Share News

సహకార సంఘాల పాలకవర్గాలపై కసరత్తు

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:48 PM

జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు కొత్త పాలకవర్గ కమిటీలను నియమించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కసరత్తు మొదలుపెట్టారు. నామినేటెడ్‌ విధానంలో నియమించా లని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు ఆయా పదవులను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు.

సహకార సంఘాల   పాలకవర్గాలపై కసరత్తు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు కొత్త పాలకవర్గ కమిటీలను నియమించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కసరత్తు మొదలుపెట్టారు. నామినేటెడ్‌ విధానంలో నియమించా లని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు ఆయా పదవులను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే నియామకాలు మొదలు కాగా, జిల్లాలోనూ ఈ నెలాఖరులోపు అన్ని సహకార సంఘాలకు కొత్త పాలకవర్గాలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తు న్నాయి. దీంతో ఆశావహులు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు, ధాన్యం కొనుగోలు వంటి కీలక సేవలు అందుతుండటంతో ఈ పదవులకు రాజకీయ ప్రాధాన్యం నెలకొంది. దీంతో పాలకవర్గాల్లో చోటు కోసం అధికార పార్టీకి చెందిన పలు వురు నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

జిల్లాలో సుల్తానాబాద్‌ మండలం సుల్తానాబాద్‌, కనుకుల, గర్రెపల్లి, చిన్నకల్వల, సుద్దాల, ఓదెల మండలం పొత్కపల్లి, కాల్వశ్రీరాంపూర్‌ మండలం కూనారం, కాల్వశ్రీరాంపూర్‌, పెద్దపల్లి మండలంలో పెద్దపల్లి, అప్పన్నపేట్‌, జూలపల్లి, ఎలిగేడు మండలం ఎలిగేడు, ధూళికట్ట, కమాన్‌పూర్‌, కన్నాల, మేడిపల్లి, మంథని, ధర్మారం మండలంలో పత్తిపాక, నందిమేడారం, ముత్తారంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. నామినేటెడ్‌ ప్రాతిపదికన నియామకాలు చేపట్టనుండడంతో ఒక్కో సంఘంలో ఒకరు చైర్మన్‌, మరొకరు వైస్‌చైర్మన్‌, 11 మంది డైరెక్టర్లు కలుపుకుని 13 మందిని నియమించనున్నారు. మొత్తం 260 మందికి అవకాశం దక్కనున్నది. గతంలో ఎన్నికల ద్వారా డైరె క్టర్లను ఎన్నుకుని అందులో నుంచి ఇద్దరిని చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌గా ఎన్నుకునే వారు. ఆ విధానానికి ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం స్వస్తి పలికింది. నామినేటెడ్‌ విధానంలోనే నియమించాలని మార్చిలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్న మేరకు నియామకాలు చేపడుతున్నారు. నామినేటెడ్‌ కావడంతో అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారినే ఎంపిక చేయనున్నారు.

రాజకీయ సమీకరణాలకే పెద్దపీట

ప్రతీ నియోజకవర్గంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సామాజిక వర్గాల సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని నియామ కాలు చేసే అవకాశముందని సమాచారం. ఇటీవల జరిగిన స్థానిక రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం వంటి అంశాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చైర్మన్‌, డైరెక్టర్‌ పదవులను ఆశిస్తున్న నాయకులు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు, రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని కొందరు కోరుతుండగా, సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయత, స్థానిక రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నియామకాలు చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

చైర్మన్‌ పదవులకు పోటాపోటీ..

జిల్లాలో ఇరవై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్ల కోసం అధికార కాంగ్రెస్‌ పార్టీ నేతల మధ్య పోటాపోటీ నెలకొన్నది. అత్యధికంగా 13 సంఘాలు పెద్దపల్లి నియోజకవర్గంలో ఉండగా, మంథని నియోజకవర్గంలో నాలుగు, రామగుండంలో ఒకటి, ధర్మారం మండలంలో రెండు ఉన్నాయి. కొన్ని సంఘాలకు చైర్మన్ల పేర్లు ఖరారు కాగా, మిగతా సంఘాలకు కసరత్తు నడుస్తున్నది.

Updated Date - Jul 04 , 2026 | 11:48 PM