స్వీయగణనను అందరూ సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:05 AM
జనాభా లెక్కల్లో భాగంగా ఇళ్ల గణనకు సంబంధించి ప్రజలే స్వీయ గణన చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1881 సంవత్సరం నుంచి ప్రతీ పదేళ్ళకు ఒకసారి జనాభా లెక్కలు చేపడుతున్నారన్నారు.
పెద్దపల్లి, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): జనాభా లెక్కల్లో భాగంగా ఇళ్ల గణనకు సంబంధించి ప్రజలే స్వీయ గణన చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1881 సంవత్సరం నుంచి ప్రతీ పదేళ్ళకు ఒకసారి జనాభా లెక్కలు చేపడుతున్నారన్నారు. ఈసారి 16వ జనగణన జరగనున్నదని తెలిపారు. జనాభా లెక్కల సందర్భంగా తమ వద్దకు వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రతి ఒక్కరూ తమ వివరాలను ఇవ్వాలన్నారు. జనగణన రెండు దశల్లో నిర్వహిస్తారని పేర్కొన్నారు. మే 11 నుంచి జూన్ 9 వరకు మొదటి దశగా ఇళ్ల గణన చేపట్టి ఇళ్లకు సంబంధించిన 33 ప్రశ్నల వివరాలు సేకరిస్తామని చెప్పారు. రెండో దశలో వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జనాభా గణన నిర్వహిస్తామని తెలిపారు. జనగణన మొత్తం డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నామన్నారు.
జిల్లాలో మొత్తం 1548 హౌస్ లిస్టింగ్ బ్లాకులు గుర్తించగా, ప్రతి బ్లాక్‌లో సుమారు 300 ఇళ్లు, సుమారు 800 మంది జనాభా ఉంటారని తెలిపారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ గణనకు అవకాశం కల్పించామని తెలిపారు. వెబ్‌సైట్‌లో కుటుంబంలోని ఒక సభ్యుడు లాగిన్ అయి వివరాలు నమోదు చేస్తే సరిపోతుందని చెప్పారు. నమోదు అనంతరం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు 11 అంకెల ప్రత్యేక నంబర్ వస్తుందని, ఆ నంబర్‌ను ఎన్యూమరేటర్‌కు తప్పనిసరిగా ఇవ్వాలని తెలిపారు. ఏవైనా పొరపాట్లు ఉంటే ఎన్యూమరేటర్ ద్వారా మాత్రమే సరిచేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని తెలిపారు. ప్రతి ఎన్యూమరేటర్‌కు 11 అంకెల కోడ్ ఉన్న ఐడీ కార్డు ఉంటుందని చెప్పారు. డిజిటల్ విధానం వల్ల వేగంగా, కచ్చితంగా గణన పూర్తవుతుందని, డేటా గోప్యతకు పూర్తి భద్రత ఉంటుందని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ఈ యాసంగి సీజన్‌లో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా 345 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటివరకు సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడంతో ఇకపై మాన్యువల్ ట్రక్ షీట్ ఉండదని స్పష్టం చేశారు. రాబోయే రెండు రోజుల్లో కొనుగోలు వేగం పెరుగుతుందని, రోజుకు 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. గతంలో ఒక రోజులో 19 వేల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేశామని గుర్తు చేశారు. వేసవి తీవ్రత కారణంగా హమాలీల లోడింగ్ సమస్యలు ఉన్నప్పటికీ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ధాన్యాన్ని 112 రైస్‌మిల్లులకు కేటాయించినట్లు తెలిపారు. సీఎంఆర్ బియ్యం డెలివరీలో 2024-25ఖరీఫ్ 100 శాతం, రబీ 93 శాతం, 2025-26 ఖరీఫ్ 36 శాతం పూర్తయ్యిందని తెలిపారు. సీఎంఆర్ డెలివరీలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. విద్య, ఆరోగ్య రంగాలకు జిల్లా పరిపాలన అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రెండు సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్య అభివృద్ధిపై దృష్టి సారించినట్లు తెలిపారు. జిల్లాలోని 340 ప్రాథమిక పాఠశాలలకు రిసోర్స్ పర్సన్లు పంపి బోధనలో మెరుగుదల కోసం సూచనలు అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ఓరల్ రీడింగ్, రీడింగ్ కంప్రహెన్షన్, గణిత సామర్థ్యాలు వంటి పారామీటర్లలో పురోగతి సాధించామని చెప్పారు. ఈ పురోగతిని గుర్తించి ఎస్‌ఈఆర్‌టీ జిల్లాను రాష్ట్రంలో టాప్ పెర్ఫార్మర్‌గా గుర్తించి కేస్ స్టడీకి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఉన్నత పాఠశాలల్లో సీనియర్ ఉపాధ్యాయులతో ప్యానెల్ ఏర్పాటు చేసి ప్రతీ తరగతిని పరిశీలించి ఉపాధ్యాయులకు వ్యక్తిగతంగా సూచనలు ఇస్తున్నామని చెప్పారు. ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ ఏఓ ప్రకాష్, ఈడిఎం కవిత పాల్గొన్నారు.