లక్ష్యానికి దూరంగా..
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:51 AM
నగరపాలక సంస్థ ప్రధాన ఆదాయ వనరులైన ఆస్తిపన్ను వసూళ్లపై ఇందిరమ్మ ఇళ్ల సర్వే, మున్సిపల్ ఎన్నికల ప్రభావం పడింది. 2024-26 ఆర్థిక సంవత్సరంలో నగరంలోని నివాస, వాణిజ్య, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, చారిటీ సంస్థలకు సంబంధించిన భవనాలు, ఇళ్లకు సంబంధించిన ఆస్తి పన్నులు 60 కోట్ల రూపాయలకుపైగానే వస్తుందని అంచనా వేశారు. వందశాతం పన్నులు వసూలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఆదేశించింది.
కరీంనగర్ టౌన్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ ప్రధాన ఆదాయ వనరులైన ఆస్తిపన్ను వసూళ్లపై ఇందిరమ్మ ఇళ్ల సర్వే, మున్సిపల్ ఎన్నికల ప్రభావం పడింది. 2024-26 ఆర్థిక సంవత్సరంలో నగరంలోని నివాస, వాణిజ్య, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, చారిటీ సంస్థలకు సంబంధించిన భవనాలు, ఇళ్లకు సంబంధించిన ఆస్తి పన్నులు 60 కోట్ల రూపాయలకుపైగానే వస్తుందని అంచనా వేశారు. వందశాతం పన్నులు వసూలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఆదేశించింది.
కీలక సమయంలో అదనపు బాధ్యతలు
మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా పన్నుల వసూళ్లకు అత్యంత కీలకమైన డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో మున్సిపల్ రెవెన్యూ విభాగం, టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు, ఉద్యోగులందరికి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ అదనపు బాధ్యతలను అప్పగించారు. దీంతో పన్నుల వసూళ్లు తగ్గిపోయాయి. ఆర్థిక సంవత్సరం ముగింపునకు 25 రోజులు మాత్రమే మిగిలి ఉండగా ఇప్పటి వరకు కేవలం 50 శాతం అంటే దాదాపు 30 కోట్లు రూపాయలు మాత్రమే వసూలయ్యాయి. ఈ నేపథ్యంలో వందశాతం పన్నులను వసూలు చేసే లక్ష్యంతో నగరపాలక సంస్థ అధికారులు బకాయిదారులు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నులు, నల్లాబిల్లుల వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించారు.
మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు
నగరపాలక సంస్థ అధికారులు మొండి బకాయిదారులకు ముందుగా రెడ్ నోటీసులు జారీ చేసి వారంరోజుల్లో చెల్లించాలని గడువు విధిస్తున్నారు. ఆలోగా చెల్లించకుంటే మున్సిపల్ యాక్టు ప్రకారంగా నల్లా, విద్యుత్ కనెక్షన్లను తొలగించడం, ఆస్తులను సీజ్ చేయడంతోపాటు ఇతర చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. నగర అభివృద్ధికి ప్రతి ఇంటి యజమాని విధిగా ఆస్తి పన్నులు చెల్లించి సహకరించాలని కోరుతున్నారు.
ప్రత్యేక బృందాల ఏర్పాటు
మొండి బకాయిదారుల వద్దకు బిల్ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, రెవెన్యూ అధికారులు, వార్డు ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లు వెళ్లి ఒత్తిడి తెచ్చేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. స్వయంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ క్షేత్రస్థాయిలో ఆస్తి పన్ను వసూళ్ల్ళను పర్యవేక్షిస్తున్నారు. మూడు, నాలుగురోజులుగా ఆస్తిపన్ను వసూళ్ళను మరింత ముమ్మరం చేశారు. రెవెన్యూ విభాగం అధికారులు, ఉద్యోగులతోపాటు ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగాలకు చెందిన అధికారులకు కూడా ఆస్తిపన్ను వసూళ్ల బాధ్యతలను అప్పగించారు. డివిజన్ల వారీగా బాధ్యతలను అప్పగించడంతో అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది డివిజన్లలో ఇంటింటికి వెళ్లి ఆస్తిపన్నులను వసూలు చేస్తున్నారు.
ఎనిమిది వ్యాపార సంస్థల సీజ్
పన్ను చెల్లించకుండా జాప్యం చేస్తున్న ఎనిమిది వ్యాపార సంస్థలను నగరపాలక సంస్థ అధికారులు సీజ్ చేశారు. వంద మంది మొండి బకాయిదారులకు రెడ్‌నోటీసులు జారీ చేసి ప్రతినిఽత్యం వారిపై ఒత్తిడి తెచ్చి పన్ను వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, చారిటీ సంస్థల బకాయిలు కూడా బల్దియాకు భారంగా మారాయి. వాటిని కూడా వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆయా శాఖల నుంచి పన్నులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తమకు ఆస్తిపన్ను మినహాయింపు ఉందంటూ కొన్ని సంస్థలు పన్నులు చెల్లించడం లేదు. అలాంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు.
ఉదయం 6 గంటలకే క్షేత్రస్థాయిలోకి..
రెండు, మూడు నెలలుగా అదనపు బాధ్యతల్లో తలమునకలైన అధికారులు, ఉద్యోగులు ఇప్పుడు ఆస్తి పన్ను లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే క్షేత్రస్థాయికి వెళుతున్నారు. గతంలో ప్రభుత్వం వన్ టైం సెటిల్‌మెంట్ స్కీమ్ (ఓటీఎస్)ను అమలు చేసింది. ఇందులో భాగంగా బకాయిలపై వడ్డీ మాఫీ చేసింది. మళ్లీ ప్రభుతం ఓటీఎస్ అమలు చేస్తుందని భావించి కొందరు ఆస్తి పన్ను చెల్లించడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ స్కీంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనందున పన్నులు చెల్లించాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తున్నారు. వందశాతం లక్ష్యంగా పెట్టుకొని మున్సిపల్ అధికారులు కొరఢా ఝళిపిస్తుండడంతో ఆస్తిపన్నులు చెల్లించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మార్చి 31 వరకు గతంలో మాదిరిగా ఆస్తిపన్ను వసూళ్లలో కరీంనగర్ కార్పొరేషన్ మంచి ర్యాంకు సాధించాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నారు.