రిజర్వేషన్లపై ఉత్కంఠ..
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:25 AM
మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తుండగా, రిజర్వేషన్లపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వక పోవడంతో ఆశావహులు అయోమయానికి గురవుతున్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తుండగా, రిజర్వేషన్లపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వక పోవడంతో ఆశావహులు అయోమయానికి గురవుతున్నారు. పాత రిజర్వేషన్లనే అమలు చేస్తారా, చట్ట సవరణ చేసి రోటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లను ఖరారు చేస్తారా అనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడం గందర గోళానికి దారి తీస్తున్నది. గత నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలను పంచాయతీరాజ్ చట్టం- 2018లో పేర్కొన్న విధంగా సర్పంచ్, వార్డు స్థానాలకు పదేళ్లకోసారి రిజర్వేషన్లు రోటేషన్ చేయాలనే నిబం ధనను ఐదేళ్లకోసారి అమలయ్యే విధంగా సవరించి నిర్వహించిన విషయం తెలిసిందే. అదేవిధంగా మున్సిపల్ చట్టం-2019ని కూడా సవరించి రిజర్వేషన్లను రోటేషన్ చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. కానీ దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడం గమ నార్హం. వార్డులు, డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించి వాటిపై అభ్యంతరాలను స్వీకరించారు. ఆ మేరకు జాబితాలను సవరించి ఈ నెల 12న ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నారు. 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా, 16న ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను వెలువరించనున్నారు. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్, కార్పొరేటర్ స్థానాలు, మున్సిపాలిటీల్లో చైర్మన్, కౌన్సిలర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. వాటికి సంబంధించి గెజిట్ విడుదల చేసిన తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనున్నది. మిగతా ప్రక్రియ అంతా జరుగుతున్నప్పటికీ, ఆయా పదవులకు సంబంధించి రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన చేస్తారనే విషయమై ఎవరికి అంతు పట్టడం లేదు. జిల్లాలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌లో మున్సిపాలిటీలు ఉన్నాయి. రామగుండం కార్పొరేషన్‌లో 60 డివిజన్లు, పెద్దపల్లి మున్సిపాలిటీలో 36 వార్డులు, మంథనిలో 13 వార్డులు, సుల్తానాబాద్‌లో 15 వార్డులు ఉన్నాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎస్సీ జనరల్‌కు, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల చైర్మన్ పదవులను బీసీ మహిళలకు కేటాయించారు. ఈ రిజర్వేషన్లు పదేళ్ల వరకు అమలవుతాయని అప్పుడు తెచ్చిన చట్టంలో పేర్కొన్నారు. రిజర్వేషన్లు మారాలంటే ఐదేళ్లకోసారి రోటేషన్ పద్ధతిలో అమలు చేయాలని చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఎటు తేలకపోగా మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఇది వరకు ప్రాతినిధ్యం వహించిన డివిజన్లు, వార్డుల్లో మళ్లీ పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. వీరేగాకుండా కొత్తగా కూడా అనేక మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమకు తాముగా పరిచయం చేసుకునేందుకు ఇప్పటికే నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు పేరిట వాడల్లో ప్లెక్సీలు పోటాపోటీగా కడుతున్నారు. కొందరు నాయకులు రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాతనే రంగంలోకి దిగాలని, అప్పటి వరకు అనవసరంగా ఖర్చు పెట్టడం దేనికని భావిస్తున్నారు. పదేళ్లకోసారి రిజర్వేషన్లు రోటేట్ చేయాలనే నిబంధనను పంచాయతీ ఎన్నికల్లో మార్చినందున ఈ ఎన్నికల్లో కూడా మారుస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి రిజర్వేషన్లు మార్చాల్సి వస్తే మాత్రం ప్రభుత్వం అత్యవసరంగా కేబినెట్ సమావేశం నిర్వహించి చట్ట సవరణకు ఆమోదం పొందాల్సి ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఆమోదం తెలిపిన తర్వాత జీఓ వెలువరిస్తారని, ఆ వెంటనే రిజర్వేషన్ల మార్గదర్శకాలను అనుసరించి ఆయా స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించే పంచాయతీ ఎన్నికల్లో వలే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయ నున్నారు. ఈ రిజర్వేషన్ల రొటేషన్ విషయమై రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టత రావొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.