అందరిదీ అదే మాట.. విలీనం వద్దు..
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:06 AM
అందరిదీ ఒకే మాట.. ఒకటే తీర్మానం.. సెస్‌ను పరిరక్షించుకోవాలి.. విద్యుత్ పంపిణీ వ్యవస్థ యథావిధిగా సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ద్వారా జరగాలి.. విద్యుత్ సరఫరా కోసం లైసెన్స్ రెన్యూవెల్ వెంటనే చేయాలంటూ సెస్ గ్రామ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
అందరిదీ ఒకే మాట.. ఒకటే తీర్మానం.. సెస్‌ను పరిరక్షించుకోవాలి.. విద్యుత్ పంపిణీ వ్యవస్థ యథావిధిగా సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ద్వారా జరగాలి.. విద్యుత్ సరఫరా కోసం లైసెన్స్ రెన్యూవెల్ వెంటనే చేయాలంటూ సెస్ గ్రామ ప్రతినిధులు డిమాండ్ చేశారు. గతంలో జరిగిన సెస్ మహాసభల్లో గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలు, అధికారుల నిర్లక్ష్యం, విద్యుత్ కోతలు, వంటి సమస్యలను ప్రస్తావిస్తూ వాడివేడిగా చర్చలు జరిగేవి. కానీ ఈసారి సెస్ సంస్థ నుంచి విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఎన్పీడీసీఎల్‌కు అప్పగించడం, సిరిసిల్లను కొత్త సర్కిల్‌గా ఏర్పాటుచేసి ముందుకు సాగుతున్న నేపథ్యంలో సెస్‌తో దాదాపు 56ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ గ్రామప్రతినిధులు ఎంతో ఉద్వేగంగా మహాసభలో ఇతర చర్చలకు తావివ్వకుండా సెస్ సంస్థ మళ్లీ యథావిధిగా కొనసాగించే విధంగా లైసెన్స్ రెన్యువెల్ చేయాలని గ్రామాల వారీగా తీర్మానాలు చేశారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయిమణికంఠ కల్యాణ మండపంలో చైర్మన్ చిక్కాల రామారావు అధ్యక్షతన సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం 52వ మహాసభ నిర్వహించారు. ఎన్పీడీసీఎల్‌కు విద్యుత్ బాధ్యతలు అప్పగించడంతో 2026-27 సంవత్సరానికి సంబంధించి రూ.709.02 కోట్లతో రూపొందించిన వార్షిక అంచనా బడ్జెట్ అంశం వాయిదా వేశారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి జమ-ఖర్చులు, ఆస్తి-అప్పుల పట్టికలు, అంచనా బడ్జెట్, వాస్తవ ఆదాయ, వ్యయాలను ఆమోదించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ ప్రతినిధులు మాట్లాడుతూ సెస్ పరిరక్షణకు తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. సెస్ కోసం ఎంతవరకైనా వెళ్తామని అన్నారు. ఎన్పీడీసీఎల్‌కు అప్పగించడం సరైన విధానం కాదని అన్నారు. సెస్ స్థాపనలో దివంగత మాజీ ఎమ్మెల్యేలు సీహెచ్ రాజేశ్వరరావు, నర్సింగరావు చేసిన కృషిని మననం చేసుకున్నారు. పాత స్టోర్ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు. చైర్మన్ చిక్కాల రామారావు స్టోర్స్ స్థలాన్ని తిరిగి అప్పగించే విధంగా హైకోర్టులో కేసు వేశామని వివరించారు. అన్ని గ్రామాల ప్రతినిధులు ఏకగ్రీవంగా సెస్‌ను కాపాడుకోవడం, సెస్‌కు విద్యుత్ సరఫరా లైసెన్స్ రెన్యూవెల్ చేయాలని తీర్మానాలు చేశారు. సభలో వైస్‌చైర్మన్ దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు దిడ్డి రమాదేవి, దార్నం లక్ష్మీనారాయణ, మల్లుగారి రవీందర్‌రెడ్డి, గౌరినేని నారాయణరావు, సందుపట్ల అంజిరెడ్డి, వరుస కృష్ణహరి, మాడుగుల మల్లేశం, పొన్నాల శ్రీనివాసరావు, ఆకుల గంగారం, రేగులపాటి హరిచరణ్‌రావు, ఆకుల దేవరాజం తదితరులు పాల్గొన్నారు.
అవినీతి అంటూ మూర్ఖుల ఆరోపణలు..
- సెస్ చైర్మన్ చిక్కాల రామారావు
సెస్‌లో అవినీతి జరగకపోయినా కొందరు మూర్ఖులు ఆరోపణలు చేస్తున్నారని, ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. సెస్ పాలకవర్గం అవినీతికి తావివ్వకుండా పనిచేస్తుందని, కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తన వద్దకు వచ్చారని గుర్తుచేశారు. ప్రయోజనాలు నెరవేరకపోవడంతోనే తప్పుడు ప్రచారంతో ఎన్పీడీసీఎల్‌కు అప్పగించే విధంగా చేశారని ఆరోపించారు. కొందరు దుర్మార్గులు చేసిన తీరు అన్యాయమని అన్నారు. సెస్‌ను కాపాడుకోవడానికి హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. మహాసభలో గ్రామ ప్రతినిధులు ఇచ్చిన తీర్మానాలను కోర్టుకు అందజేస్తామన్నారు. సెస్‌ను కాపాడుకోవడానికి ఐక్యంగా పనిచేయాలన్నారు. సెస్ స్థాపనలో దివంగత మాజీ ఎమ్మెల్యేలు సీహెచ్ రాజేశ్వరరావు, నర్సింహారావు చేసిన కృషిని గుర్తు చేశారు. 1970లో ప్రారంభించిన సెస్ 56 ఏట అడుగు పెట్టిందని, 3,46,855 మంది సభ్యులతో అభివృద్ధి పథంలో కొనసాగుతుందని అన్నారు. పవరూలూమ్ రంగం, వ్యవసాయ రంగానికి మెరుగైన విద్యుత్ సేవలు అందిస్తున్నామన్నారు. టెక్స్‌టైల్ పార్క్ అపెరల్ పార్క్‌లకు ప్రత్యేక సబ్ స్టేషన్ల ద్వారా నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తూ వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి, కార్మికుల ఉపాధికి కృషి చేస్తున్నామన్నారు. 2023-26 ఆర్థిక సంవత్సరాల్లో వ్యవసాయ రంగంలో నూతనంగా 3,294 విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. ఇందుకోసం రూ.17.75 కోట్లు వెచ్చించి మెరుగైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. జిల్లాలో 33/11 కేవీ ఉప కేంద్రాలు 77ఉండగా, అదనంగా 12 మంజూరైనట్లు తెలిపారు. మరో 12 కేంద్రాలు ఏర్పాటుకు ఎన్పీడీసీఎల్‌కు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. వీటితోపాటు ఆరు 132/33 కేవీ, కేంద్రాల మంజూరు కోసం ట్రాన్స్‌కోకు ప్రతిపాదనలు ఇచ్చామని తెలిపారు. అభివృద్ధి పథంలో నడుస్తున్న సెస్‌ను కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అవినీతి ముద్ర వేస్తూ విలీనం చేయాలని చేస్తున్న ప్రయత్నంలోనే విద్యుత్ పంపిణీ బాధ్యతలను ఎన్పీడీసీఎల్ అప్పగించారని అన్నారు. శాంతియుతంగా మహాసభ జరుపుకుంటున్న అధికారులు, ఉద్యోగులను సభకు వెళ్లనివ్వకుండా కొందరు బెదిరిస్తున్నట్లు తెలిసిందన్నారు. శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.