సమస్యలపై పోరుబాట..
ABN , Publish Date - Aug 02 , 2026 | 12:22 AM
గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక వలస వెళ్తున్న కూలీలకు స్థానికంగా ఉపాధిని కల్పించే లక్ష్యంగా ఏర్పడ్డ మహాత్మా గాంధీ ఉపాధిహామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తెచ్చింది. ఎస్‌ఆర్‌ఈజీఎస్ స్థానంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అజీవిక మిషన్ - గ్రామీణ(వీబీ జీరామ్‌జీ)గా మార్చింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక వలస వెళ్తున్న కూలీలకు స్థానికంగా ఉపాధిని కల్పించే లక్ష్యంగా ఏర్పడ్డ మహాత్మా గాంధీ ఉపాధిహామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తెచ్చింది. ఎస్‌ఆర్‌ఈజీఎస్ స్థానంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అజీవిక మిషన్ - గ్రామీణ(వీబీ జీరామ్‌జీ)గా మార్చింది. కేంద్ర ప్రభుత్వం 2025లో వీబీ జీరామ్‌జీ చట్టం రూపొందించి చట్ట సభల్లో ఆమోదించి జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చిన వీబీ జీరామ్‌జీని ముందుకు నడిపిస్తున్న ఉద్యోగుల్లో మాత్రం నిరాశ మిగిల్చింది. గతంలో కూలీలకు వంద రోజుల పని దినాలను కల్పిస్తే వీబీ జీ రామ్‌జీ 125 రోజులకు పెంచారు. అంతేకాకుండా కూలీలకు సమయానికి వేతనాల చెల్లింపు, ఒకవేళ ఆలస్యం అయితే వేతనంతో పాటు పరిహారం చెల్లించే విధంగా చట్టంలో విధానాలు పొందుపరిచారు. కూలీలకు 15 రోజుల్లో పనులు చూపకపోయినా నిరుద్యోగ భృతి కూలీల ఖాతాల్లో జమ అవుతుంది. దీన్నిబట్టి చూస్తే ఉపాధిహామీ పథకం కంటే మెరుగ్గా కనిపిస్తున్నా రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం ఆందోళన, ఆవేదన మిగిలించింది. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ప్రారంభమైన నాటి నుంచి పే స్కేల్ లేకుండా పనిచేస్తున్నారు. మరోవైపు వేతనాలు కూడా సక్రమంగా అందడం లేదు. దీంతో వీబీ జీ రామ్‌జీ ఉద్యోగులు పోరుబాట పట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏపీవోలు, ఇంజనీరింగ్ కన్సల్టెన్సీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పేస్కేల్‌తో పాటు ఇతర డిమాండ్లతో ఆందోళన బాట పట్టారు. గ్రామీణ అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న వివిధ విభాగాల ఉద్యోగులు జేఏసీగా ఏర్పడి గత నెల 27 నుంచి వివిధ రూపాల్లో నిరసనలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15లోగా ఉత్తమ డిమాండ్లు పరిష్కరించే పక్షంలో 16నుంచి నిరసనలు అవసరమైతే నిరవధిక సమ్మెలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. గత నెలలు తమ డిమాండ్లతో కలెక్టర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి వినతి పత్రాలు అందించారు. మండల కేంద్రాల్లో నిరసనలు తెలిపారు, నల్ల బ్యాడ్జీలతో శాంతియుత నిరసనలు తెలిపిన ఉద్యోగులు శుక్రవారం, శనివారం జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో వీబీజీరామ్‌జీ ఉద్యోగులు పెన్‌డౌన్, సహాయ నిరాకరణ కార్యక్రమాలు చేపట్టారు. శనివారం అన్ని మండల పరిషత్ కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు. ఈనెల 3న హైదరాబాద్‌లో శాంతియుత నిరసన, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించడం. 4న ప్రజాభవన్‌లో మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించని పక్షంలో ఆగస్టు 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు దశలవారీ ఆందోళనలు నిర్వహించి అవసరమైతే సమ్మెలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.
మూడు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామీణ అభివృద్ధి శాఖలో రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఉద్యోగులు సకాలంలో వేతనాలు అందుకోలేకపోతున్నారు. మూడు నెలలుగా వేతనాలు అందని సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టరేట్‌లోని గ్రామీణ అభివృద్ధి శాఖ జిల్లా కార్యాలయంలో 10 మంది, ఏపీవోలు 8 మంది, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ 5 మంది, 33 మంది టెక్నికల్ అసిస్టెంట్, 19మంది కంప్యూటర్ ఆపరేటర్లు వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నారు వేతనాలు రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు. స్కూల్, కళాశాల ఫీజులు, ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లులు నిత్యవసర వస్తువులు చివరకు పాల బిల్లులు కూడా చెల్లించలేక అప్పులు చేసే పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు బ్యాంకులో రుణాల ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న తీరు ఆవేదన కలిగిస్తోంది. చివరకు ఆఫీస్‌కు రావడానికి వాహనాల్లో ఇంధనం కోసం కూడా అప్పు చేసే పరిస్థితులు ఉండడంతోనే ఆందోళన బాట పట్టారు.
జిల్లాలో వీబీజీరామ్‌జీ పనులపై ప్రభావం..
జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న వీబీ జీ రామ్‌జీ ఉద్యోగులు పేస్కేల్ అమలు, పెండింగ్ వేతనాల తక్షణ చెల్లింపు, ఉద్యోగుల పెంపు, పదోన్నతులు, బదిలీలు, కెరీర్ అడ్వాన్స్‌మెంట్ పాలసీ వంటి డిమాండ్లతో ఆందోళన నిర్వహిస్తున్న క్రమంలో కూలీలకు కల్పిస్తున్న పనులపై ప్రభావం పడే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఆగస్టు 15లోగా తమ డిమాండ్లను పరిష్కరించిన పక్షంలో ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు కూడా సిద్ధం కావడంతో ఎల్‌నినో ఎఫెక్ట్‌ను ఎదుర్కొనే దిశగా ప్రభుత్వం చేపట్టిన జలసిరి వంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడంపై ప్రభావం పడే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొనడంతో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్-గ్రామీణ(వీబీ-జీరామ్‌జీ) ద్వారా నీటి సంరక్షణ పనులు చేపట్టే విధంగా చర్యలు మొదలయ్యాయి. జిల్లాలో 260 గ్రామపంచాయతీ పరిధిలో 1056 ఫారంపాండ్స్(ఊట కుంటలు), 48వేల వ్యక్తిగత ఇంకుడు గుంతలు, 240 సామూహిక ఇంకుడు గుంతలు, 33,406 బోర్‌వెల్ రీఛార్జీ నిర్మాణాలు, 12 ఓపెన్‌వెల్స్, 240పెర్కోలేషన్ ట్యాంకులు ఏర్పాటు చేసే విధంగా లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో 477994మంది జనాభా ఉండగా, 129080 మంది రైతులు ఉన్నారు. దీనికి సంబంధించిన పొలాల్లో 1056 ఫారంపాండ్స్ నిర్మించడం ద్వారా వర్షపు నీటిని నిల్వచేసి వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవడం ద్వారా ఎల్‌నినో వంటి వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు నీటి కొరత తీరే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. గ్రామాల్లో నిర్మించే పెర్కోలేషన్ ట్యాంకుల ద్వారా భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయి. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వర్షపు నీరు భూమిలో ఇంకి భూగర్భ జలాలు పెంపొందించేందుకు దోహదపడుతుంది. బోర్‌వెల్ చుట్టూ గుంతల నిర్మాణంతో వర్షపు నీరు బోర్‌వెల్ లోపలికి వెళ్లి రిచార్జి చేస్తుంది. ఓపెన్ వేల్ చుట్టూ కూడా ఏర్పాటు చేసే నిర్మాణాల వల్ల భూగర్భ జలాల అభివృద్ధి పెరిగి భవిష్యత్తులో సాగు, తాగునీటి ఇబ్బందులు కలగకుండా ఉండడమే కాకుండా జీరామ్‌జీ పథకంలో కూలీలకు పనులు కూడా లభిస్తాయి. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇస్తూ వేగంగా పనులు పూర్తి చేసే దిశగా లక్ష్యాన్ని పెట్టుకున్నారు. జిల్లాలో 98232 జాబ్ కార్డులు ఉండగా, 199715 మంది కూలీలు ఉన్నారు. ఇందులో 102151 మంది మహిళలు ఉన్నారు. యాక్టివ్ కూలీల 57253 జాబ్ కార్డులో 86236 మంది పనిచేస్తున్నారు. మహిళలు 53410 మంది ఉన్నారు. కూలీలల్లో ఎస్సీలు 52540మంది, ఎస్టీలు 15317 మంది, ఇతరులు 131858 మంది ఉన్నారు. వీబీజీరామ్‌జీ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లితే గ్రామీణ ప్రాంతాల్లో వివిధ పనులపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.
ఉద్యోగుల డిమాండ్లు ఇవీ
- ఎస్‌ఆర్‌డీఎస్(వీబీ జీ రామ్‌జీ), ఎఫ్‌టీఎఫ్ ఉద్యోగులకు 2026 ఆగస్టు 15వ తేదీలోపు పేస్కేల్‌ను అమలు చేసి సంబంధిత ఉత్తర్వులు జారీ చేయాలి.
- రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రతినెల 1వ తేదీన వేతనాలు చెల్లించే విధానాన్ని అమలు చేయాలి.
- పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలి.
- ఎస్‌ఆర్‌డీఎస్ బోర్డు సమావేశంలో ఆమోదించిన అన్ని నిర్ణయాలను తక్షణమే అమలు చేయాలి.
- సెలవు దినాలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు, రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే నిబంధనల ప్రకారం తగిన ప్రయోజనాలు కల్పించాలి.
- సీఆర్‌డీ కార్యాలయంలోని ఫైనాన్స్ విభాగం మరియు హెచ్‌ఆర్ విభాగం మధ్య సమన్వయ లోపాలను నివారించి వేతనాల విడుదలలో ఏర్పడుతున్న జాప్యాన్ని శాశ్వతంగా పరిష్కరించాలి.
- క్యాడర్ స్ట్రెంత్ ఖరారు, పదోన్నతులు, బదిలీలు, కెరీర్ అడ్వాన్స్‌మెంట్ పాలసీ అమలు చేయాలి
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
- జి రమేష్, జేఏసీ చైర్మన్, రాజన్న సిరిసిల్ల
జిల్లా వీబీ జీరామ్‌జీ సిబ్బంది, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలి. సేవా నిబంధనలు, వేతనాలు, పదోన్నతులు, ఇతర ఉద్యోగ సంబంధిత హక్కులను కల్పించాలి. ఆగస్టు 15లోగా సమస్యలు పరిష్కరించని పక్షంలో 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఆందోళనలు, అవసరమైతే సమ్మె లోకి వెళ్తాం.
రెండు దశాబ్దాలుగా నిరంతరంగా సేవలు
- ఎంఏ జమీల్, జేఏసీ ప్రధాన కార్యదర్శి
రెండు దశాబ్దాలుగా నిరంతరంగా గ్రామీణ అభివృద్ధి శాఖలో సేవలందిస్తున్నాం. వీబీ జీ రామ్‌జీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ తక్షణమే పేస్కేల్ అమలుచేయాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పెన్‌డౌన్, షట్‌డౌన్ కార్యక్రమాలు, నిరసనలు కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి.