Share News

శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:25 AM

గణపతి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. గురువారం కమిషనరేట్‌లో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పరిధిలోని అన్ని వర్గాల మతపెద్దలు, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులతో శాంతి సమావేశం నిర్వహించారు.

శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి

కోల్‌సిటీ, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): గణపతి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. గురువారం కమిషనరేట్‌లో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పరిధిలోని అన్ని వర్గాల మతపెద్దలు, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులతో శాంతి సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ మతపెద్దలు, పలువురు ప్రముఖులు ప్రజలకు, ముఖ్యంగా యువతకు శాంతి, సంయమనం, పరస్పర గౌరవం పాటించేలా అవగాహన కల్పించాలని కోరారు. సమస్యలను ఎవరూ స్వయంగా పరిష్కరించేందుకు ప్రయత్నించకూడదన్నారు. ట్రాఫిక్‌, నిమజ్జన సమయం, విగ్రహాల సంఖ్య తదితర అంశాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నా ముందుగానే పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా అన్ని మతాల విశ్వాసాలు, ప్రార్థనా స్థలాలు, ప్రజల మనోభావాలను గౌరవిస్తూ సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, నినాదాలు చేసినా సోషల్‌ మీడియాలో వివాదాస్పద, అసత్య సమాచారాన్ని ప్రచారం చేసినా పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఉత్సవ కమిటీలు, ప్రజలు పరస్పర సమన్వయంతో, బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే మత సామరస్యం, శాంతి, సోదరభావం కొనసాగుతాయని కమిషనర్‌ తెలిపారు. డీజేలకు అనుమతులు లేవని, నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు. అదనపు డీసీపీ (అడ్మిన్‌) కే శ్రీనివాస్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ నాగేంద్ర గౌడ్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్లు భీమేష్‌, శ్రీనివాస్‌, బెల్లంపల్లి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రావు, ఎస్‌ఐలు మనోహర్‌, రాజేందర్‌, చంద్రశేఖర్‌, సంధ్యారాణి, శ్రీలత, మతపెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2026 | 12:25 AM