పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ..
ABN , Publish Date - Nov 27 , 2026 | 11:38 PM
గ్రామ పంచాయతీల అభివృద్ధి నిధుల వినియోగంలో ఎదురవుతున్న సాంకేతిక, ట్రెజరీ ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. పంచాయతీల్లో వసూలయ్యే ఆదాయాన్ని ట్రెజరీలో కాకుండా ప్రత్యేకంగా బ్యాంకుల్లో సొంత (ఓఎస్‌ఆర్-ఓన్ సోర్స్ రిజర్వ్) ఖాతాలు తెరిచి జమ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
ముత్తారం, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల అభివృద్ధి నిధుల వినియోగంలో ఎదురవుతున్న సాంకేతిక, ట్రెజరీ ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. పంచాయతీల్లో వసూలయ్యే ఆదాయాన్ని ట్రెజరీలో కాకుండా ప్రత్యేకంగా బ్యాంకుల్లో సొంత (ఓఎస్‌ఆర్-ఓన్ సోర్స్ రిజర్వ్) ఖాతాలు తెరిచి జమ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. 2026 ఆగస్టు 27న పంచాయతీరాజ్ చట్టం 2018కు నాలుగో సవరణను ఆమోదించిన ప్రభుత్వం, ఇందులో భాగంగా ఇటీవల జీవో నెంబర్ 43ను విడుదల చేసింది. ఆయా గ్రామ పంచాయతీల్లో వసూలయ్యే జనరల్ ఫండ్ నిధులను స్థానిక అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునే బాధ్యతను పాలకవర్గాలకే అప్పగించింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ లభించినట్లయింది. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు స్థానిక పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు దృష్టి సారించారు.
ఫ్రీజింగ్ సమస్యలకు తెర..
గ్రామ పంచాయతీల్లో ఆస్తిపన్ను, తైబజార్, వారంతపు సంతలు, లేఅవుట్లు, మ్యుటేషన్లు, భవన నిర్మాణ అనుమతులు, ట్రేడ్ లైసెన్సులు తదితర సేవల ద్వారా వచ్చే ఆదాయాన్ని జనరల్ ఫండ్ కింద జమ చేస్తారు. ఇప్పటి వరకు ఈ నిధులు ట్రెజరీ ఖాతాల్లో జమ అయ్యేవి. వాటిని డ్రా చేసుకునేందుకు కార్యదర్శులు చెక్కులు రాసి ట్రెజరీకి పంపాల్సి ఉండేది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఖాతాలను ఫ్రీజింగ్‌లో పెట్టడం వల్ల నిధులు మంజూరు కావడంలో ాప్యం జరిగేది. ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో కాలపరిమితి దాటితే చెక్కులు చెల్లుబాటు కాని పరిస్థితులు కూడా ఎదురయ్యేవి.
అభివృద్ధి పనుల్లో పెరగనున్న వేగం..
నిధులు ఉన్నా సకాలంలో ఖర్చు చేయలేక గ్రామాల్లో చేపట్టిన పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా, వీధిలైట్ల నిర్వహణ, డ్రైనేజీల ఏర్పాటు వంటి వసతుల కల్పన పనులు మందగించేవి. తాజాగా ప్రభుత్వం జనరల్ ఫండ్ వినియోగ బాధ్యతను పాలకవర్గాలకే అప్పగించడంతో ట్రెజరీ ఫ్రీజింగ్ సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఇకపై గ్రామ సభలో తీర్మానం చేసుకుని సొంత ఖాతాల ద్వారా నేరుగా నిధులు డ్రా చేసి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు మార్గం సుగమమైంది.