రామగుండంలో చెత్త బయట పడవేస్తే జరిమానా
ABN , Publish Date - Mar 08 , 2026 | 12:06 AM
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఇక నుంచి చెత్త బయట పడవేసినా, నాలాల్లో పడవేసినా రూ.500 జరిమానా విధించనున్నట్టు మేయర్ మహంకాళి స్వామి పేర్కొన్నారు. శనివారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా స్థానిక 49వ డివిజన్ మార్కండేయకాలనీలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ సంతోష్‌రావుతో కలిసి ప్రధాన నాలా పూడిక తీత పనులను పరిశీలించారు.
కోల్‌సిటీ, మార్చి 7(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఇక నుంచి చెత్త బయట పడవేసినా, నాలాల్లో పడవేసినా రూ.500 జరిమానా విధించనున్నట్టు మేయర్ మహంకాళి స్వామి పేర్కొన్నారు. శనివారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా స్థానిక 49వ డివిజన్ మార్కండేయకాలనీలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ సంతోష్‌రావుతో కలిసి ప్రధాన నాలా పూడిక తీత పనులను పరిశీలించారు. ఇంటింటా చెత్త సేకరణకు కోట్ల రూపాయలు వెచ్చించి వాహనాలను కొనుగోలు చేసి, పారిశుధ్య సిబ్బందిని నియమిస్తే ఇంటికి వచ్చే సిబ్బందికి చెత్త ఇవ్వకుండా రోడ్లు, కాలువలు, ఖాళీ స్థలాల్లో పడవేయడం విచారకరమన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష కాలువల్లో పూడిక తీత పనులను పరిశీలించారు. భారీగా పూడిక పేరుకుపోయిందని, అదనపు సిబ్బంది, అద్దె వాహనాలను ఉపయోగించి పూడిక తొలగించాలని ఆదేశించారు. అనంతరం 47వ డివిజన్ కార్పొరేటర్ సాంబమూర్తితో కలిసి శానిటేషన్ పనులను పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో చెత్త వేసేవారికి నోటీసులు జారీ చేయాలని సూచించారు. వీధి దీపాల మరమ్మతు పనులను పరిశీలించారు. మున్సిపల్ సేవల గురించి కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. 58వ డివిజన్ అడ్డగుంటపల్లిలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజలు పట్టణ ఆరోగ్య కేంద్ర సేవలను వినియోగించుకోవాలన్నారు. కార్పొరేటర్లు మేకల సమ్మయ్య, మేకల శారద, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రాజమౌళి, వైద్యాధికారి స్నేహలత, సీఓ అనిత పాల్గొన్నారు.