధంగా మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియ మొదలుపెట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2024 సంవత్సరంలో మొదలైన ఈ-కేవైసీ మొదట్లో వేగంగానే నిర్వహించినా ఆ తర్వాత లబ్ధిదారుల్లో నిర్లక్ష్యం, అధికారులు దృష్టి సారించకపోవడం, డీలర్లు పట్టించుకోకపోవడంతో ఈ-కేవైసీ ప్రక్రియ మందగించింది.

వేలిముద్ర పడాల్సిందే..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పేద, మధ్య తరగతి కుటుంబాలకు అందిస్తున్న రేషన్‌ సరుకులు నిజమైన లబ్ధిదారులకు అందే విధంగా మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియ మొదలుపెట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2024 సంవత్సరంలో మొదలైన ఈ-కేవైసీ మొదట్లో వేగంగానే నిర్వహించినా ఆ తర్వాత లబ్ధిదారుల్లో నిర్లక్ష్యం, అధికారులు దృష్టి సారించకపోవడం, డీలర్లు పట్టించుకోకపోవడంతో ఈ-కేవైసీ ప్రక్రియ మందగించింది. జిల్లాలో ఇప్పటివరకు 81.76శాతం మాత్రమే పూర్తిచేశారు. ఈసారి పౌరసరఫరాల శాఖ ఈ-కేవైసీ పూర్తి చేయడానికి గడువు విధించడంతో రేషన్‌ లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. ఈనెల 31 వరకు రేషన్‌ కార్డులో ఉన్న ప్రతి లబ్ధిదారుడు ఈ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని లేనిపక్షంలో రేషన్‌ నిలిచిపోతుందని అధికారులు చెబుతున్నారు. మరో ఐదు రోజుల గడువు మిగిలి ఉండడంతో ఈ-కేవైసీ కానివారి జాబితాలు రేషన్‌ డీలర్లకు పంపించారు. లబ్ధిదారులకు డీలర్లు సమాచారం అందిస్తూ ఈ-కేవైసీ చేస్తున్నారు. రేషన్‌ కార్డుల్లో లబ్ధిదారులకు అన్నపూర్ణ కార్డుదారులకు ఒక్క యూనిట్‌కు 10కిలోలు, అంత్యోదయ కార్డుదారులకు 35కిలోల చొప్పున, ఆహార భద్రతా కార్డులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా రేషన్‌ బియ్యం ప్రభుత్వం అందజేస్తుంది. కార్డులో సభ్యులుగా ఇతర దేశాల్లో ఉన్నవారు, అలాగే చనిపోయిన వారి పేర్లు కూడా కొనసాగుతున్నాయి. వారి పేరుతో కుటుంబ సభ్యులు రేషన్‌ కోటా తీసుకుంటున్న క్రమంలో ఇలాంటి వారిని గుర్తించడానికి ఈ-కేవైసీ తప్పనిసరిగా మారింది. లబ్ధిదారులు రేషన్‌ దుకాణానికి వెళ్లి ఈ-పాస్‌ మిషన్‌లో వేలిముద్ర వేయడం ద్వారా కేవైసీ నమోదు చేయాల్సి ఉంటుంది. ఈసారి మాత్రం ఈనెల 31 తర్వాత ఈ కేవైసీ కాని లబ్ధిదారులకు రేషన్‌ నిలిచిపోయే ప్రక్రియను తప్పనిసరి చేయనున్నారు.

జిల్లాలో 4,71,312 లబ్ధిదారుల ఈ-కేవైసీ పూర్తి

రేషన్‌ బియ్యం భారీగా పక్కదారి పడుతున్న నేపథ్యంలో పారదర్శకత పెంపొందించే దిశగా రేషన్‌ షాపుల్లో ఎలక్ర్టానిక్‌ నో యువర్‌ కస్టమర్‌(ఈ-కేవైసీ) ప్రక్రియను తీసుకవచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ-కేవైసీ ప్రక్రియ నత్తనడకగానే సాగుతోంది. జాతీయ ఆహారభద్రత కార్డులు, రాష్ట్ర ఆహార భద్రత కార్డుల్లోని కుటుంబసభ్యుల వివరాలను ఈ-కేవైసీ ద్వారా అనుసంధానం చేస్తున్నారు. ఇప్పటికే రేషన్‌ కార్డుల్లో పేర్లు ఉన్నా కుటుంబసభ్యులకు రేషన్‌ షాపుల్లో బయోమెట్రిక్‌ ద్వారా ఈ-కేవైసీ చేస్తున్నారు. దీంతో విదేశాల్లో ఉన్నవారితో పాటు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన వారి వివరాలు వెల్లడికానున్నాయి. వారిని అనర్హులుగా గుర్తించి రేషన్‌ బియ్యం నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ-కేవైసీకి ఈనెల 31వరకే ఈ కేవైసీ గడువు ఉండడంతో రేషన్‌ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 మండలాల్లో ఇప్పటివరకు 81.76 శాతం మాత్రమే రేషన్‌ లబ్ధిదారులు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తిచేసుకున్నారు. 345 రేషన్‌ దుకాణాల ఉండగా, 1,96,092కార్డులు ఉండగా, 5,76475 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో 13,830 అంత్యోదయ కార్డుల్లో 35,466 మంది లబ్ధిదారులు, 1,82,063 ఆహార భద్రత కార్డుల్లో 5,40,804 మంది లబ్ధిదారులు ఉండగా 199 అన్నపూర్ణ కార్డులు ఉండగా, 205 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 1.96 లక్షల కార్డుల్లోని లబ్ధిదారుల్లో 4,71,312 మంది లబ్ధిదారులు కేవైసీ చేయించుకున్నారు. మొత్తంగా 81.76 శాతం ఉంది. ఇందులో నేషనల్‌ ఆహారభద్రత కార్డులు 1,02,688 ఉండగా, 3,19,734 మంది లబ్ధిదారుల్లో 2,89,340 మంది లబ్ధిదారులు ఈ-కేవైసీ చేసుకోగా 90.49 శాతంగా ఉంది. రాష్ట్ర ఆహార భద్రత కార్డులు 93,404 ఉండగా లబ్ధిదారులు 2,65,741 మంది ఉన్నారు. ఇందులో 1,81,972 మంది ఈ-కేవైసీ చేయించుకున్నారు. 70.88 శాతంగా ఉంది. జిల్లాలోని రేషన్‌ దుకాణాల్లో బియ్యం కోసం వెళ్లే లబ్ధిదారులు కేవైసీ ప్రక్రియను చేయించుకొని బియ్యాన్ని పొందుతున్నారు. లబ్ధిదారులు కేవైసీ పునరుద్ధరణ చేయించుకోవడానికి ఈ-పాస్‌ యంత్రం ద్వారానే చర్యలు చేపట్టినా ప్రహసనంగానే ఈ-కేవైసీ కొనసాగుతోంది.

ఈ-కేవైసీ నమోదు ఇలా...

జిల్లాలో రేషన్‌ కార్డు కలిగిన కుటుంబ యజమానితో పాటు కార్డులో ఉన్నా సభ్యులందరూ తమకు సమీపంలో ఉన్న రేషన్‌ డీలర్‌ వద్దకు వెళ్లి ఈ-పాస్‌ యంత్రం ద్వారా వేలిముద్రలు వేయాలి. వేలిముద్ర వేయడంతోనే రేషన్‌ కార్డు నంబరుతో పాటు సభ్యుల ఆధార్‌ నంబర్‌ చూపిస్తుంది. వీటిని సరిచూసిన తరువాత ఆకుపచ్చ రంగు వెలిగి సభ్యుల కేవైసీ పునరుద్ధరణ జరుగుతుంది. ఈ-పాస్‌ యంత్రంలో ఎరుపు రంగు వెలిగితే రేషన్‌ కార్డు, ఆధార్‌, సరిగా పోల్చుకోలేకపోవడంతో రిజెక్ట్‌ చూపిస్తుంది. దీంతో ఒక యూనిట్‌ రేషన్‌ కార్డు నుంచి తొలగింపు జరుగుతుంది. అందుబాటులో ఉన్న వ్యక్తులు వేలిముద్రలు వేయడం ద్వారా వేలిముద్రలు వేయని వారి యూనిట్లు తొలగిపోతాయి. దీని ద్వారా అసలైన లబ్ధిదారులు మిగిలిపోతారు.

జిల్లాలో మండలాల వారీగా ఈ కేవైసీ వివరాలు...

మండలం రేషన్‌కార్డులు లబ్ధిదారులు ఈకేవైసీ లబ్ధిదారులు శాతం

బోయినపల్లి 13300 37620 31061 82.57

చందుర్తి 12223 35276 28585 81.02

ఇల్లంతకుంట 17359 49336 40856 82.81

గంభీరావుపేట 15894 46491 38827 83.52

కోనరావుపేట 15692 46177 36822 79.74

ముస్తాబాద్‌ 16627 49180 39530 80.38

రుద్రంగి 5520 1789 13389 76.24

సిరిసిల్ల 30453 91549 75430 82.39

తంగళ్లపల్లి 16092 46366 38285 79.91

వీర్నపల్లి 4805 15106 12071 82.57

వేములవాడ 19568 22141 19921 79.91

వేములవాడరూరల్‌ 8464 24268 55085 82.09

ఎల్లారెడ్డిపేట 17522 51127 41450 81.07

---------------------------------------------------------------------

మొత్తం 196092 576475 471312 81.76

---------------------------------------------------------------------

Updated Date - Jul 26 , 2026 | 12:42 AM