అదనపు తూకంతో నష్టపోతున్న రైతులు
ABN , Publish Date - May 19 , 2026 | 11:57 PM
వరి, మక్క ఉత్పత్తులు విక్రయించుకోవడానికి నెల రోజులుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అదనపు తూకంతో రైతులు నష్టపోతున్నారని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైస్‌మిల్లుల కేటాయింపు జరగక ముందే కొనుగోలు కేంద్రాలను ఆరంభించారన్నారు.
పెద్దపల్లి, మే 19 (ఆంధ్రజ్యోతి): వరి, మక్క ఉత్పత్తులు విక్రయించుకోవడానికి నెల రోజులుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అదనపు తూకంతో రైతులు నష్టపోతున్నారని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైస్‌మిల్లుల కేటాయింపు జరగక ముందే కొనుగోలు కేంద్రాలను ఆరంభించారన్నారు. ఇప్పటి వరకు 30 శాతం మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారన్నారు. వర్షాలు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఎన్నికల సందర్భంగా ధాన్యంలో కోతలు లేకుండా, అదనంగా తూకం వేయకుండా చూస్తామని చెప్పిన నేతలు కోతలు విధిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒక బస్తా 40.600 కిలోలు తూకం వేయాల్సి ఉండగా, 42 కిలోలకు పైగా తూకం వేస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారని అన్నారు. ట్రక్‌షీట్ ముందుగా ఇవ్వకుండా రైస్‌మిల్లుకు వెళ్లిన తర్వాత కోతలు విధించి ఇస్తున్నారని ఆరోపించారు. ఒక్కో క్వింటాలుకు రైతులు 4 నుంచి 5 క్వింటాళ్లు నష్టపోతున్నారన్నారు. ఈ సొమ్ము ఎవరి పాలవుతున్నదని, అధికారులు, రైస్ మిల్లర్లు తింటున్నారా, ప్రజాప్రతినిధులు తింటున్నారా అని ప్రశ్నించారు. ఏ గ్రేడ్ ధాన్యాన్ని కామన్ కింద కొనుగోలు చేయడంతో క్వింటాలుకు 20 రూపాయలు రైతులు నష్టపోతున్నారని అన్నారు. మక్కలు కొనుగోలు చేసే విషయంలో రైతులే సంచులు తెచ్చుకోవాలని చెబితే ఎక్కడ తెచ్చుకుంటారని మండిపడ్డారు. ఒక్కో సంచికి 30 రూపాయలకు కొనుగోలు చేస్తే, ప్రభుత్వం 21 ఇచ్చి 9 రూపాయలు నష్టపోయేలా చేస్తున్నదన్నారు. ధాన్యంలో అదనపు తూకం, కోతలపై కలెక్టర్ స్పందించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జిల్లాలో మట్టి మాఫియా బరి తెగించిందని, చెరువుల్లో ఉన్న నీళ్లను ఖాళీ చేసి మట్టిని తీసుక వెళ్లేందుకు పూనుకుంటున్నా చర్యలు లేవన్నారు. రైతులకు మట్టి ఇవ్వకుండా ఇటుక బట్టీల యజమానులకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గత ఏడాది ఒక్కో లారీకి 2,700 రూపాయలు తీసుకున్నారని, ఒక్కో లారీలో ఓవర్ లోడ్‌తో పెద్ద ఎత్తున మట్టి తీసుకవెళ్లారని ఆరోపించారు. మట్టి ద్వారా వచ్చే డబ్బులను మైనింగ్ శాఖ ఖాతాల్లో జమ చేయనివ్వకుండా,్ల కలెక్టర్ ప్రత్యేక ఖాతాలు తీయించడం వల్ల ఆయా గ్రామాలకు రావాల్సిన సీనరేజీ సొమ్ము రాకుండా పోయిందన్నారు. శివపెల్లి, చీమలకుంట, పాలితం, పెగడపల్లి, తదితర ప్రాంతాల్లో గుట్టల మట్టిని అక్రమంగా తరలిస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. ఈ మట్టి మాఫియా వెనుక ఉన్నది ఎవరు అని ఆయన ప్రశ్నించారు. చెరువులకు గండ్లు కొట్టి నీళ్లు ఖాళీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. చెరువుల మట్టిని రైతులకే ఇవ్వాలన్నారు. సీనరేజీ డబ్బులు మైనింగ్ ఖాతాలోనే జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు ఉప్పు రాజ్ కుమార్, మర్కు లక్ష్మన్, పెంచాల శ్రీధర్, మోహన్ రావు, పూదరి చంద్రశేఖర్, ముస్త్యాల రాజయ్య, పూదరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.