ఉత్తమ ఫలితాలకు కసరత్తు
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:50 AM
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు సిలబస్ పూర్తి చేశాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధనలో వేగం పెంచారు. ఉదయం, సాయంత్రం గంట పాటు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు.
జగిత్యాల, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షా ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు సిలబస్ పూర్తి చేశాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధనలో వేగం పెంచారు. ఉదయం, సాయంత్రం గంట పాటు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు పాఠ్యాంశాలను బోధిస్తూనే మరోవైపు సబ్జెక్టుల వారీగా వారాంతపు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులను రెగ్యులర్‌గా స్కూలుకు రప్పించడంతో పాటు చదువులో వెనుకబడిన వారిని గుర్తించి, అర్థం కాని అంశాలను మళ్లీ వివరిస్తున్నారు. విద్యార్థులకు సబ్జెక్టులను బట్టీ పట్టించే కంటే వారికి అవగాహన కల్పించడంపైనే దృష్టి పెడుతున్నారు.
ఫమెరుగైన ఫలితాల కోసం..
జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా విద్యాశాఖ ఈ ఏడాది ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ఎఫ్‌ఆర్‌ఎస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఉపాధ్యాయులకు ఉదయం పాఠశాలలో అడుగు పెట్టింది మొదలు సాయంత్రం విడిచి వెళ్లే సమయం వరకు ఆన్‌లైన్‌లో పక్కాగా రికార్డు చేస్తోంది. ఫలితంగా ఉపాధ్యాయుల హాజరుశాతం గణనీయంగా మెరుగుపడి విద్యార్థులకు ఉత్తమ విద్యా బోధన అందేలా చేస్తోంది. తనిఖీల విషయంలో మండల విద్యాధికారుల పనితీరును ఎప్పటికప్పుడు విశ్లేషిస్తోంది.
ఫసీబీఎస్‌ఈ తరహాలో..
గతంలో ఒక సబ్జెక్టుకు మరో సబ్జెక్టు పరీక్షకు మధ్య ఒక రోజు గ్యాప్ మాత్రమే ఉండేది. వెంటనే పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు ఒక సబ్జెక్టులో చేసిన పొరపాట్లను మరో సబ్జెక్టులో దొర్లకుండా జాగ్రత్తపడే అవకాశం ఉండేది కాదు. ఏడాదంతా చదివిన అంశాన్ని అర్థం చేసుకొని, అవగాహన చేసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యేవారు. ఈ ఒత్తిడిని కొంచేం ఉపశమనం కల్పించాలని ఉద్ధేశంతో ఎస్సెస్సీ బోర్డు వార్షిక పరీక్షల తేదీల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంది. ఒక సబ్జెక్టుకు మరో సబ్జెక్టుకు మధ్య కనీసం నాలుగు రోజుల సమయం ఉండేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఒకసారి చదివిన అంశాలను మళ్లీ పునశ్చరణ చేసుకునేందుకు విద్యార్థులకు ఇది మంచి అవకాశమని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఫగత ఫలితాల ఆధారంగా..
జగిత్యాల జిల్లా ఆవిర్భావం నుంచి పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించింది. జిల్లాలో 2017 మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలో 97.35 శాతం ఫలితాలు సాధించి అగ్రబాగాన నిలిచింది. గత యేడాది రాష్ట్రంలో 98.20 శాతం ఉత్తీర్ణతను సాధించి జగిత్యాల జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. జిల్లాలో గత విద్యా సంవత్సరంలో 11,849 మంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 5,962 మంది బాలురు, 5,887 మంది బాలికలు హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 440 పాఠశాలలు ఉండగా ఈ ఏడాది 12,688 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి విద్యాధికారులు ఈసారి ఎస్సెస్సీలో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించారు.
ఉత్తమ ఫలితాల సాధనకు కృషి
-రాము, జిల్లా విద్యాశాఖాధికారి
జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో లక్ష్యం మేరకు పదో తరగతి ఫలితాలు సాధించేందుకు అవసరమైన కృషి చేస్తున్నాం. ఇప్పటికే విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ప్రారంభించాం. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
---------------------------------------------------------
జిల్లాలోని పదో తరగతి విద్యార్థులు
-------------------------------------------
పాఠశాల పేరు...సంఖ్య...విద్యార్థులు
ప్రభుత్వ - 13 - 450
జడ్పీ - 177 - 4,784
మోడల్‌స్కూల్ - 13 - 1,158
కేజీబీవీ - 16 - 556
మైనార్టీ - 5 - 187
రెసిడెన్షియల్స్ - 2 - 129
బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ - 11 - 327
ప్రైవేటు - 203 - 4,779
-------------------------------------
మొత్తం - 440 - 12,688
-------------------------------------