Share News

పడిపోతున్న భూగర్భజలాలు

ABN , Publish Date - May 03 , 2026 | 12:24 AM

ఎండలు ముదిరి వేడి 45 డిగ్రీలకు పెరగడంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. చెరువుల్లో, కుంటల్లో నీరు ఇంకిపోతున్నది. బావులు, బోరుబావుల్లో నీరు లోతునకు పడిపోతూ మే ఆరంభంలోనే ప్రజలకు నీటి కరువు చూపిస్తున్నాయి.

పడిపోతున్న భూగర్భజలాలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఎండలు ముదిరి వేడి 45 డిగ్రీలకు పెరగడంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. చెరువుల్లో, కుంటల్లో నీరు ఇంకిపోతున్నది. బావులు, బోరుబావుల్లో నీరు లోతునకు పడిపోతూ మే ఆరంభంలోనే ప్రజలకు నీటి కరువు చూపిస్తున్నాయి. కరీంనగర్‌ కార్పొరేషన్‌లోని 4 లక్షల మంది ప్రజలకు తాగునీరందించే లోయర్‌ మానేరు డ్యాంలో నీరు డెడ్‌ స్టోరేజీ లెవల్‌కు చేరుకుంటున్నది. మార్చి నెలలో జిల్లాలో నీరు 7.20 మీటర్ల లోతున లభించగా ఏప్రిల్‌ మాసాంతానికి అది 7.84 మీటర్ల లోతునకు పడిపోయింది. నెలరోజుల వ్యవధిలోనే 0.64 మీటర్ల లోతునకు నీరు పడిపోవడంతో అన్ని బోరుబావులు, వ్యవసాయబావులు ఎండిపో తున్నాయి. ఏప్రిల్‌ మాసాంతానికి జిల్లాలోని గంగాధర మండలంలో భూగర్భజలాలు 16.13 మీటర్లకు పడిపోయాయి. అలాగే చొప్పదండి మండలంలో 13.16 మీటర్లు, కరీంనగర్‌ అర్బన్‌ మండలంలో 11.74 మీటర్లు, రామడుగు మండలంలో 11.0 మీటర్లు, కొత్తపల్లి మండలంలో 9.15 మీటర్లకు, తిమ్మాపూర్‌ మండలంలో 8.48 మీటర్లకు, చిగురుమామిడి మండలంలో 7.34 మీటర్లకు, గన్నేరువరం మండలంలో 7.59 మీటర్లకు, హుజురాబాద్‌ మండలంలో 7.29 మీటర్లకు, కేశవపట్నం మండలంలో 5.86 మీటర్లకు భూగర్భజలాలు పడిపోయాయి. మిగతా మండలాల్లో 5 మీటర్లలోతులోనే నీరు లభిస్తున్నది. గత ఫిబ్రవరి మాసంలో జిల్లాలో సగటున 6.73 మీటర్ల లోతున నీరు లభించగా మార్చి నెలలో 7.20 మీటర్లు, ఏప్రిల్‌ నెలలో 7.84 మీటర్ల లోతునకు భూగర్భజలాలు పడిపోయాయి. జిల్లాలో మానకొండూర్‌ మండలంలో 2.03 మీటర్లలోతున నీరు లభిస్తుండగా గంగాధర మండలంలో మాత్రం 16.13 మీటర్ల లోతునకు వెళితేగానీ నీరు లభించడం లేదు. మెట్ట ప్రాంతాల్లోని చిగురుమామిడి మండలంలో ఈసారి పరిస్థితులు కొంత మెరుగ్గానే కనిపిస్తున్నాయి.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

జిల్లాలో శనివారం 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు, శుక్రవారం 44.5, గురువారం 45.2, బుధవారం 43.8, మంగళవారం 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగి భూగర్భజలాలు పూర్తిగా అడుగంటితే మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరందించడం కూడా కష్టమయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. పట్టణంలో నీటి కొరత ఏర్పడుతుండడంతో బోర్ల వినియోగం పెరిగిపోయింది. ఇప్పటికే హైలెవల్‌ ప్రాంతాల్లో భూగర్భజలాలు అందక ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించుకొని వాడుకుంటున్నారు. పలు అపా ర్టుమెంటుల్లో నీటి కొరతతో గృహ వినియోగానికి ఇబ్బందులు ఏర్పడి ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు.

Updated Date - May 03 , 2026 | 12:24 AM