Share News

భారంగా రైతు వేదికలు

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:28 AM

ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం ముందుకు సాగే విధంగా రైతులను సంఘటిత పరుస్తూ వారి ఆర్థిక ఎదుగుదలకు వేదికగా గత ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసింది. చాలాకాలంగా ఇవి రైతులకు చేరువకాకుండా కునారిల్లుతూ వచ్చాయి.

భారంగా రైతు వేదికలు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం ముందుకు సాగే విధంగా రైతులను సంఘటిత పరుస్తూ వారి ఆర్థిక ఎదుగుదలకు వేదికగా గత ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసింది. చాలాకాలంగా ఇవి రైతులకు చేరువకాకుండా కునారిల్లుతూ వచ్చాయి. ఈ దశలో రైతులకు అందుబాటులో వేదికలు ఉండే విధంగా సాంకేతిక హంగులు సమకూరుస్తూ వినియోగంలోకి తేవడం కొంత సంతోషించే విషయమైనా రైతు వేదికల నిర్వహణకు నిధులు విడుదల కాకపోవడంతో వ్యవసాయశాఖ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. గడిచిన నాలుగేళ్లుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతు వేదికల నిర్వహణకు నిధులు విడుదల కాకపోవడంతో ఏఈఓలకు నిర్వహణ డబ్బులు లేక తంటాలు పడుతున్నారు. ప్రస్తుతం రైతు వేదికల్లో ప్రభుత్వం వ్యవసాయ శాస్త్రవేత్తలు, రాష్ట్ర స్థాయి అధికారులతో రైతులతో నేరుగా ముఖాముఖి కార్యక్ర మాలు నిర్వహిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కూడా రైతు వేదికల ద్వారా సందేశాలు వినిపించిన సందర్భాలు ఉన్నాయి. వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సలహాలు సూచనలు రైతులకు చేరవేస్తున్నారు. రైతు వేదికల్లో విత్తనమేళా వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మాత్రం రైతు వేదికల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతుంది. పారిశుధ్య ఇబ్బందులు కూడా ఉన్నాయి.

నిర్వహణ బకాయిలు రూ 2.44 కోట్లు

రైతు వేదికలను నిత్యం పరిశుభ్రంగా ఉంచడానికి తాగునీరు, విద్యుత్‌ బిల్లులు, శిక్షణ తరగతులు, రైతులకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించడానికి ప్రతినెలా రూ. 9 వేలు చెల్లించే విధంగా నిర్ణయించారు. ఇందులో పరిశుభ్రత పనులకు రూ3 వేలు, శిక్షణకు రూ.2500, స్టేషనరీ కోసం రూ వెయ్యి విద్యుత్‌ చార్జీల కోసం రూ. వెయ్యి, మరమ్మతులకు రూ. వెయ్యి, తాగునీటికి రూ.500 ఖర్చు చేసే విధంగా నిర్ణయించారు. 2022 ఆగస్టు వరకు రైతు వేదికల నిర్వహణకు నిధులు విడుదల చేశారు. గడిచిన నాలుగేళ్లుగా నిధులు విడుదల కాకపోవడంతో రైతు వేదిక నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రైతు వేదికలను కనీసం ఊడ్చే పరిస్థితి లేకుండా పోయింది. నాలుగేళ్లుగా జిల్లాలోని రైతు వేదికలకు ప్రభుత్వం నుంచి రూ 2.44 కోట్ల బకాయిల నిధులు రావాల్సి ఉంది.

జిల్లాలో 57 రైతు వేదికలు

అన్నదాతలకు సాగులో శిక్షణ, సలహాలు సూచనలు అందించడం, ఎరువులు, విత్తనాలు విక్రయించే కేంద్రాలుగా ఉండే విధంగా 2017లో క్లస్టర్‌ల వారీగా రైతు వేదికలు నిర్మించారు. జిల్లాలో 10 గుంటల నుంచి ఎకరం స్థలం వరకు సేకరించి 57 రైతు వేదికలను నిర్మించారు. అప్పుడు జిల్లాలో రైతు వేదికలను ఎస్‌ఆర్‌ఈజీఎస్‌ నిధుల నుంచి రూ 8. లక్షలు, వ్యవసాయ శాఖ నుంచి రూ.12 లక్షలు కలిపి రూ. 20 లక్షలతో రైతు వేదికలను నిర్మించారు. జిల్లాలో బోయిన్‌పల్లి మండలంలో కొదురుపాక, బోయిన్‌పల్లి, కోరం, విలాసాగర్‌, తంగళ్లపల్లి మండలంలో తాడూరు, బద్దెనపల్లి, కస్బేకట్కూర్‌, నేరెళ్ల, తంగళ్లపల్లి, జిల్లెల్ల, సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో బోనాల, చంద్రంపేట, వీర్నపల్లి మండలంలో వీర్నపల్లి, గర్జనపల్లి, ఇల్లంతకుంట మండలంలో దాచారం, ఇల్లంతకుంట, గాలిపల్లి, పోత్తూరు, పెద్దలింగాపూర్‌, రేపాక, వల్లంపట్ల, గంభీరావుపేట మండలంలో గంభీరావుపేట, నర్మల, మల్లారెడ్డిపేట, లింగన్నపేట, సముద్రలింగాపూర్‌, ముస్తాబాద్‌ మండలంలో దమ్మన్నపేట్‌, నామాపూర్‌, మద్దికుంట, చికోడ్‌, ఆవునూర్‌, బదనకల్‌, పోతుగల్‌, ముస్తాబాద్‌, ఎల్లారెడ్డిపేట మండలంలో ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్‌, వెంకటాపూర్‌, అల్మాస్‌పూర్‌, గొల్లపల్లి, చందుర్తి మండలంలో మల్యాల, మూడపల్లి, బండపల్లి, మర్రిగడ్డ, చందుర్తి, కోనరావుపేట మండలంలో బావుసాయిపేట్‌, వేములవాడ రూరల్‌ మండలంలో వట్టెంల, హనుమాజీపేట్‌, మర్రిపల్లి, వేములవాడ మండలంలో శాత్రాజ్‌పల్లి, మారుపాకలో నిర్మించారు. వేదికల ద్వారా రైతులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండే విధంగా సాగులో పంట మార్పిడికి మార్గదర్శకం చేయడం, వ్యవసాయ పరికరాలు, ఉత్పత్తులకు సంబంధించిన విషయాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఉపయోగపడే విధంగా వేదికలు ఏర్పాటు చేసినా అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరడం లేదనే విమర్శలు ఉన్నాయి.

Updated Date - Jun 30 , 2026 | 12:28 AM