ప్రజా ప్రభుత్వంతోనే రైతు సంక్షేమం..
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:51 PM
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎన్నో సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. చందపల్లి, తుర్కల మద్దుకుంట, నిట్టూరు, నిమ్మనపల్లి, పెద్దకల్వల, పెద్దబొంకూరు, కొత్తపల్లి, మూలసాల, బోజన్నపేట, మారేడుగొండ, గుర్రంపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎన్నో సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. చందపల్లి, తుర్కల మద్దుకుంట, నిట్టూరు, నిమ్మనపల్లి, పెద్దకల్వల, పెద్దబొంకూరు, కొత్తపల్లి, మూలసాల, బోజన్నపేట, మారేడుగొండ, గుర్రంపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. పెద్దకల్వలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతాంగానికి అన్ని విధాల అండగా ఉండేందుకు ప్రభుత్వం అనేక పథకాలను చేపట్టి అమలు చేస్తుందన్నారు. సన్నరకం ధాన్యం పండించిన రైతుకు క్వింటాలుకు రూ. 500 బోనస్ అందించామన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ రైతులకు రూ.88 కోట్ల బోనస్ అందించామన్నారు. రైతులు పప్పు దినుసులు, ఆయిల్‌పామ్ సాగు వైపు దృష్టి సారించాలని కోరారు. పదేళ్ళ బీఆర్‌ఎస్ పాలనలో రైతులు మోసపోయి గోసపడ్డారని పేర్కొన్నారు. రుణ మాఫీ చేస్తామని రైతులను నమ్మించి బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన లోటుపాట్లను కప్పిపుచ్చేందుకు బీఆర్‌ఎస్ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై సీబీఐ విచారణకు అసెంబ్లీలో తీర్మానిస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీఆర్‌ఎస్ నాయకులను కాపాడేందుకు విచారణలో కాలయాపన చేస్తుందని విమర్శించారు. మహిళా బిల్లు ముసుగులో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఆమోదింప చేసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కుయుక్తులు సాగలేదన్నారు. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీలు కడితే వాటిలో బుంగలు పడ్డవి నిజం కాదా అని ఎమ్మెల్యే అన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలు ఒకటేనని, పరస్పరం రాజకీయంగా సహాయం చేసుకుంటారని అన్నారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, వారికి చిత్తశుద్ధి లేదని వారి మాటల్లో బీఆర్‌ఎస్, బీజేపీలు ఒకటేనని తెలుస్తుందన్నారు. ప్రాజెక్టు కుంగిపోయింది నిజం కాదా వారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కూర మల్లారెడ్డి, కట్కూరి సుధాకర్ రెడ్డి, అర్కుటి సంతోష్, నర్సింహా రెడ్డి, బండారు రామూర్తి, ముత్యాలు నరేష్, డైరెక్టర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.