రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సహించాలి
ABN , Publish Date - Jul 04 , 2026 | 11:41 PM
సూపర్ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ప్రోత్సహించాలని, యూరియా యాప్ రాష్ట్రానికే ఆదర్శమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
పెద్దపల్లి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): సూపర్ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ప్రోత్సహించాలని, యూరియా యాప్ రాష్ట్రానికే ఆదర్శమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రోటోకాల్ ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ఎమ్మెల్సీ అంజి రెడ్డిలతో కలిసి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వానికి ఇంకా రెండున్నర సంవత్సరాలకు పైగా పదవీకాలం ఉందని, ఈ కాలంలో ప్రతీ అధికారి మరింత బాధ్యత, పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరువ చేయాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై జిల్లాస్థాయిలో సమగ్ర శ్వేతపత్రం సిద్ధం చేయాలని మంత్రి ఆదేశిం చారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదు, సూచన, అభిప్రాయం ప్రభుత్వానికి చేరేలా చర్యలు తీసుకోవాలని, వాటి ఆధారంగా లోపాలు, పెండింగ్ అంశాలు, బ్యాక్‌లాగ్‌లను గుర్తించి వెంటనే సరిదిద్దే కార్యాచరణ చేపట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష నాయకత్వంలో అధికారులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని అభినందించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సేవల మెరుగుదల, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు వంటి రంగాల్లో మంచి ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. రైతుల కోసం పెద్దపల్లి జిల్లాలో ప్రారంభించిన యూరియా బుకింగ్ యాప్ రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఆదర్శంగా నిలిచిం దని మంత్రి అన్నారు. జిల్లాలో ప్రతీ రైతుకు అవసరమైన సమయంలో యూరియా తప్పనిసరిగా అందేలా చూడాలని ఆదేశించారు. సూపర్ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ప్రోత్సహించాలని, ముఖ్యంగా ఆయిల్‌పామ్, కూరగాయలు, పప్పుధాన్యాలు వంటి పంటల సాగును విస్తరించేలా వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రభుత్వం బోనస్ ప్రకటించిన ఏడు రకాల వరి వంగడాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి మండలంలోని రైతువేదికల్లో ఏడు రకాల విత్తనాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో విజయవంతంగా నిర్వహించిన విత్తనమేళా తరహాలో రైతులకు నాణ్యమైన విత్తనాల పై అవగాహన కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. వ్యవసాయ అధికా రులు రైతులతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ క్షేత్రస్థాయిలో పంటలను పర్యవేక్షించాలని, రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు అందించాలని తెలిపారు. అనధికారిక, నాణ్యతలేని విత్తనాల వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు. జిల్లాలో చేపడుతున్న అన్ని అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణను ప్రాధాన్యత క్రమంలో వేగవంతం చేయాలని, భూసేకరణ ప్రక్రియలో రైతులు, స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ పారదర్శకంగా ముందుకు సాగాలని సూచించారు.
ఫసన్న ధాన్యానికి బోనస్‌తో రైతులకు ఆదాయం
- ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు
వానాకాలంలో సన్న రకాల వరి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం అందిస్తున్న బోనస్ ద్వారా వచ్చిన అదనపు ఆదాయం, గత ప్రభుత్వం రైతుబంధు కింద అందించిన మొత్తాన్ని మించిందన్నారు. రైతులు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న సన్న రకాల వరిని సాగు చేసి అధిక లాభాలు పొందాలని పిలుపునిచ్చారు. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న ఏడు రకాల వరి వంగడాలను ప్రభుత్వం ముందుగానే గుర్తించి వాటికి బోనస్ ప్రకటించిందని తెలిపారు.
రైతులు కూడా ఆయా ఏడు రకాల వరి వంగడాలనే సాగు చేసి ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత కూడా 45 రోజుల వరకు చెల్లింపులు అందని పరిస్థితులు ఉండేవని, ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపే రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా నగదు జమ చేస్తోందని తెలిపారు. రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ అందిస్తూ వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతులు నాణ్యమైన విత్తనాలతో ప్రభుత్వం సూచించిన వరి వంగడాలను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని పిలుపునిచ్చారు.
యూరియా యాప్‌తో 19 శాతం తగ్గిన వినియోగం
- కలెక్టర్ కోయ శ్రీ హర్ష
జిల్లాలో యూరియా యాప్ వినియోగంతో గత యాసంగిలో 19 శాతం యూరియా వినియోగం తగ్గిందని కలెక్టర్ తెలిపారు. వానాకాలం సీజన్‌కు అవసర మైన యూరియా నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, ఇప్పటివరకు 21,126 మంది రైతులకు యాప్ ద్వారా 2453 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేశామన్నారు. సూపర్ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేందుకు రైతువేదికల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, మూడు సంవత్సరాల్లో 3,572ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తరించగా రూ.5.43 కోట్ల సబ్సిడీ అందించామని చెప్పారు. అలాగే ఇతరత్రా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు.
దొడ్డి కొమురయ్య, రోశయ్యకు నివాళులు
తెలంగాణ ఉద్యమ అమరవీరులు దొడ్డి కొమురయ్య, మాజీ ముఖ్యమంత్రి రోశ య్య చిత్రపటాలకు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్, ఎమ్మెల్సీ చిన్న మైలు అంజిరెడ్డి, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి కలెక్టరేట్‌లో నివాళులర్పించారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు కలెక్టరేట్ ఆవరణలో నూతన అంబులెన్స్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించి, ప్రజలకు మరింత మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించే దిశగా ఈ అంబులెన్స్ ఉపయోగపడుతుందని తెలిపారు. డీసీపీ రాంరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరీ, ఆర్‌డివోలు సురేష్, గంగయ్య, జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల. మల్లయ్య, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.