లేబర్ కోడ్‌లు రద్దు చేసే వరకు పోరాటం
ABN , Publish Date - Apr 30 , 2026 | 11:43 PM
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు మేలు చేసి, కార్మికులకు నష్టం కల్గించే విధంగా ఏప్రిల్‌లో అమలులోకి తీసుకువస్తున్న నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు కోసం మేడే స్ఫూర్తితో ఉద్యమాలను నిర్వహిస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యూసూఫ్ అన్నారు.
గోదావరిఖని, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు మేలు చేసి, కార్మికులకు నష్టం కల్గించే విధంగా ఏప్రిల్‌లో అమలులోకి తీసుకువస్తున్న నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు కోసం మేడే స్ఫూర్తితో ఉద్యమాలను నిర్వహిస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యూసూఫ్ అన్నారు. బుధవారం రాత్రి గోదావరిఖని భాస్కర్ రావుభవన్‌లో ఆర్‌జీ-1 బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను అధ్యక్షతన జరిగిన యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌లతో కలిసి ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌ల అమలు జరిగితే దాని వల్ల కలిగే కష్టనష్టాలను వివరించారు. ముఖ్యంగా పని గంటలు పెరుగుతాయని, జీతాల పెంపు యాజమాన్యం దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుందని, ఉద్యోగ భద్రత ఉండదని ఆయన అన్నారు. లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మేడే ఉత్సవాల్లో ప్రతిన బూనాలని ఆయన కార్మికులకు పిలుపు నిచ్చారు. మెడికల్ బోర్డు పునరుద్ధరణ, మారుపేర్ల అంశం కార్మికులకు ప్రమోషన్ సహా సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలను మే మొదటి వారంలోగా పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని రెండో వారంలో సమ్మెకు పిలుపునిస్తామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, కవ్వంపల్లి స్వామి, గౌతం గోవర్ధన్, గోసిక మోహన్, కే కనకరాజ్, మాదన మహేష్, సంకె అశోక్, బోగ సతీష్ బాబు, పీ విజయ లక్ష్మి, ఎంఏ గౌస్ పాల్గొన్నారు.