కార్మికుల కోసం కొట్లాడుతా...
ABN , Publish Date - Jun 17 , 2026 | 11:52 PM
నేను ఎప్పటికీ సింగరేణి బిడ్డనే... ఎక్కడున్నా కార్మికుల కోసమే కొట్లాడుతా... 20ఏళ్లుగా సింగరేణి కార్మికులతో కలిసి పని చేస్తున్నాం... తెలంగాణ ఉద్యమంలో అగ్గి రాజేసి రాష్ట్రం సాధించుకున్నాం... కేసీఆర్‌తో మాట్లాడి మీ కోసం పని చేశా... నేను చేసిన పోరాటాలతోనే 19వేల డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చాయి... మహిళలకు సింగరేణిలో ఉద్యోగాలు వచ్చేలా చేశా... అంటూ టీఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
గోదావరిఖని, జూన్ 17(ఆంధ్రజ్యోతి): నేను ఎప్పటికీ సింగరేణి బిడ్డనే... ఎక్కడున్నా కార్మికుల కోసమే కొట్లాడుతా... 20ఏళ్లుగా సింగరేణి కార్మికులతో కలిసి పని చేస్తున్నాం... తెలంగాణ ఉద్యమంలో అగ్గి రాజేసి రాష్ట్రం సాధించుకున్నాం... కేసీఆర్‌తో మాట్లాడి మీ కోసం పని చేశా... నేను చేసిన పోరాటాలతోనే 19వేల డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చాయి... మహిళలకు సింగరేణిలో ఉద్యోగాలు వచ్చేలా చేశా... అంటూ టీఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బాయిబాటలో భాగంగా బుధవారం జీడీకే 11ఇంకైన్ గేట్‌మీటింగ్‌లో ఆమె కార్మికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ఇజ్జత్ తీయడమే పనిగా పెట్టుకున్నాడని ఆరోపించారు. అప్పులు పుట్టడం లేదని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ ఎత్తడం లేదని చెప్పడం ముఖ్యమంత్రి స్థాయికి తగింది కాదని ఆమె అన్నారు. రేవంత్‌రెడ్డి ఇలా బేలగా మాట్లాడడం వల్లనే మన రాష్ట్రంపై పెత్తనం కోసం పక్క రాష్ట్రం నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆమె చెప్పారు. సింగరేణిలో కార్మికుల కష్టాలు తెలుసుకోవడానికి తమను అడుగడుగునా అడ్డుకుంటున్నారన్నారు. కార్మికుల కనీస అవసరాలు తీర్చకుండా ప్రభుత్వం, అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, కార్మికుల హక్కుల కోసం టీఆర్‌ఎస్, హెచ్‌ఎంఎస్ పోరాడుతుందని ఆమె అన్నారు. కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మి కోల్‌బెల్ట్‌లో గెలిపిస్తే గెలిచాక ఆ ప్రభుత్వం కనీసం గ్లౌజ్‌లు, షూస్‌లు, యంత్రాలు ఏవి నాణ్యత లేకుండా చేశారని ఆరోపించారు. సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువ కావడంతో చిన్న చిన్న సౌకర్యాలు కూడా కార్మికులకు అందకుండా పోయాయన్నారు. తెలంగాణ ఏర్పడితే 11రోజులు అన్నం ముట్టని పవన్ కళ్యాణ్ మళ్లీ తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నాడని, వాళ్లను ఎవరు అడ్డుకున్నారని కవిత ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ వారంలో మూడు రోజులు హైదరరాబాద్‌లోనే ఉంటున్నారన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ సింగరేణికి కొత్త బ్లాక్ ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం అండర్ గ్రౌండ్ బొగ్గు గనులను తెరవాలని ఆమె డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్టు మైనింగ్ కంటే అండర్ గ్రౌండ్ మైనింగే పర్యావరణానికి, ఉపాధి కల్పనకు మంచిదని పేర్కొన్నారు. గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటీయూసీ కార్మిక సమస్యలపై మౌనంగా ఉండడం మంచిది కాదని హితవు పలికారు. సింగరేణి మెడికల్ కళాశాలలో 25శాతం సీట్లు కార్మికుల పిల్లలకే ఇవ్వాలన్నారు. సింగరేణిని కాపాడడమే కర్తవ్యమని, టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని ఆమె కార్మికులను కోరారు.
కాగా, బాయిబాటలో భాగంగా బుధవారం గోదావరిఖనికి వచ్చారు. ఉదయం జీడీకే 11ఇంక్లైన్‌లో కార్మికులతో మాట్లాడిన అనంతరం సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పర్యటించారు. ఆమె వైద్య సిబ్బందితో పాటు పేషెంట్లతో మాట్లాడారు. సింగరేణి సంస్థ హైదరాబాద్‌లో కార్పొరేట్ ఆసుపత్రిని నిర్మించాలని, రెఫరల్ కారణంగా సింగరేణి కార్మికులు వైద్యం విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె చెప్పారు. అనంతరం ఆసుపత్రి నుంచి చౌరస్తాలోని హెచ్‌ఎంఎస్ కార్యాలయం వరకు ఆటోలో ప్రయాణించారు. ఆ తరువాత సింగరేణి ర్యాపిడ్ గ్రావిటీ వాటర్ ప్లాంట్‌ను పరిశీలించి కార్మిక కుటుంబాలకు శుద్ధనీరును అందించేలా యాజమాన్యం తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. హెచ్‌ఎంఎస్‌ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, టీఆర్‌ఎస్ నాయకులు వెంకటేష్, సదానందం తదితరులుపాల్గొన్నారు.