ఎక్సైజ్ నిబంధనలు బేఖాతర్
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:48 AM
కరీంనగర్ జిల్లాలో ఎక్సైజ్ నిబంధనలు ఉల్లంఘించి ఇటు వైన్‌షాపుల నిర్వాహకులు, అటు బార్ అండ్ రెస్టారెంట్‌ల నిర్వాహకులు యథేచ్ఛగా అదనపు కౌంటర్లు, అదనపు ఏర్పాట్లు చేస్తూ అక్రమదందాలు నిర్వహిస్తున్నారు.
కరీంనగర్ క్రైం, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ జిల్లాలో ఎక్సైజ్ నిబంధనలు ఉల్లంఘించి ఇటు వైన్‌షాపుల నిర్వాహకులు, అటు బార్ అండ్ రెస్టారెంట్‌ల నిర్వాహకులు యథేచ్ఛగా అదనపు కౌంటర్లు, అదనపు ఏర్పాట్లు చేస్తూ అక్రమదందాలు నిర్వహిస్తున్నారు. అడుగడుగునా ఎక్సైజ్ నిబంధనలు బేఖాతరు చేస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్దంగా బార్ అండ్‌రెస్టారెంట్‌లలో ‘జనతా’ కౌంటర్లు, వైన్‌షాపులకు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూంలలో బార్ మాదిరి ఏర్పాట్లు చేస్తున్నారు. అయినప్పటికీ ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బార్‌లలో అమలుకాని నిబంధనలు
బార్ అండ్ రెస్టారెంట్‌లలో ‘జనతా’ పేరిట అదనపు కౌంటర్‌లను ఏర్పాటు చేసి, బార్‌కు మరొక ద్వారాన్ని ఏర్పాటు చేసి యథేచ్ఛగా అక్రమదందా కొనసాగిస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్‌లకు నిబంధనల ప్రకారం ఒకే ప్రవేశ ద్వారం ఉండాలి. లోపల ఒకే మద్యం కౌంటర్ ఉండాలి. కానీ బార్‌కు అనుబంధంగా ‘జనతా’ పేరిట పెద్ద అక్షరాలతో బోర్డు ఏర్పాటు చేసి ఒక ప్రవేశ ద్వారంతో పాటు అదనపు కౌంటర్‌ను ఏర్పాటు చేసి అక్రమదందాకు తెరలేపుతున్నారు. ఈ జనతా కౌంటర్ల ద్వారా మద్యం రిటైల్ అమ్మకాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీని విషయంలోనే ఇటీవల కొందరు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదు. ఈ జనతా కౌంటర్‌లో నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల తరువాత తెరవాల్సి ఉండగా కొందరు ఉదయం 7 గంటలకే తెరచి అర్థరాత్రి వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. కరీంనగర్-జగిత్యాల మార్గంలోని ఒక బార్‌లోని జనతా కౌంటర్‌లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మరణించాడు. బార్‌లు కూడా నిర్ధేశిత స్థలంకు లైసెన్స్ ఫీజు చెల్లించి, ఆ మేరకే మద్యం సిట్టింగ్ నిర్వహించాలి. కానీ కొన్ని బార్ అండ్ రెస్టారెంట్‌లలో ఫీజు చెల్లించిన స్థలంకంటే రెట్టింపు స్థలంలో కుర్చీలు, టేబుళ్లు వేసి అదనపు కౌంటర్‌లు ఏర్పాటు చేసినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవటం లేదు. దీనిపై ఇటీవల కొందరు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఇష్టారాజ్యంగా పర్మిట్‌రూంలు
జిల్లాలో పర్మిట్‌రూంల పేరుతో మద్యం షాపుల పక్కన విచ్చలవిడిగా అక్రమ సిట్టింగ్‌లు నడుస్తున్నాయి. బార్‌లను తలదన్నే విధంగా సిట్టింగ్‌రూంలను నడుపుతున్నారు. మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ అధికారులు కుమ్మక్కై నిబంధనలు బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జగిత్యాల రోడ్‌లో, కోర్టు చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, కమాన్, విద్యానగర్, పద్మనగర్, హౌజింగ్‌బోర్డు కాలనీ తదితర ప్రాంతాల్లోని వైన్‌షాపులకు అనుబంధంగా ఉన్న పర్మిట్ గదుల్లో పదుల సంఖ్యలో టేబుళ్లు, కుర్చీలు, కూలర్లు, మిరిమిట్లుగొలిపే లైట్స్‌తో ఆకర్శణీయంగా ఏర్పాట్లు చేశారు. పర్మిట్ గదుల్లోనే ప్రత్యేకంగా ఒక మద్యం కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేసి లూజ్‌గా మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారు. మద్యం కల్తీ చేసి వినియోగదారులకు విక్రయిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కరీంనగర్‌లోని పలు వైన్‌షాపులకు అనుబంధంగా ఏర్పాటు చేసిన ప్రతి పర్మిట్ గదుల్లో బార్‌లకు తలదన్నే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ పర్మిట్ గదుల్లో ఇష్టారాజ్యంగా ఆహారపదార్థాలు విక్రయిస్తున్నారు. నగరంలోని చాలా చోట్ల వైన్‌షాపులు, పర్మిట్ గదులను అర్ధరాత్రి వరకు తెరచి ఉంచడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరీంనగర్‌లోని 90 శాతం వైన్‌షాపులకు పార్కింగ్ స్థలం లేదు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.