రైతులు లాభాదాయక పంటలపై దృష్టి సారించాలి
ABN , Publish Date - May 05 , 2026 | 11:47 PM
రైతులు పంట మార్పిడి చేసి లాభాదాయకమైన పంటలపై దృష్టి సారించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన రైతు వారోత్సవంలో ఆయనతోపాటు కలెక్టర్ కోయశ్రీహర్ష పాల్గొన్నారు.
ఎలిగేడు, మే 5 (ఆంధ్రజ్యోతి): రైతులు పంట మార్పిడి చేసి లాభాదాయకమైన పంటలపై దృష్టి సారించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన రైతు వారోత్సవంలో ఆయనతోపాటు కలెక్టర్ కోయశ్రీహర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో పెసర్లు, జొన్నలు, కందులు తదితర పంటలు పండించిన రైతులు ఇప్పుడు ఎక్కువగా వరిపంటపై ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. ఇది రైతులకు లాభదాయకం కాదన్నారు. పంట మార్పిడి చేసి, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసుకొని లాభాలు పొందాలన్నారు. రైతులు ఆయిల్‌పామ్ సాగు చేయాలని, భూసారాన్ని కాపాడేందుకు యూరియాను తగ్గించాలన్నారు. పంట అవశేషాలను కాల్చడం మానుకోవాలన్నారు. వచ్చే ఏడాది ఎలిగేడు మండలంలో కనీసం వెయ్యి ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తున్నదని అన్నారు. ఆయిల్‌పామ్ సాగులో అంతర పంటల ద్వారా కూడా అదనపు ఆదాయం వస్తుందన్నారు. ఐదేళ్ల క్రితం రూ.14 వేలుగా ఉన్న దర ప్రస్తుతం రూ.23 వేల వరకు పెరిగిందని తెలిపారు. భవిష్యత్‌లో కూడా ధరలు పెరుగుతాయని, దేశంలో నూనె దిగుమతులపై ఆధారపడుతున్నందున ఆయిల్‌పామ్‌కు మంచి మార్కెట్ ఉందన్నారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రజాపాలనప్రగతి ప్రణాళిక ఇంచార్జి శ్రీరామ్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ యాకన్న, పీఏసీఎస్ చైర్మన్ గోపు విజయభాస్కర్ రెడ్డి, సర్పంచ్‌లు కప్పల ప్రవీణ్, కవ్వంపల్లి బాపయ్య, తిరుమల కంపెనీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.