Share News

పల్లెలకు ఆర్థిక భరోసా

ABN , Publish Date - May 29 , 2026 | 12:02 AM

దేశ అభివృద్ధిలో పల్లెలే కీలకపాత్ర పోషిస్తాయి. అనేక గ్రామాలు అభివృద్ధికి నోచుకోక వెక్కిరిస్తున్నాయి. కనీస అవసరాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైపు నిధుల కోసం ఎదురు చూస్తుంటారు. గ్రామాలకు ప్రధాన వనరుగా ఆర్థిక సంఘం నిధులే ఊరట కలిగిస్తాయి. ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో పల్లెలకు ఆర్థిక భరోసా కలుగుతుందని భావిస్తున్నారు.

పల్లెలకు ఆర్థిక భరోసా

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

దేశ అభివృద్ధిలో పల్లెలే కీలకపాత్ర పోషిస్తాయి. అనేక గ్రామాలు అభివృద్ధికి నోచుకోక వెక్కిరిస్తున్నాయి. కనీస అవసరాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైపు నిధుల కోసం ఎదురు చూస్తుంటారు. గ్రామాలకు ప్రధాన వనరుగా ఆర్థిక సంఘం నిధులే ఊరట కలిగిస్తాయి. ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో పల్లెలకు ఆర్థిక భరోసా కలుగుతుందని భావిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామపంచాయతీలు ఉండగా, గత సంవత్సరం డిసెంబర్‌లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. కొలువుదీరిన మూడు నెలలకు 15వ ఆర్థిక సంఘం నిధులు మొదటి, రెండు విడతల్లో కలిపి రూ.19.83కోట్లు విడుదలయ్యాయి. కొత్త పాలకవర్గాలు అభివృద్ధి పనుల వైపు దృష్టి పెట్టే క్రమంలో పాత పనులకు సంబంధించి బిల్లులు చెల్లించాలంటూ మాజీ సర్పంచులు, కాంట్రాక్టర్లు ముందుకు రావడంతో గందరగోళం ఏర్పడింది. కొత్త, పాత సర్పంచుల మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి. కొన్ని గ్రామపంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధుల్లో కొన్ని పాత బకాయిలు చెల్లించడం మరికొన్ని నిధులతో అభివృద్ధి పనులు చేపట్టే విధంగా ఒప్పందాలు చేసుకున్నారు. కొన్ని గ్రామాల్లో ఇంకా బిల్లుల సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసి గ్రామాల జనాభా, ఇతర సామాజిక, ఆర్థిక ప్రమాణాల ఆధారంగా నిధులు కేటాయిస్తుంది. ప్రతి ఐదేళ్ల్లకు ఒకసారి రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఏర్పడే 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి మార్చి 31తో ముగిసిపోయింది. 2026 ఏప్రిల్‌ 1 నుంచి 16వ ఆర్థిక సంఘం ప్రారంభమైంది. 2031 మార్చి ఒకటి వరకు ఐదేళ్లపాటు ఆర్థిక సంఘం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఐదేళ్లకు సంబంధించి కేంద్రం రూ.4,35,236 కోట్లు కేటాయించగా, తెలంగాణకు రూ.9,968 కేటాయించారు. ఇందుకు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఆర్థిక భరోసా ఎంత కలుగుతుందనే దానిపై లెక్కలు వేస్తున్నారు.

ఐదేళ్లలో జిల్లాకు రూ 160 కోట్ల వరకు నిధులు

పల్లెల అభివృద్ధికి ప్రధానంగా ఉపయోగించే నిబంధనలతో కేటాయించే ఆర్థిక సంఘం నిధులు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 5.52 లక్షల వరకు ఉన్నారు. గడిచిన ఆర్థిక సంఘంలో జిల్లాకు రూ.100 కోట్ల వరకు నిధులు వచ్చాయి. ప్రస్తుతం జనగణనలో జిల్లాలో మరో లక్ష వరకు జనాభా పెరుగుతుందని అంచనా వహిస్తున్నారు. దీని ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు 2026-2031 వరకు రూ.160 కోట్ల వరకు నిధులు సమకూరుతాయని అంచనా వేస్తున్నారు.

80 శాతం గ్రామపంచాయతీలకే నిధులు

కేంద్ర ప్రభుత్వం కేటాయించే ఆర్థిక సంఘం నిధుల్లో 80శాతం నిధులు గ్రామపంచాయతీలకే కేటాయిస్తారు. మిగతా 20 శాతంలో 10 శాతం జిల్లా పరిషత్‌, మరో 10 శాతం మండల పరిషత్‌కు కేటాయిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామపంచాయతీలు ఉండగా, బోయిన్‌పల్లిలో 23 పంచాయతీలు. చందుర్తిలో 19 పంచాయతీలు, ఇల్లంతకుంటలో 35 పంచాయతీలు, గంభీరావుపేటలో 22 పంచాయతీలు, కోనరావుపేటలో28 పంచాయతీలు, ముస్తాబాద్‌లో 22 పంచాయతీలు, రుద్రంగిలో 10పంచాయతీలు, తంగళ్ళపల్లిలో 30 పంచాయతీలు, వీర్నపల్లిలో17 పంచాయతీలు, వేములవాడలో 11 పంచాయతీలు, వేములవాడ రూరల్‌లో 17 పంచాయతీలు, ఎల్లారెడ్డిపేటలో 26 పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామాలకు అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం రెండు విడతలుగా నిధులు విడుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుధ్య, వ్యర్ధాల నిర్వహణ, గ్రామీణ రహదారుల నిర్మాణం, వీధి దీపాలు, మంచినీటి సౌకర్యం ఇతర ప్రజా అవసరాలకు సంబంధించిన వాటికి వినియోగించే విధంగా మార్గదర్శకాలు ఉన్నాయి. గతంలో ఆర్థిక సంఘం నిధులు ఇతర అవసరాలకు వినియోగించినసందర్భాలు ఉన్నాయి. ఉద్యోగుల వేతనాలు, ఇతర రాష్ట్ర ప్రభుత్వం సూచించిన వాటికి ఖర్చు చేసేవారు. ఈసారి నిబంధనలను కఠినతరం చేసింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 16 ఆర్థిక సంఘం నిధుల ఖర్చు వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. త్రైమాసిక, వార్షిక పురోగతి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తే వాటి ఆధారంగా సమగ్ర నివేదిక కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తోంది. దాని ప్రకారమే నిధుల కేటాయింపు జరుగుతుంది.

Updated Date - May 29 , 2026 | 12:02 AM